Business

డాలర్ పై రూపాయి పతనం – TNI వాణిజ్య వార్తలు – 24/02/2022

డాలర్ పై రూపాయి పతనం  – TNI  వాణిజ్య వార్తలు – 24/02/2022

* ఉక్రెయిన్‌పై ర‌ష్యా సైనిక చ‌ర్య‌కు దిగ‌డంతో డాల‌ర్‌పై రూపాయి మార‌కం విలువ గురువారం 102 పైస‌లు న‌ష్ట‌పోయింది. విదేశీ పెట్టుబ‌డిదారులు దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో స్టాక్స్ అమ్మ‌కాల‌కు దిగారు. గ్లోబ‌ల్ మార్కెట్‌లో క్రూడాయిల్ ధ‌ర బ్యారెల్‌పై 105 డాల‌ర్ల‌కు చేరుకున్న‌ది. దీంతో క్రూడాయిల్‌పై ఇన్వెస్ట‌ర్ల సెంటిమెంట్ బ‌ల‌ప‌డింది.ఇంట‌ర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్‌లో గురువారం అమెరికా డాల‌ర్‌పై రూపాయి 75.02 వ‌ద్ద మొద‌లై త‌ర్వాత రూ.75.75 వ‌ర‌కు ప‌డిపోయింది. తిరిగి రూ.75.63 వ‌ద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే డాల‌ర్‌పై రూపాయి మార‌కం విలువ 102 పైస‌లు న‌ష్ట‌పోయింది.

*ICICI బ్యాంకు కీలక నిర్ణయం.. NRIల ఖాతాలపై సర్వీస్ చార్జీల పెంపు
NRIల బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఐసీఐసీఐ బ్యాంకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాలపై విధించే సర్వీసు చార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించింది. సవరించిన చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మునుపటి స్థాయితో పోలిస్తే చార్జీలను బ్యాంకు ఒక శాతం మేర పెంచింది. ఎన్నారై రెగ్యులర్ అకౌంట్, ఎన్నారై ప్రో అకౌంట్, ఎన్నారై స్టూడెంట్ అకౌంట్, ఎన్నారై లో బ్యాలెన్స్ అకౌంట్, స్పర్శ్ అకౌంట్లలో బ్యాంకు నిబంధనల ప్రకారం కనీస నిల్వలు పాటించని పక్షంలో ఈ చార్జీలు విధిస్తామని బ్యాంకు ప్రకటించింది

* ఉక్రెయిన్‌లో బాంబుల మోత.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్ల సూచీలు
అనుకున్నట్టే అయ్యింది. నాటో దూకుడుకు అడ్డుకట్ట వేస్తున్నామంటూ ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలుపెట్టింది రష్యా. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌తో పాటు ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా చర్యలకు ప్రతిచర్య తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ హెచ్చరికలు జారీ చేశారు. గత కొన్ని నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగి యుద్ధం మొదలైపోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. ప్రపంచంలో రెండు అగ్రరాజ్యల మధ్య జరుగుతున్న యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో తెలియక పెట్టబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లపై యుద్ధ ప్రభావం నేరుగా కనిపిస్తుంది. ముఖ్యంగా దేశీ స్టాక్‌ మార్కెట్‌ బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు తీవ్రంగా నష్టపోతున్నాయి,.

* బంగారం కొనేవారికి భారీ షాక్.. భగ్గుమన్న ధరలు..!
మీరు బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్. నేడు బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఉక్రెయిన్ మీద రష్యా దాడికి దిగడంతో అంతర్జాతీయంగా పసిడి ధరలు భారీగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 2022లో గరిష్ట స్థాయికి పెరిగింది. ఎంసీఎక్స్’లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర ఈ రోజు ₹1,400కు పైగా పెరగడంతో ₹51,750 ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. స్పాట్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1950 డాలర్లకు చేరుకుంది. సుమారు 13 నెలలో ఇదే గరిష్టం. ఔన్స్ (28.3495 గ్రాములు) బంగారం ధర త్వరలో $1950-$2000 వరకు వెళ్ళవచ్చని మార్కెట్ నిపుణులు తెలిపారు.బులియన్ జేవెల్లర్స్ ప్రకారం.. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల(బిస్కెట్‌ గోల్డ్‌ 999) బంగారం ధర సుమారు రూ.1300కి పైగా పెరిగి రూ.51,419కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల(916) బంగారం ధర రూ.45,870 నుంచి రూ.47,100కు చేరుకుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.46000 నుంచి రూ.46,850కు పెరిగింది. అంటే ఒక్కరోజులో రూ.850 పెరిగింది అన్నమాట. ఇక బిస్కెట్‌ గోల్డ్‌ బంగారం ధర రూ.930 పెరిగి రూ.51,110కి చేరుకుంది.ఇక పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి ధర రూ.2300కి పైగా పెరిగి రూ.66,501కి చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి.

*అనంతపురం కియా యూనిట్‌ రికార్డు… రెండున్నరేళ్లలో..
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉన్న కియా ఇండియా యూనిట్‌ రెండున్నరేళ్లలోనే 5 లక్షల కార్లను ఉత్పత్తి చేసింది. ఇందులో 4 లక్షల కార్లను దేశీయంగా విక్రయించగా, ఇతర దేశాలకు లక్ష కార్లు ఎగుమతి చేసింది.2019 సెప్టెంబరులో కియా సెల్టోస్‌ మోడల్‌తో ఎగుమతులు ప్రారంభించి, ఇప్పటివరకు 91 దేశాలకు ఇక్కడినుంచి కియా కార్లను ఎగుమతి చేసినట్లు కియా ఇండియా వివరించింది. గత ఏడాది కార్ల ఎగుమతుల్లో 25 శాతం కియా ఇండియావే కావడం మరొక ప్రత్యేకత. 5 లక్షల కార్లను కేవలం 2.5 ఏళ్లలో విక్రయించి రికార్డు సృష్టించామని కియా ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ తే-జిన్‌ పార్క్‌ వివరించారు

* దేశంలో అతిపెద్ద రుణ మోసానికి పాల్పడిన ఏబీజీ షిప్‌యార్డ్‌ ప్రమోటర్ల అవకతవకలపై కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల నుంచి సేకరించిన రుణాలను ఏబీజీ ప్రమోటర్లు 38 విదేశీ అనుబంధ, 60 దేశీ కంపెనీల ద్వారా దారి మళ్లించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి దర్యాప్తు ఏజెన్సీలు మరింత సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నాయని వారు పేర్కొన్నారు. 38 విదేశీ కంపెనీల పూర్తి వివరాల కోసం సంబంధిత దేశాలకు దర్యాప్తు సంస్థలు లేఖ రాయనున్నాయని వారు వెల్లడించారు. విదేశీ కంపెనీల జాబితాలో సింగపూర్‌కు చెందిన కంపెనీ (ఏబీజీ సింగపూర్‌) కూడా ఉందని గతంలో కంపెనీ పద్దులపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరిపిన ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై) కూడా తన రిపోర్టులో పేర్కొంది.

* బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీలతోపాటు నాన్‌ ఫంగిబుల్‌ టోకెన్స్‌(ఎన్‌ఎ్‌ఫటీ) పెట్టుబడులను ప్రోత్సహించే ప్రకటనలకు అడ్వర్టైజింగ్‌ స్టాండర్స్‌ కౌన్సి ల్‌ ఆఫ్‌ ఇండియా (యాస్కీ) కళ్లెం వేసింది. అవి అనియంత్రిత , అధిక రిస్క్‌తో కూడిన పెట్టుబడి సాధనాలని ప్రజలకు తెలిపే డిస్‌క్లెయిమర్‌ను ప్రకటనల్లో ప్రముఖంగా ప్రదర్శించాల్సిందేనని మార్గదర్శకాలు జారీ చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని యాస్కీ స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ డిజిటల్‌ ఆస్తుల్లో పెట్టుబడులపై నష్టాలకు ఎవరూ బాఽధ్యత వహించరని, ప్రభుత్వ నియంత్రణ మండళ్లను కూడా ఆశ్రయించలేరన్న విషయాన్ని ప్రకటనల్లో ప్రస్తావించాలని ప్రచారకర్తలను నిర్దేశించింది. ప్రింట్‌ మీడియా లేదా హోర్డింగ్‌ ప్రకటన మొత్తం స్థలంలో 20 శాతం డిస్‌క్లెయిమర్‌కు కేటాయించాలని, వీడియో ప్రకటనల చివర్లో ప్లేన్‌ బ్యాక్‌గ్రౌండ్‌పై ముద్రించిన డిస్‌క్లెయిమర్‌ సమాచారాన్ని సాధారణ వేగంతో కూడిన స్వరంతో చదివి వినిపించాలని సూచించింది.

* నాగార్జునా ఆయిల్‌ కార్పొరేషన్‌ అనుబంధ సంస్థ కోస్టల్‌ అయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ను (సీఓజీఐఎల్‌) హల్దియా పెట్రోకెమికల్స్‌ లిక్విడేషన్‌ ప్రక్రియలో చేజిక్కించుకుంది. ఛటర్జీ గ్రూప్‌ (టీసీజీ) అనుబంధ సంస్థ హెచ్‌పీఎల్‌ సమర్పించిన లిక్విడేషన్‌ ప్లాన్‌ను ఎన్‌సీఎల్‌టీ అమరావతి బెంచి గత వారంలో ఆమోదించింది. కొనుగోలు కోసం రూ.37.5 కోట్లు చెల్లించేందుకు హెచ్‌పీఎల్‌ అంగీకరించింది. గత రెండేళ్ల కాలంలో దివాలా ప్రక్రియలో టీసీజీ గ్రూప్‌ చేజిక్కించుకున్న మూడో కంపెనీ ఇది. విశాఖపట్నంలో రిజిస్టర్‌ అయిన సీఓజీఐఎల్‌కు తమిళనాడులోని కడలూర్‌లో 322 ఎకరాల భూమి ఉంది. అది ఈ లిక్విడేషన్‌ ప్రక్రియలో హెచ్‌పీఎల్‌ చేతికి మారుతుంది.

* ఐకియా ఇండియా సీఈఓగా సుసన్నే పల్వెరర్‌ను నియమించింది. ఐకియా ఇండియా సీఈఓగా ఒక మహిళను నియమించడం ఇదే మొదటిసారి. ఆమె ఐకియా ఇండియాకు చీఫ్‌ సస్టెయినబిలిటీ ఆఫీసర్‌(సీఎ్‌సఓ)గా కూడా వ్యవహరిస్తారు

*దేశీయంగా ఎలకా్ట్రనిక్ చిప్, డిస్ప్లే తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు పలు కంపెనీలు రెడీ అవుతున్నాయి. సుమారు రూ.1,53,750 కోట్ల (2,050 కోట్ల డాలర్లు) పెట్టుబడితో ఈ ప్లాంట్లను నెలకొల్పేందుకు ఐదు కంపెనీలు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. వేదాంత ఫాక్స్కాన్ భాగస్వామ్య సంస్థ, ఐజీఎ్సఎస్ వెంచర్స్, ఐఎ్సఎంసీ 130.6 కోట్ల డాలర్ల (రూ.1.02 లక్షల కోట్లు) పెట్టుబడితో ఎలకా్ట్రనిక్ చిప్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాయని తెలిపింది. అంతేకాకుండా రూ.76,000 కోట్లతో కూడిన సెమీకాన్ ఇండియా కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ.42,000 కోట్ల మేర పెట్టుబడుల మద్దతును ఈ కంపెనీలు కోరుతున్నాయని పేర్కొంది.

*ఆర్థికంగా దివాలా తీసిన ల్యాంకో గ్రూప్నకు ఉత్తరప్రదేశ్లోని అన్పరలో ఉన్న 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ను కొనుగోలు చేసేందుకు మూడు కంపెనీలు బిడ్లు సమర్పించాయి. ఈ జాబితా లో హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్), ఐల్యాబ్స్ గ్రూప్తో పాటు ఢిల్లీకి చెందిన హిందుస్తాన్ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (హెచ్పీపీఎల్) ఉన్నాయి. ల్యాంకో గ్రూప్ రుణదాతలు బకాయిల రికవరీ కోసం ఈ ప్లాంట్ను అమ్మకానికి పెట్టాయి.

* ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ప్లాంట్ నుంచి 5 లక్షల కార్లను దేశీయ, ఎగుమతి మార్కెట్లకు తరలించిన మైలురాయిని కియా ఇండియా అధిగమించింది. మరోవైపు దేశంలో 4 లక్షల కార్ల విక్రయాల మైలురాయిని కూడా కంపెనీ అధిగమించింది. కియా.. 2019 సెప్టెంబరులో సెల్టోస్ ఎగుమతితో విదేశీ మార్కెట్లకు విస్తరించిన నాటి నుంచి 91కి పైగా దేశాలకు లక్షకు పైగా కార్లు ఎగుమతి చేసింది. భారత్ నుంచి యుటిలిటీ వాహనాల భారీ ఎగుమతిదారుగా కూడా నిలిచింది.

*దేశంలో విద్యుత్తో నడిచే ద్విచక్ర వాహనాల కోసం చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందకు బీపీసీఎల్, ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ చేతు లు కలిపాయి. ఢిల్లీ, బెంగళూరుతో ప్రారంభించి తొలి దశలో 9 నగరాల్లో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, తదుపరి దశలో అన్ని నగరాలకు విస్తరిస్తామని బీపీసీఎల్ తెలిపింది. ప్రారంభంలో బీపీసీఎల్ పెట్రోల్ పంపుల్లోనే ఈ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ప్రతి ఒక్క చార్జింగ్ స్టేషన్లోనూ ద్విచక్ర వాహనాల కోసం బహుళ ఎసీ, డీసీ చార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది

*హైదరాబాద్, విశాఖపట్నంతో సహా దేశంలోని 18 డెట్ రికవరీ ట్రైబ్యునల్స్ (డీఆర్టీ)లకు కేంద్ర ప్రభుత్వం ప్రిసైడింగ్ అధికారులను నియమించింది. కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఇందుకు ఆమోదం తెలిపింది. వీరు నాలుగేళ్లు లేదా 70 ఏళ్ల వయసు వచ్చే వరకు.. ఏది ముందె ౖతే అప్పటి వరకు ఈ పదవుల్లో ఉంటారు. హైదరాబాద్-1 డీఆర్టీ ప్రిసైడింగ్ అధికారిగా ఏపీ జుడిషీయల్ సర్వీసెస్ రిటైర్డ్ న్యాయమూర్తి గుమ్మడి గోపీచంద్, హైదరాబాద్-2 డీఆర్టీ ప్రిసైడింగ్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) డాక్టర్ బల్దేవ్ సింగ్ నియమితులయ్యారు. విశాఖపట్నం డీఆర్టీ ప్రిసైడింగ్ అధికారిగా బిహార్ జుడిషియల్ సర్వీస్ రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి కృష్ణ గోపాల్ ద్వివేది నియమితులయ్యారు.

*ప్రపంచ ఇంజనీరింగ్, డిజిటల్ సర్వీసుల ఉత్పత్తి అభివృద్ధి సంస్థ టాటా టెక్నాలజీస్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో కనీసం మరో 1000 మందిని నియమించుకోవాలని భావిస్తోంది. రాబోయే 12 నెలల కాలంలో మూడు వేల మంది ఇన్నోవేటర్లను నియమించుకోనున్నట్టు జనవరిలో కంపెనీ ప్రకటించింది. దానికి అదనంగా మరో వెయ్యి మందిని నియమించుకోనున్నట్టు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ వారెన్ హారిస్ చెప్పారు.

*వచ్చే ఆర్థిక సంవత్సరం (2022- 23)లోనూ టెలికాం కంపెనీల నుంచి లభించే ఆదాయం బడ్జెట్ అంచనాలు మించుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కాలానికి ఈ రంగం నుంచి రూ.52,806.36 కోట్ల ఆదాయం లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి తాజా బడ్జెట్లో ప్రకటించారు. అయితే త్వరలో 5జీ స్పెక్ట్రమ్ వేలం ఉన్నందున ఈ ఆదాయం మరింత ఎక్కువగానే ఉంటుందని టెలికాం శాఖ కార్యదర్శి రాజారామన్ చెప్పారు. అయితే ఇది ఎంత ఎక్కువగా ఉంటుందనే విషయం మాత్రం చెప్పలేనన్నారు. 5జీ స్పెక్ట్రమ్ వేలం కనీస ధరపై ట్రాయ్ నివేదిక అందితేగానీ దీనిపై ఒక అంచనాకు రాలేమన్నారు.

*చిత్రా రామకృష్ణ హయాంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎ్సఈ)లో చోటు చేసుకున్న ‘కోలొకేషన్’ కుంభకోణంపై దర్యాప్తును సీబీఐ మరింత విస్తృతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా ఎన్ఎ్సఈ మాజీ సీఈఓ రవి నారాయణ్ను ప్రశ్నించింది.