గంగూబాయ్ కతియావాడి’ సినిమా కోసం నిర్మాతలుపెట్టిన రూ. 200 కోట్ల ఖర్చు బూడిదలో పోసిన పన్నీరే. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఘోరంగా విఫలమవబోతుండటానికి ఇందులో తారాగణమే ప్రధాన కారణం’ అని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఘాటైన విమర్శలు చేశారు. పరోక్షంగా అలియాభట్‌ను ఉద్దేశించి ఆమె ఈ విమర్శలు చేశారు. అలియాభట్ టైటిల్ రోల్‌లో నటించిన ‘గంగూబాయ్…’ ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలవుతోంది. అలియాభట్, నిర్మాత కరణ్ జోహార్, ఈసినిమాని ఉద్దేశించి కంగన విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో అలియా పేరు నేరుగా ప్రస్తావించకుండా ‘అందమైన మూర్ఖురాలు’ అంటూ ఎద్దేవా చేశారు. ఈ పాప కూడా నటించగలదని నిరూపించడానికి మూవీ మాఫియా డాడీ తెగించాడు, ఇప్పుడు ఈ సినిమాలో నటించిన అగ్రహీరో, దర్శకుడు కూడా ఆయన బాధితుల జాబితాలో చేరారు అని పరోక్షంగా కరణ్ జోహార్‌ను ప్రస్తావిస్తూ ఆమె చెప్పుకొచ్చారు. ఒంటిచేత్తో చిత్రపరిశ్రమలో పని సంస్కృతిని నాశనం చేయడమే కాకుండా పెద్ద దర్శకులను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి వారితో సినిమాలు తీస్తున్న ఇలాంటి వాళ్లని పోత్రహించడం ప్రజలు మానుకోవాలి అని కంగన కోరారు. దక్షిణాది చిత్రాలు, హాలీవుడ్ చిత్రాలు ఇక్కడ ఆడుతున్నాయి. మూవీ మాఫియా చేతుల్లో ఉన్నంతవరకూ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎలాంటి అద్భుతాలు జరగవు, వారు హిందీ చిత్రసీమను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారని కంగన విరుచుకుపడ్డారు.