*ఆలస్యంగా వస్తే లీవ్‌లో ఉన్నట్లే.. ఉద్యోగులకు ఏపీ సర్కారు షాక్
ఇప్పటికే పీఆర్సీ విషయంలో ఏపీలోని వైసీపీ సర్కారు వ్యవహరించిన తీరుతో ఉద్యోగులు తీవ్ర మనస్తాపానికి గురైన సంగతి తెలిసిందే. ఏదోలా ఆ సమస్య తీరిపోయిందని ఉద్యోగులు భావిస్తున్నతరుణంలో వైసీపీ సర్కారు ఉద్యోగులకు మరో షాకిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించాల్సిందేనని, ఇకపై ఆలస్యంగా విధులకు వస్తే.. ఆ రోజున లీవ్ పెట్టినట్టుగానే పరిగణించాల్సి వస్తుందని ఏపీ ప్రభుత్వం శనివారం నాడు ఏకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు అమల్లోకి వస్తే.. 10 గంటలకు కార్యాలయాలకు రావాల్సిన ఉద్యోగులు ఓ 10నిమిషాల వరకు ఆలస్యమైతే ఫరవా లేదు గానీ.. అంతకు ఒక్క నిమిషం లేటైనా సెలవు పడిపోతుంది. అంతేకాకుండా 10.10 గంటల నుంచి 11 గంటల మధ్యలో కార్యాలయానికి వచ్చేందుకు నెలకు మూడు పర్యాయాలు మాత్రమే అనుమతి ఉంటుందట. ఆ పరిమితి దాటేస్తే.. ఇక వేతనంలో కోత మొదలైపోతుందట. ఈ మేరకు ఏపీ ఆర్ధిక శాఖ విడుదల చేసిన ఉత్తర్వులపై ఇప్పుడు ఏపీ ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
* ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు: కిషన్‌రెడ్డి
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావటానికి కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధం పరిష్కారం కాదు.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతీయ విదేశీ విధానంతో అందరకీ ఆదర్శవంతం అవుతుందన్నారు. భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. భారతీయల తరలింపులో ప్లాన్ ఏ..బీ..సీలను అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థులు ఉన్న యూనివర్సిటీలు, హాస్టళ్లను గుర్తిస్తున్నామని తెలిపారు. భారతీయ విద్యార్థులు ధైర్యంగా ఉండాలన్నారు. విదేశాంగ శాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు
* ప్రకాశం జిల్లాలోని మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ సాధన సమితి నాయకులు ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తున్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దీక్ష శిబిరం నుంచి వెళ్తుండగా సాధన సమితి నాయకులు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. మంత్రి కారు నుంచి దిగి దీక్ష శిబిరం వద్దకు వెళ్లి దీక్ష చేస్తున్న వారితో మాట్లాడారు.
* గుంటూరు జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో వైసీపీ సర్పంచ్‌లు ఆందోళనకు దిగారు. కొల్లూరు మండలం గాజుర్లంక ఇసుక రిచ్ వద్ద ఇసుక లారీలను సర్పంచులు అడ్డుకున్నారు. జేపీ కంపెనీ ఇసుక పేద ప్రజలకు అందకుండా చేస్తుందని ఆరోపణలు చేశారు. ఇసుక తరలింపులో జేపీ సంస్థ కి ఒక న్యాయం తమకు ఒక న్యాయమా…? అని ప్రశ్నించారు. ఇసుక అధిక లోడ్‌తో లారీలు నడవటం వల్ల గ్రామాల్లో ఉన్న రోడ్డు మొత్తం నాశనం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక లోతుగా తవ్వడం వల్ల చుట్టుపక్కల గ్రామాలలో భూగర్భజలాలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మార్వో, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సర్పంచ్‌లకు సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు
* ఐదో దశ పోలింగ్‌లో అదృష్టం పరీక్షించుకోనున్న దిగ్గజ నేతలు
యూపీ అసెంబ్లీ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ఆదివారం జరగనుంది. ఐదో దశలో 692 మంది అభ్యర్ధుల భవితవ్యాన్ని 2.24 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. చిత్రకూట్, సుల్తాన్పూర్, ప్రతాప్‌ఘఢ్, కౌషంబి, ప్రయాగరాజ్, బారాబంకి, బహ్రెచ్, స్రవస్తి, గోండా జిల్లాలతో పాటు కాంగ్రెస్ కంచుకోటలుగా పేరొందిన అమేధి, రాయ్‌బరేలి రామమందిర నిర్మాణ ఉద్యమ కేంద్రం అయోధ్యలో ఐదో దశ పోలింగ్ జరగనుంది. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య వంటి ప్రముఖులు ఐదో దశ పోరులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సిరాతు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలిచారు.
ఇక మంత్రులు సిద్ధార్ధ్ నాద్ సింగ్ (అలహాబాద్ వెస్ట్), రాజేంద్ర సింగ్ అలియాస్ మోతి సింగ్ (ప్రతాప్‌ఘఢ్), నంద్ గోపాల్ గుప్తా(అలహాబాద్ సౌత్), రమాపతి శాస్త్రి (మంకాపూర్), కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ తల్లి, అప్నాదళ్ నేత కృష్ణా పటేల్ అప్నాదళ్ కే తరపున ఐదో దశ పోరులో నిలిచారు. ఇక కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత ఆరాధనా మిశ్రా ప్రతాప్‌ఘఢ్ జిల్లా రాంపూర్ ఖాస్ స్ధానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.
* హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తింటూ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన కమలాపూర్ మండలం శ్రీరాములపల్లిలో జరిగింది. శ్రీరాములపల్లి ప్రభుత్వ పాఠశాలలోని 70 మంది విద్యార్థులు భోజనం తినగా 30 మందికి అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురయిన విద్యార్థులను శ్రీరాములపల్లె పాఠశాల నుంచి 108 ద్వారా స్థానిక కమలాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు
* విద్యార్థును తొందరగా వెనక్కి తీసుకురావాలి : రాహుల్ గాంధీ
ఉక్రెయిన్‌లోని భారతీయులు దుర్భర పరిస్థితిలో ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ఇరుక్కుపోయిన భారతీయులను కేంద్రం వెంటనే సురక్షితంగా భారత్‌కు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఉక్రెయిన్‌లోని బంకర్లో ఉన్న కర్నాటక విద్యార్థులకు సంబంధించిన ఓ వీడియోను రాహుల్ ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. ఈ విజువల్స్‌లో ఉన్న భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రష్యా టార్గెట్‌గా ఉన్న తూర్పు ఉక్రెయిన్‌లో చాలా మంది ఇరుక్కుపోయారు. మరో సారి కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడ ఇరుక్కున భారతీయులు, భారతీయ విద్యార్థులను వెంటనే భారత్‌కు తీసుకుండి అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.
* రాజంపేట జిల్లా సాధన సమితి నేతల పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ముందుగానే ఉద్యమకారులను అరెస్టు చేశారు. శాంతియుత ఉద్యమాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పాలని ఐకాస నాయకులు ప్రశ్నించారు
* ఏపీ విద్యార్థులను తీసుకొచ్చేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్టు రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు నేతృత్వంలో కమిటీ వెల్లడించింది. ఉక్రెయిన్‌లో ఉన్న 423 మంది ఏపీ విద్యార్థులను మ్యాపింగ్ చేశామన్నారు. విద్యార్థులకు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సూచనలిస్తున్నామన్నారు. 23 మంది విద్యార్థులు వస్తున్నారని కేంద్రం సమాచారమిచ్చిందన్నారు. అందులో ఏపీకి చెందిన వారు ముగ్గురే ఉన్నారని కృష్ణబాబు తెలిపారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. సరిహద్దు ప్రాంతాలకు వెళ్లొద్దని విద్యార్థులకు సూచిస్తున్నామన్నారు. ఉక్రెయిన్‌లో 7 వర్సిటీల్లో ఏపీ విద్యార్థులు చదువుతున్నారని కృష్ణబాబు తెలిపారు.
* ఇండోనేషియాలో శుక్రవారం సంభవించిన భూకంపంలో ఏడుగురు మరణించగా, మరో 85 మంది గాయపడ్డారు. ఇండోనేషియా పశ్చిమ సుమత్రా దీవుల్లోని పసమాన్ బరత్, పసమాన్ జిల్లాల్లో వచ్చిన ఈ భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. భూకంప తీవ్రతకు దాదాపు పదివేలకు పైగా ఇండ్లు, బిల్డింగులు ధ్వంసమైనట్లు అక్కడి అధికారులు చెప్పారు. ఐదు వేల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి, 35 ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేశారు. బాధితుల్ని ఆదుకునేందుకు ఇంకా రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని, కనిపించకుండా పోయిన ప్రజల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
* ఖైరతాబాద్‌లో నదుల పరిరక్షణపై జాతీయ స్థాయి సదస్సు జరగనుంది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ భవన్లో రెండ్రోజుల సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్ అధ్యక్షత వహించనున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి 200 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు.
* ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలను ప్రారంభించాలని మాజీ జడ్జి, హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ శనివారం దీక్ష చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక్‌లో ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సబ్ ప్లాన్ నిధులను నవరత్నాలకు బదిలీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా ఇచ్చిన నిధులను సబ్ ప్లాన్ నిధులలో కలిపి చూపించడం చట్టవిరుద్దమని శ్రవణ్ కుమార్ చెప్పారు.
* ఇండోనేసియా సుమత్రా దీవుల్ని శుక్రవారం భారీ భూకంపం కుదిపేసింది. ఈ భూకంపం ధాటికి వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. 85 మంది గాయపడ్డారు. 5 వేల మందికి పైగా ప్రజలు ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.2గా నమోదైంది. మలేసియా, సింగపూర్‌లో భూ ప్రకంపనలు ప్రజల్ని భయపెట్టాయి. పశ్చిమ సుమ త్రా ప్రావిన్స్‌లోని బుకిటింగి పట్టణం భూకం ప కేంద్రంగా ఉంది. భూ ఉపరితలానికి 12 కిలోమీటర్ల దిగువన భూమి కంపించినట్టుగా అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
* ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన ఆవిష్కరణలలో ముందుకు సాగుతున్న ఏపీ పోలీస్.. ‘డిజిటల్ టెక్నాలజీ సభ–2022’ అవార్డులను గెలుచుకుంది. వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 15 డిజిటల్ టెక్నాలజీ అవార్డులు దక్కించుకుని దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
* ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రము ఖులను ఆహ్వానిస్తున్నారు. ఇందులోభాగంగా సూపర్‌స్టార్ రజనీ కాంత్‌కు ఆహ్వానం పంపారు. అదేవిధంగా అన్నాడీఎంకే కన్వీనర్ ఓ. పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్ ఎడప్పాడి కె.పళనిస్వామికి కూడా ఆహ్వానం వెళ్ళింది. ‘ఉంగలిల్ ఒరువన్’ పేరుతో ముఖ్యమంత్రి తన ఆత్మకథను రాశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ నెల 28న నందంబాక్కంలోని ట్రేడ్ సెంటరులో జరుగనుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. వీరితోపాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, బిహార్ అసెంబ్లీ విపక్ష నేత తేజస్వీయాదవ్ తదితరులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రజనీకాంత్‌కు ఆహ్వానం పంపారు. అదేవిధంగా రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయ నేతలైన ఓపీఎస్, ఈపీఎస్, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, పీఎంకే వ్యవస్థాక అధ్యక్షుడు డాక్టర్ రాందాస్ తదితరులకు కూడా ఆహ్వానాలు పంపించారు.
*శ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలో సమస్యలు పరిష్కారించాలంటూ సీపీఎం చేపట్టిన 100 గంటల నిరవధిక దీక్ష ఈరోజు ఉదయానికి పూర్తి అయ్యింది. అయినప్పటికీ అధికారులు పట్టించుకోని పరిస్థితి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఎం కార్యకర్తలు… మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్ళేందుకు ప్రయత్నించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. సీపీఎం నేతలు కావురు పెద్దిరాజు, త్రిమూర్తులు పొన్నాడ రాములును పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టులను నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా చేపట్టింది
*అంతర్రాష్ట్ర డ్రగ్స్ రవాణా గుట్టును రాచకొండ ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని లంబసింగి నుంచి సంగారెడ్డికి డ్రగ్స్ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నలుగురు డ్రగ్స్ వ్యాపారులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రూ.32 లక్షలు విలువ చేసే 80 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు కార్లను సీజ్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయంలో నిందితులను ఎల్బీనగర్ జోన్ డీసీపీ సంప్రీత్ సింగ్ మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించనున్నారు.
*ఉక్రెయిన్ విద్యార్థుల కోసం విమాన టికెట్లు ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశం ఉక్రెయిన్ విద్యార్థులకు విమాన టికెట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ నుంచి సొంత ప్రాంతాలకు చేరేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. విమాన టికెట్లు కొనలేని విద్యార్థులకు ఆ ఖర్చు ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఏపీ భవన్ నుంచి విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
*ఉక్రెయిన్‌పై యద్ధోన్మాదంతో పేట్రేగిపోతున్న రష్యా.. తనను నిలువరించేందుకు యత్నిస్తున్న దేశాలను తనదైన శైలి హెచ్చరికలతో బెదిరిస్తోంది. తనపై ఆంక్షలు విధిస్తే.. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌ను కూల్చేస్తామని రష్యా సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు రష్యా స్పేస్ డైరెక్టర్ ఈ భీతావహ ప్రకటనను విడుదల చేశారు. ఉక్రెయిన్‌తో ఉన్న సమస్యలను చర్చలతోనే పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్య సమితి సహా చాలా దేశాలు రష్యాకు చెప్పాయి. అయితే ఏ దేశం మాట కూడా లెక్కపెట్టని రష్యా అధ్ిక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధానికి తెగబడ్డారు. ఈ క్రమంలో అమెరికా, నాటో దేశాలు రష్యాపై పలు ఆంక్షలను విధించాయి. తాజాగా శుక్రవారం నాడు రష్యాపై అమెరికా సైబర్ దాడులకు దిగింది. పుతిన్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తామంటూ యూరోపియన్ యూనియన్ హెచ్గరించింది
*రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు రాజంపేట బార్డర్ వెంకట్రా జంపేట నుండి కడప వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. కాగా.. 144 సెక్షన్ పేరుతో పోలీసులు పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముందస్తుగా బీజేపీ నేత నాగు బోతురమేష్తో పాటు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. జేఏసీ కన్వీనర్ టీడీపీ నేత చంగల్ రాయుడును అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
*రాష్ట్రంలో కొవిడ్ కేసులు బెంగళూరు మినహా 29 జిల్లాలోనూ తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తం గా 628 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా రెండు జిల్లాల్లో ఒక కేసు కూడా నమోదు కాలేదు. మరో 14 జిల్లాలో పదిలోపు బాధితులు నమోదయ్యారు. 13 జిల్లాల్లో 30లోపు బాధితులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1349 మంది కోలుకున్నారు. 15మంది మృతిచెందారు. 30 జిల్లాల్లో 7518 మంది చికిత్సలు పొందుతున్నారు. బెంగళూరులో 3,97 3 మంది అత్యధికం కాగా బీదర్, గదగ్ జిల్లాల్లో 9 మంది చికిత్స పొందుతున్నారు
*కాళేశ్వరం-మల్లన్నసాగర్ పాజెక్టు పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్టు పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలిపారు. తెలంగాణ ప్రాంతం కళల కాణాచిగా గుర్తింపు పొందిందన్నారు. అందుకు అనుగుణంగా మల్లన్నసాగర్, యాదాద్రి, కొమురెల్లి మల్లన్న ఆలయం, కొండపోచమ్మ, రంగనాయక్‌సాగర్ బస్వాపూర్ తదితర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూ.1500 కోట్లు కేటాయించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారని ఆయన తెలిపారు. వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించినవెంటనే పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఏడాదిన్నర కాలంలో ఈ పనులు పూర్తి చేయించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారని శ్రీనివాస్ గుప్త చెప్పారు.
*ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డితో నటుడు పోసాని కృష్ణమురళీ సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వారిద్దరూ కొద్ది సేపు భేటీ అయ్యారు. ఇటీవల సినిమా టికెట్ల ధరలపై సినీరంగ ప్రముఖులు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. ఈ బృందంలో పోసాని కూడా ఉన్నారు. మరోమారు జగన్‌ను పోసాని కలవడం ఆసక్తిని రేపింది.
*ఉన్నత విద్యా కోర్సులను ప్రాంతీయ భాషల్లోనూ ప్రవేశపెట్టడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కసరత్తు చేస్తోంది. వృత్తి విద్యా కోర్సులు సహా పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయుల్లో భారతీయ భాషల్లో పూర్తిస్థాయి కోర్సులను ప్రవేశపెట్టే అంశాలను పరిశీలించాలని కేంద్రీయ, ఆయా రాష్ట్రాల విశ్వవిద్యాలయాలకు యూజీసీ సూచించింది. ఈ విషయాన్ని యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ ధ్రువీకరించారు.
*కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహూల్గాంధీల నాయకత్వంలో మార్చి 21న సంగారెడ్డి అంబేడ్కర్ స్టేడియంలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి తెలిపారు. ఈ సభకు కేవలం సంగారెడ్డి నియోజకవర్గం నుంచే లక్ష మందిని సమీకరిస్తామన్నారు.
*పాకిస్థాన్ ఆర్మీలో ఇద్దరు హిందూ అధికారులకు పదోన్నతి లభించింది. మేజర్ డాక్టర్ కేలాశ్ కుమార్, మేజర్ డాక్టర్ అనీల్ కుమార్‌లకు లెఫ్టినెంట్ కల్నల్లుగా పాక్ ఆర్మీ పదోన్నతి కల్పించింది. ఈ మేరకు ఆ దేశ అధికార మీడియా ప్రకటించింది. వారి పదోన్నతులను పాకిస్థాన్ ఆర్మీ ప్రమోషన్ బోర్డు ఆమోదించిందని మీడియా కథనాలు వెలువడ్డాయి. ఒక ఇస్లామిక్ దేశంలో ఇద్దరు హిందూ అధికారులకు ఈ స్థాయిలో పదోన్నతి కల్పించడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి. మేజర్ కేలాశ్, మేజర్ అనీల్ ఇద్దరూ సింధ్ ప్రావిన్స్‌కు చెందిన వారు. కేలాశ్ది థార్పర్కార్ జిల్లా. 1981లో ఆయన జన్మించారు. జామ్షోరోలో లియాక్వాత్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ హెల్త్ అండ్ సైన్సె్‌సలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 2008లో పాక్ ఆర్మీలో చేరారు. అలాగే 2019లో హిందూ కమ్యూనిటీ నుంచి మేజర్ అయిన మొదటి వ్యక్తి కూడా కేలాశే. ఇక అనీల్ కుమార్‌ది సింధ్‌లోని బదిన్. కేలాశ్ కన్నా ఏడాది చిన్నవారైన ఆయన 2007లో పాక్ ఆర్మీలో చేరారు. ఆ ఇద్దరికి పాక్ ఆర్మీ పదోన్నతి కల్పించిందని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టీవీ చానెల్ కూడా ట్వీట్ చేసింది.
*థియేటర్లపై ప్రభుత్వ ఆంక్షలు.. అధికారుల తనిఖీలు.. ఇవేవీ ఏపీలో పవన్ కల్యాణ్ అభిమానుల ఉత్సాహాన్ని ఆపలేకపోయాయి! ‘భీమ్లానాయక్’ సినిమా విడుదలైన థియేటర్లన్నీ అభిమానులతో జనసంద్రాలను తలపించాయి! అయితే.. బెనిఫిట్ షోలను రద్దు చేయడం, ఐదో షో వేసుకోకపోవడానికి అనుమతివ్వకపోవడం, ‘భీమ్లా’ విడుదలైన థియేటర్లలో అధికారులు తనిఖీలు చేయడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం వారి ఆగ్రహాన్ని పట్టించుకోకుండా తమపని తాము చేసుకుపోయారు. చిత్తూరు జిల్లాలో రెవెన్యూ, పోలీసు అధికారులు గురువారం నుంచే థియేటర్లలో తనిఖీలు చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే థియేటర్లను సీజ్ చేస్తామని హెచ్చరిస్తూ నోటీసులు ఇచ్చారు. కుప్పం, పుంగనూరుల్లో ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా అభిమానులు నినాదాలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని థియేటర్లను అధికారులు తనిఖీలు చేశారు.
*నెల్లూరు జిల్లా కృష్ణపట్నం శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్కేంద్రం ఆపరేషన్, నిర్వహణ బాధ్యతను ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధమైపోయింది. ఇందుకోసం ప్రత్యేకంగా కన్సల్టెన్సీని నియమించాలని బోర్డు సమావేశం తీర్మానించింది. విజయవాడ విద్యుత్ సౌధలో గురువారం ఈ భేటీ జరిగింది. తెలంగాణ డిస్కమ్‌ల ప్రతినిధులూ హాజరయ్యారు. కృష్ణపట్నం థర్మల్ను మూడో వ్యక్తులకు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేంద్రంలో ఆ డిస్కమ్‌ల వాటా 27ు మాత్రమే వాటా ఉండడంతో.. వాటి వాదన వీగిపోయింది.
*మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్(82) ఇకలేరు. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూసినట్లు ఆయన కుమార్తె సునీత తెలిపారు. ఆయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా అఖిల పక్ష నాయకులు, ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్రంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా పేరొందిన హేమానంద రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తొలుత 1989 డిసెంబర్ 7వ తేదీ నుంచి 1990 మార్చి 5వ తేదీ వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. రెండోసారి 1999 డిసెంబర్ 6వ తేదీ నుంచి 2000 మార్చి 5వ తేదీ వరకు ముఖ్యమంత్రిగా ఈయన బాధ్యతలు చేపట్టారు.
*ప్రభుత్వానికి చెందిన నిధుల దుర్వినియోగంతో పాటు అవినీతి ఆరోపణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో 27 బీబీఎంపీ కార్యాలయాలపై దాడులు చేశారు. ఏసీబీ ఎస్పీ నేతృత్వంలో సుమారు 200 మందికి పైగా అధికారులు పాల్గొన్నారు. బీబీఎంపీ టీడీఆర్, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగాలపై దాడులు చేశారు. పాలికె కేంద్ర కార్యాలయంతో పాటు జాయింట్ కమిషనర్, రెవిన్యూ విభాగాలు, ప్రకటనల విభాగం, టీడీఆర్ సెక్షన్, ఆరోగ్య విభాగం, రోడ్లు, మౌళిక సదుపాయాల కల్పనల విభాగంలపై దాడులు చేసినట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. అధికారులు, సిబ్బంది కేటాయించిన పనులకు సంబంధించి అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చిన మేరకే దాడులు జరిగినట్లు సమాచారం. ప్రతి కార్యాలయంలోను ప్రైవేటు వ్యక్తుల జోక్యంతో అవినీతి సాగిస్తున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తీ వివరాలను దాడులు ముగిశాక ప్రకటిస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.