*ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డికి పార్టీ అన్ని అనుబంధ విభాగాలను అప్పగించారు. ఈ విభాగాలకు విజయసాయిని ఇంఛార్జిగా నియమిస్తూ జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి వైసీపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో విజయసాయిరెడ్డి ఇక నుంచి పార్టీకి చెందిన అన్ని అనుబంధ విభాగాలను కూడా చూసుకోనున్నారు. గతంలో విజయసాయికి ఉత్తరాంధ్ర జిల్లాల ఇంఛార్జి బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్.. కొంతకాలం క్రితం ఆ బాధ్యతల నుంచి తొలగించారు. తాజాగా వైసీపీకి చెందిన అన్ని అనుబంధ విభాగాలను అప్పగించడంతో విజయసాయిరెడ్డిపై బాధ్యతలు మరింత పెరగనున్నాయి.
*టీఆర్‌ఎస్ నేతలపై మండిపడ్డ షర్మిల టీఆర్‌ఎస్ నాయకులు వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల మండిపడ్డారు. టీఆర్‌ఎస్ నాయకులు లంచంగా అమ్మాయిల మానాన్ని అడుగుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇళ్లిప్పిస్తామని అమాయక అమ్మాయిలను లోబర్చుకుంటున్నారని ఆరోపించారు. కంచే చేను మేసిందన్నట్లు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వంలోని పెద్దలే.. గద్దల్లా అమ్మాయిల మాన ప్రాణాలు పీక్కుతింటున్నారని మండిపడ్డారు. ఇంకెక్కడిది మహిళలకు రక్షణ? అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు ఎన్నిజరిగినా.. టీఆర్‌ఎస్ నేతల తప్పులు ఆ పార్టీ పెద్దలకు కళ్లకు కనపడవని షర్మిల అన్నారు.
*రాష్ట్రంలో రైతులను సర్వనాశనం చేశారు: సోమిరెడ్డి రాష్ట్రంలో రైతులను సర్వనాశనం చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతిని ప్రశ్నిస్తుంటే అక్రమంగా తప్పుడు కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. పొదలకూరులో భూ దందా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తప్పుబట్టారు. మాజీమంత్రి వైఎస్ వివేకాను అతి కిరాతకంగా హత్య చేస్తే.. రెండున్నరేళ్లుగా ఏంచేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు.
* రంగంలోకి దిగిన మోదీ.. ఉక్రెయిన్‌కి కేంద్ర మంత్రులు..
స్వదేశానికి భారతీయులను రప్పించే ఏర్పాట్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రులను సరిహద్దులకు పంపాలని నిర్ణయించారు. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మోదీ ఈ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ నుంచి విద్యార్థులు, పౌరుల తరలింపులో ఎదురవుతున్న ఇబ్బందులపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. విద్యార్థులను తరలిస్తున్న సరిహద్దులకు కేంద్ర మంత్రులు కూడా వెళితే బాగుంటుందని, అక్కడుండే పరిస్థితులను సమీక్షించడం మంచిదని అభిప్రాయాన్ని ప్రధాని మోదీ వ్యక్తం చేసినట్లు తెలియవచ్చింది. ఆపరేషన్ గంగా పేరుతో ఢిల్లీ, ముంబై నుంచి వెళుతున్న ప్రత్యేక విమానాల్లో కేంద్ర మంత్రులు వెళ్లాలని మోదీ ఆదేశించినట్లు సమాచారం. విద్యార్థుల తరలింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు నివేదికను పీఎంవోకి అందజేయాలని ఆదేశించినట్లు తెలియవచ్చింది. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కేంద్ర మంత్రులు హర్దీప్‌సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింథియా, కిరణ్ రిజిజు, వీకే సింగ్‌లు వెళ్లనున్నారు.
*మోదీకి భేషరతు మద్దతు ప్రకటించిన మమతా బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరు ఎత్తితినే ఒంటి కాలిపై నిలబడే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మొదటిసారి ఆయనకు భేషరతు మద్దతు ప్రకటించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చే విషయంలో ఈ మద్దతు ప్రకటిస్తున్నట్లు సోమవారం రాసిన బహిరంగ లేఖలో ఆమె పేర్కొన్నారు. రాజకీయంగా ఎన్ని వైరాలు ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని లేఖలో మమతా పేర్కొన్నారు
* ఎంతమంది పీకేలను తెచ్చుకున్నా కేసీఆర్ గెలవలేరు: రేవంత్‌రెడ్డి ఎంతమంది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్ లాంటి వ్యక్తులను ఎంత మందిని తెచ్చుకున్నా సీఎం కేసీఆర్ గెలవలేరని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుట్రలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్ కుట్రలను మేధావులు ఆలోచించాలని సూచించారు. రాష్ట్రం కోసం అనేకమంది తెలంగాణ బిడ్డలు అమరులయ్యారని తెలిపారు. కేసీఆర్ ఏపీ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వేలకోట్లు సంపాదించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు
*జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం దెబ్బతింటోంది: చింతమనేని సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాల వలన రాష్ట్రం దెబ్బతింటోందని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరులో అమరావతి పరిరక్షణ సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో చింతమనేని మాట్లాడుతూ అమరావతి రైతులు వారి ఆస్తుల కోసం పోరాటం చేయఢం లేదని.. అందరి కోసం పోరాటం చేస్తున్నారన్నారు. అందరిలోనూ ఆవేదన ఉందని.. బయటకు రావాలని ఉన్న పోలీసు కేసులకు భయపడి రావడం లేదని తెలిపారు. బీజేపీ అధినాయకులు అమరావతే రాజధాని అని మాట్లాడితే బాగుంటుందన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఆ విధంగా ఒత్తిడి తెస్తే, బాగుంటుందని అభిప్రాయపడ్డారు. పాలకుడు అంటే జన రంజకంగా పాలన చేయాలన్నారు. పాదయాత్ర సమయంలో జగన్ మూడు రాజధానులు అని మాట్లాడి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేదికాదని తెలిపారు. అమరావతి రాజధాని గురించి అప్పట్లో అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఎందుకు వాకౌట్ చేయలేకపోయారని ప్రశ్నించారు. పిచ్చివాడి చేతికి రాయి ఇచ్చినట్లుగా ఉందని చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలు చేశారు
* వివేకా హత్యలో సిఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారు: చంద్రబాబు వైఎస్ వివేకా హత్యలో సిఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోందన్నారు. వివేకా హత్యను తనపై నెట్టి జగన్ రాజకీయ లబ్ధి పొందారని, బాబాయ్ హత్య ఘటనతో జగన్ నైతికంగా పూర్తిగా పతనం అయ్యారన్నారు. హత్య కేసులో సిబిఐ దర్యాప్తు చేస్తే… ఏమవుతుంది?… 12వ కేసు అవుతుందని జగన్ వ్యాఖ్యానించడమంటే అతనికి చట్టం అంటే లెక్కలేనితనాన్ని స్పష్టం చేస్తోందన్నారు.
*గ్రామాల సమగ్ర అభివృద్ధికి రూ.227 కోట్ల 50 లక్షల గ్రాంట్: ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి, వివిధ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అందులో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమం అమలకు ఫిబ్రవరి 2022 సంవత్సరానికి గ్రాంట్ గా రూ. 227 కోట్ల 50 లక్షల రూపాయలను గ్రామీణ స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు నిధులను గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి వినియోగిస్తారని ఆయన చెప్పారు.
*బీజేపీ నేతలు ఢిల్లీకి పోయి తెలంగాణను పోగుడ్తారు రాష్ట్రానికొచ్చి తిడుతారు: ఎర్రబెల్లి
గ్రామాల్లో ఎంత అభివృద్ధి చేసిన ఇంకా మిగిలే ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తెలంగాణను ఎంతగానో అభివృద్ధి చేస్తుందని చెప్పారు. గతంలో ఏడు గంటల కరెంట్ కోసం ధర్నాలు చేసిన పరిస్థితి ఉండేదని ఇప్పుడు 24గంటల కరెంట్ ఇస్తున్నారని చెప్పారు. బీజేపీ నేతలు ఢిల్లీకి పోయి తెలంగాణను పోగుడ్తారు రాష్ట్రానికొచ్చి తిడుతారని మండిపడ్డారు. మిషన్ భగీరథ ద్వారా 13వందల కోట్లు ఒక్క వికారాబాద్ జిల్లాకే ఖర్చు చేశారన్నారు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో పింఛన్లు బంద్ పెట్టారన్నారు. కేసీఆర్ అప్పుజేసీ మరీ ఇస్తున్నారని చెప్పారు. పిల్లల చదువులకోసం త్వరలోనే పాఠశాలల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిది వందల కోట్లు ఖర్చుచేసి అభివృద్ధి చేయబోతుందని వ్యాఖ్యానించారు. వికారాబాద్ జిల్లాలోని ప్రతి జెడ్పీటీసీకి 15లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తామని దయాకర్‌రావు పేర్కొన్నారు.
*త్వరలో ఏపీకి ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయి: రఘురామ
ఏపీలో ప్రస్తుతం రుణానాంధ్రలహరి నడుస్తోందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ త్వరలో ఏపీకి ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయన్నారు. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌కి అప్పులు తీసుకునే అనుమతి లేదని, బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఆస్తులు తనఖా పెట్టి.. మళ్లీ కొత్త అప్పులు చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. అభివృద్ధిలేని అప్పు.. ప్రజలకు శాపంగా మారుతుందని, అప్పులన్నీ తీసుకొచ్చి పథకాలు ఇచ్చినా పర్లేదు కానీ.. అసలు తీసుకొచ్చిన అప్పులు ఏమౌతున్నాయని ఆయన ప్రశ్నించారు. జగనన్న తోడుకు ఇచ్చే నిధులు తక్కువ.. ప్రకటనలు ఎక్కువని ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు.. ప్రయత్నం చేస్తున్నారనే వార్తలొస్తున్నాయని రఘురామ కృష్ణంరాజు అన్నారు
*బడ్జెట్ సమావేశాలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బడ్జెట్ సమావేశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారులు హాజరయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలతో పాటు మండలి సమావేశాల తేదీలను కూడా కేసీఆర్ ఖరారు చేసే అవకాశం ఉంది. మార్చి నెలాఖరు లోగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆమోదించనున్నారు. ఈ నేపథ్యంలో మార్చి రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది
*దమ్ముంటే చేవెళ్ల నుంచి పోటీ చెయ్: రంజిత్‌రెడ్డి
‘దమ్ముంటే రేవంత్‌రెడ్డి చేవెళ్ల నుంచి పోటీ చెయ్. నేనూ ఇక్కడి నుంచే పోటీ చేస్తా. నువ్వో నేనో తేల్చుకుందాం’అని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి సవాలు విసిరారు. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘మన ఊరు– మన పోరు’లో రేవంత్‌రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ… ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మె ల్యే మహేశ్‌రెడ్డి పరిగిలో మీడియా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘అవును నా వ్యాపారం పౌల్ట్రీ. గుడ్లు అమ్ముకుంటే తప్పేముంది. చేవెళ్ల ఏ ప్రభుత్వం హయాం లో అన్ని విధాలుగా అభ్యున్నతి సాధించిందో చర్చ చేద్దాం’ అన్నారు.దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీ ఓర్వలేకపోతున్నాయన్నారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గొప్పగా రూపొందించారని తెలిపారు. ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పీసీసీ హోదాలో ఉన్న రేవంత్, ఎంపీ, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కాం గ్రెస్ హయాంలో ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. దేవుని మాన్యాల కబ్జా లను నిరూపించాలన్నారు. ఈ భేటీలో మున్సిపల్ చైర్మన్ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు
* తుదిశ్వాస దాకా వారణాసి ప్రజలకు సేవలు – ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన
జీవితంలో ఆఖరి రోజుల్లోనే చాలామంది వారణాసి(కాశి)కి వస్తుంటారని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. తాను తుదిశ్వాస విడిచేదాకా వారణాసి ప్రజలకు సేవలందిస్తూనే ఉంటానని చెప్పారు. మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆదివారం బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలు వారి పార్టీలను సొంత ఆస్తులుగా భావిస్తున్నారని, అలాంటివారు కార్యకర్తల పార్టీ అయిన బీజేపీని ఎప్పటికీ చాలెంజ్ చేయలేరని పేర్కొన్నారు. తాను కాశీలోనే చనిపోవాలని ఎవరైనా ప్రార్థిస్తే సంతోషిస్తానని తెలిపారు.వారణాసి గానీ, వారణాసి ప్రజలు గానీ తనను ఎప్పటికీ వదులుకోరనే విషయం తనకు అర్థమైందని చెప్పారు. బీజేపీ కార్యకర్తలే తనకు ఒక విశ్వవిద్యాలయమని, వారి నుంచి ఎంతో నేర్చుకుంటున్నానని ప్రధాని మోదీ వివరించారు. గత ప్రభుత్వాల హయాంలో వారణాసి అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ చరిత్రాత్మక, ఆధ్యాత్మిక నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నామని ఉద్ఘాటించారు. చాలా సంవత్సరాల తర్వాత కాశీ విశ్వనాథ ఆలయం పవిత్ర గంగానది తీరాన్ని తాకిందని హర్షం వ్యక్తం చేశారు. కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టును అందరూ గర్వకారణంగా భావిస్తుంటే, కొందరు మాత్రం మతం కోణంలో చూస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు.
* శివకాశిలో పది మంది అన్నాడీఎంకే కౌన్సిలర్లు అదృశ్యం?
కొత్తగా ఏర్పాటైన శివకాశి కార్పొ రేషన్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్గో గెలిచిన అన్నాడీఎంకే కౌన్సిలర్లు హఠాత్తుగా అదృశ్యమయ్యారు. ఈ కౌన్సిలర్లందరూ తీర్థయాత్రకు వెళ్ళారని చెబుతున్న ప్పటికి పార్టీ జిల్లా నాయకులతో ఏర్పడిన మనస్పర్థల కారణం గానే మాయ మయ్యారని వారి సన్నిహితులు పేర్కొంటున్నారు. శివకాశి కార్పొరేషన్ ఎన్ని కల్లో డీఎంకే 24 వార్డుల్లో, అన్నాడీఎంకే 11 వార్డుల్లో గెలిచింది. గెలిచిన వారంతా మార్చి రెండున ప్రమాణస్వీకారం చేయాల్సి వుంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే కౌన్సిలర్లలో 30 వ వార్డు కౌన్సిలర్ మినహా మిగిలిన 10 మంది హఠాత్తుగా అదృశ్యమయ్యారు. వీరంతా కుంభకోణం, తిరునల్లారు తీర్థయాత్ర కు వెళ్ళారని పార్టీ స్థానిక నాయకులు తెలిపారు. అయితే అన్నాడీఎంకే జిల్లా ాయకులతో మనస్పర్థల కారణంగానే ఆ పది మంది చెప్పాపెట్టకుండా వెళ్ళారని వారి సన్నిహితులంటున్నారు
*వివేకా కేసులో జగన్ కూడా నిందితుడు: బుద్దా వెంకన్న
మాజీమంత్రి వివేకా కేసులో సీఎం జగన్ కూడా నిందితుడని, సీఎంగా ఉండేందుకు ఆయన అనర్హుడని టీడీపీ నేత బుద్దా వెంకన్న చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం పదవికి జగన్ రాజీనామా చేసి సీబీఐ ముందు హాజరుకావాలన్నారు. వివేకా హత్య కేసు నుంచి దృష్టి మళ్లించేందుకే భీమ్లానాయక్‌పై వివాదాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. వివేకా హత్య కేసు దోషులను రక్షించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జగన్ తన పేరు ఎక్కడ బయటపడుతుందోనని భయపడుతున్నారని విమర్శించారు. జగన్‌కు తెలిసే వివేకానందరెడ్డి హత్య జరిగిందని తెలిపారు. అందుకే ఎంపీ అవినాష్‌రెడ్డిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డిలే చంపారని సాక్షులు చెప్పినా జగన్ స్పందించరా?.. అవినాష్‌రెడ్డిపై చర్యలు తీసుకోకపోగా రఘురామకృష్ణరాజును తొలగించాలని లేఖలు రాస్తారా. అవినాష్, భాస్కరరెడ్డిలను అరెస్ట్ చేస్తే తన కుట్ర బయపడుతుందని జగన్‌కు భయం. ప్రతిపక్షాల సవాళ్లను ఎదుర్కోకపోగా ఎదురుదాడి చేస్తున్నారు. సీబీఐ అధికారిపై కూడా కేసులు పెట్టించడం జగన్ దుర్మార్గానికి పరాకాష్ట’’ అని బుద్దా వెంకన్న మండిపడ్డారు
*కేసీఆర్ మగాడైతే మళ్లీ గెలవాలి: రేవంత్ రెడ్డి
కేసీఆర్ మగాడైతే ప్రభుత్వాన్ని రద్దు చేసి, దమ్ముంటే మళ్లీ గెలవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నిరుద్యోగ నిరసన దీక్షలో పాల్గొన్న ఆయన.. సీఎం కేసీఆర్‌పై ఘాటుగా వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు చేతగాకనే బీహార్‌కు చెందిన ప్రశాంత్ కిషోర్‌ను తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఆ బాధ్యత తనదేనని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఖాళీల భర్తీ కోసం సోనియా గాంధీ కాళ్ళయినా మొక్కుతానని రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తా. ప్రగతి భవన్‌ను అంబేద్కర్ నాలెడ్జి సెంటర్‌గా మారుస్తా. మొదటి సంతకం దానిమిదే. మా దగ్గర ఒక రోగం ఉంది. ఒకరు పాట అందుకున్నప్పుడు మరొకరు పాడరు. అందరం ఒక్కసారి అందుకోకపోవడం కాంగ్రెస్ బలహీనత. అందరం ఓకేసారి పాడి అధికారంలోకి వస్తాం. ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్ ఉద్యోగాన్ని ఊడగొట్టాలి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. బాబు మోహన్‌కి ఎక్కువ బ్రహ్మానందంకి తక్కువ. బాల్క సుమన్ ప్రగతి భవన్ బానిస. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది పేద బిడ్డలు నేలకొరిగారు. కేసీఆర్ పాలనలో కూడా ఎంతోమంది పేదింటి బిడ్డలు, నిరుద్యోగులు చనిపోతున్నారు. పెట్రోల్ మీద పోసుకుని అగ్గిపెట్టె మర్చిపోయి హరీష్ రావు డ్రామా ఆడారు. తెలంగాణకు పట్టిన చీడైన కేసీఆర్‌ను తరిమేసినప్పుడే తెలంగాణ సమస్యలు తీరుతాయి.’’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
*వివేకా హత్యపై జగన్ సూటిగా సమాధానం చెప్పాలి: నాగుల్ మీరా
కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యేలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత నాగుల్ మీరా దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్య కేసులో చంద్రబాబు సిట్ వేస్తే.. ఐపీఎస్ స్థాయి నుంచి డీఎస్పీ స్థాయికి విచారణను ఎందుకు మార్చారని తప్పుబట్టారు. సీబీఐ విచారణ కావాలని హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రశ్నించారు. వివేకా నిందితులు ఎవరో జగన్‌కు తెలుసు కాబట్టే పట్టుకోలేదన్నారు. వివేకా కేసు విషయంలో జగన్ తీరును చూస్తే.. అందరూ ఆశ్చర్యపోతున్నారన్నారు. వివేకానందరెడ్డి చాలా సౌమ్యుడని అందరికీ తెలుసని చెప్పారు. అన్న వైయస్ రాజశేఖరరెడ్డి సీఎం కావాలనే తపనతో నాడు పని చేశారని తెలిపారు. అటువంటి వివేకాను అత్యంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. దీనిపై జగన్ సూటిగా సమాధానం చెప్పాలని నాగుల్ మీరా డిమాండ్ చేశారు.
*ఇతర దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచింది: కిషన్‌రెడ్డి
హునర్ హాట్ కార్యక్రమం కోసం అనేక రాష్టాలు పోటీపడ్డాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో హునర్‌హాట్ ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకొచ్చి ఇతర దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందన్నారు. 180 కోట్ల వ్యాక్సిన్ డోసులు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 300 హస్త కళల స్టాల్స్ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటుచేశామన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వినియోగదారులు ఇష్టమైన కళారూపాలు కొనుగోలు చేసుకోవచ్చన్నారు. రూ.730కోట్లు మైనార్టీ శాఖకు కేంద్రం ప్రతి ఏటా ఖర్చుచేస్తోందన్నారు.
*తెలంగాణ సీనియర్లను బయటకు పంపి పార్టీని బీజేపీకి అప్పగిస్తాడేమే: బాల్కసుమన్
రేవంత్ రెడ్డిలో విషం తప్ప, విషయం లేదని టీఆర్ఎస్ నేత బాల్కసుమన్ విమర్శించారు. నైనీ బ్లాక్‌లో ఉన్న నిలువలు ఎన్ని? సింగరేణి టర్నోవర్ ఎంత? అని ఆయన ప్రశ్నించారు. రూ. 50 వేల కోట్ల కుంభకోణం జరిగింది అనడానికి సిగ్గుందా? అని విమర్శించారు. రేవంత్ రెడ్డి బీజేపీకి కోవర్ట్‌గా మారిండనే అనుమానం ఉందన్నారు. సీనియర్లను బయటకు పంపి కాంగ్రెస్‌ను బీజేపీకి అప్పగిస్తాడేమో? అని అనుమానం వ్యక్తం చేశారు.
*అధిష్ఠానం గమనిస్తోంది: మాణిక్యం ఠాకూర్
కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేసేందుకే డిజిటల్ సభ్యత్వ నమోదు చేస్తున్నామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో ఎవరు పనిచేస్తున్నారో.. ఎవరు చేయడం లేదో అధిష్ఠానం గమనిస్తోందని తెలిపారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతీ కార్యకర్తకు సమన్యాయం కల్పించడమే పార్టీ ఉద్దేశమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని ఎవరు పనిచేస్తున్నారు.. ఎవరు పని చేయడం లేదో అధినాయకత్వం గమనిస్తోందని చెప్పారు. సభ్యత్వ నమోదు కోసం పనిచేస్తున్న 24 వేల కార్యకర్తల వివరాలు అధినేత రాహుల్ గాంధీ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మాణిక్యం ఠాకూర్ పిలుపునిచ్చారు
*ఆ విషయంలో జగన్ అల్లరి పాలయ్యారు: రఘురామ
తనపై ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘జగన్రెడ్డి, డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారి నాపై కుట్రలు చేస్తున్నారు. జగన్రెడ్డి మైండ్లో ఏముంది?.ఎలాగో ఏపీకి రానివ్వడం లేదు, హైదరాబాద్ కూడా రానివ్వరా ఏంటి?.ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఇచ్చినా ఇప్పటికీ యాక్షన్ తీసుకోలేదు.సమాజంలో ఏం జరుగుతుందో ప్రజలే గమనిస్తున్నారు’’ అని రఘురామ అన్నారు. ‘‘ఒక ఎంపీకి ప్రశాంతంగా జీవించే హక్కు లేదా? నా హక్కును హరించే అధికారం జగన్కి ఎవరిచ్చారు?.నా వ్యక్తిగత హక్కును హరిస్తున్నారు. ఈ విషయంపై స్పీకర్ ఓం బిర్లా, ప్రివిలేజ్ కమిటీకి లేఖ రాశాను. నాపై నిఘా, పవన్పై పగ జగనన్నకి ఎందుకు?భీమ్లానాయక్లో పవన్ అద్భుతంగా నటించారు. పవన్ ఎక్స్ట్రార్డినరీ యాక్షన్ చేస్తే. పేర్నినాని ఎక్స్ట్రార్డినరీ ఓవర్ యాక్షన్ చేశారు.భీమ్లానాయక్పై పేర్నినాని సారథ్యంలో జగన్రెడ్డి అధ్యక్షతన ఎన్నో కుట్రలు, కొన్ని చోట్ల థియేటర్లు బంద్ చేశారు, అరాచకాలు సృష్టించారు. అవసరం లేకపోయినా సినిమా విషయంలో జగన్ అల్లరి పాలయ్యారు. సీఎం జగన్ వైఖరితో మా పార్టీ దెబ్బతింటుంది’’ అని రఘురామకృష్ణరాజు మండిపడ్డారు
*స్టాలిన్తో చిదంబరం భేటీ
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం శనివారం భేటీ అయ్యారు. స్థానిక ఆళ్వారుపేటలోని సీఎం నివాసానికి వెళ్లిన చిదంబరం.. అరగంటకు పైగానే చర్చలు జరిపారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకే కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో స్టాలిన్కు చిదంబరం అభినందనలు తెలిపారు. అయితే, ప్రాంతీయ పార్టీల తృతీయ కూటమి ఏర్పాటు గురించి ఊహాగానాలు రేగుతున్న నేపథ్యంలో.. ఆ వ్యవహారంపై స్టాలిన్తో చర్చించేందుకే చిదంబరం భేటీ అయ్యారని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
*క్లెయిమ్లను త్వరగా పరిష్కరించండి: తలసాని
గొర్రెలు, పాడి గేదెల ఇన్సూరెన్స్ క్లెయిమ్లను 15 రోజుల్లోగా పరిష్కరించాలని మంత్రి తలసాని శ్రీనివా్సయాదవ్ ఆదేశించారు. డీడీలు చెల్లించిన లబ్ధిదారులకు త్వరలోనే గొర్రెల పంపిణీ చేయాలన్నారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో పశుసంవర్థక, మత్స్య, డెయిరీ శాఖల అధికారులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,86,366 గొర్రెల యూనిట్లను పంపిణీ చేశామని, మిగిలిన లబ్ధిదారులకు త్వరలో పంపిణీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
*2 లక్షల ఎకరాల్లో వెదురు సాగు: నిరంజన్రెడ్డి
రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల్లో వెదురు సాగు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ‘వెదురు సాగు అవకాశాలు-లాభాలు’ అంశంపై శనివారం ఆన్లైన్లో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. వెదురు సాగు చేస్తే ఎకరంలో ఏటా రూ.లక్ష ఆదాయం వస్తుందన్నారు. ప్రస్తుతం విద్యుత్ రంగంలో బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వెదురును విరివిగా వినియోగిస్తున్నారని, ప్రతి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 5ు వరకు వెదురును వాడాలని కేంద్రం ఆదేశించిందని తెలిపారు. ఈ సమావేశంలో ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*జగనన్న కాలనీల్లో ఏడు వేల కోట్ల దుర్వినియోగం
‘‘రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల్లో రూ.7,000 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగింది. నిధుల స్వాహాపై నీతి వాక్యాలు చెబుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దమ్ముంటే దీనిపై విచారణకు ముందుకు రావాలి’’ అని మాజీ మంత్రి ఎన్.అమర్నాథరెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘వైసీపీ హయాంలో ఉపాధి హామీ నిధులను దుర్వినియోగం చేస్తున్న తీరుపై మేం మాట్లాడితే దానికి సమాధానం చెప్పకుండా మంత్రి టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం విషయాలు ఆయనకు ఇప్పుడు గుర్తుకు వచ్చాయి. ఉపాధి హామీ నిఽధుల్లో ఒక ఏడాదిలో దేశవ్యాప్తంగా జరిగిన నిధుల దుర్వినియోగంలో నాలుగో వంతు ఒక్క ఈ రాష్ట్రంలోనే జరిగింది. ఈ విషయం కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. ఈ రాష్ట్రంలో అవినీతి ఎంత పరాకాష్ఠకు చేరిందో ఇదే పెద్ద ఉదాహరణ. దీనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకొంది? అధికారం చేతిలో ఉంచుకొని చర్యలు తీసుకోలేక ఉపన్యాసాలు ఇచ్చి కాలక్షేపం చేస్తున్నారు. మూడేళ్ల కిందటి ఉపాధి బిల్లులు ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదు.