దిల్లీ నుంచి లండనికి బస్సు అనగానే ఒకింత ఆశ్చర్యంగానే అనిపిస్తుంది . రెండు ఖండాలు దాటి 18 దేశాల మీదుగా వెళ్లే ఆ బస్సు ఎక్కాలంటే వీసా కావాలా , టికెట్ ధర ఎంతుంటుందీ … వంటి ఎన్నో ప్రశ్నలు ఈ పాటికే బుర్రలోకి వచ్చి ఉంటాయి కదూ ! ఇదిగో చదివేయండి , లండన్ వెళ్లే ఆ ఎర్రబస్సు విశేషాలు …
* దిల్లీకి చెందిన అడ్వెంచర్స్ ఓవర్లాండ్ అనే సంస్థ దిల్లీ లండన్ బస్సు సర్వీసుకు శ్రీకారం చుట్టింది . ఢిల్లీ నుంచి బయల్దేరే ఆ బస్సు 20 వేల కిలోమీటర్లు ప్రయాణించి లండన్కు చేరుకుంటుంది. సాధారణంగా ఆ రోడ్డు మార్గంలో వెళ్లాలంటే యాభైరోజులకు తక్కువే పడుతుంది. కానీ మార్గ మధ్యంలోని దేశాల్లో బస్సును ఆపి పర్యటకప్రాంతాల్ని చూపించాలనుకుంటోంది ట్రావెల్ ఏజెన్సీ. అందుకే లండన్కు చేరుకోడానికి 70 రోజులు పడుతుంది.
*దిల్లీలో బయల్దేరిన బస్సు మయన్మార్, థాయ్లాండ్, లావోస్, చైనా, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజికిస్తాన్, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలెండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ మీదుగా ప్రయాణించి లండన్కు చేరుకుంటుంది. ఇండియాతో కలిపి 18 దేశాలలో బస్సు ప్రయాణిస్తుంది.
* 18 దేశాల మీదుగా వెళ్లేటప్పుడు వీసా ఎలా అనే అనుమానం వచ్చిందా. అవన్నీ ట్రావెల్ ఏజెన్సీనే చూసుకుంటుంది. సదుపాయాలూ, వీసా కోసం కలిపి రూ.15 లక్షల రూపాయలు ఛార్జీ వసూలు చేస్తున్నారు. మన వివరాల తాలూకు డాక్యుమెంట్లు అందజేస్తే రవాణా మంత్రిత్వ శాఖ, కస్టమ్స్, ఇమిగ్రేషన్ అనుమతులన్నీ ఏజెన్సీనే పొందుతుంది . వీసా సమస్యలు లేకుండా జాగ్రత్త పడుతుంది.
* ఈ ట్రిప్పు కోసం వోల్వో బస్సును ఎంచుకుని 20 మంది సౌకర్యంగానూ, విలాసంగానూ ప్రయాణించేలా మార్పులూ చేర్పులూ చేశారు. ఈ సీట్లలో కూర్చోవచ్చూ పడుకోవచ్చు. నిరంతరం వైఫై సేవలుంటాయి. ప్రతి సీటు దగ్గరా సినిమాలూ వీడియోలు చూడటానికి ఒక స్క్రీన్ , ఛార్జింగ్ పెట్టుకోవడానికి పాయింట్, ప్రయివేట్ లాకర్ అందుబాటులో ఉంటాయి. మంచినీళ్లూ, చాక్లెట్లూ పెట్టుకోవడానికి మినీ ఫ్రీజ్ అమర్చి ఉంటుంది. ప్రయాణంలో శాకాహారం, రెడీ టూ ఈట్ పదార్థాల్ని ఇస్తారు.
* బస్సులో ఇరవై మంది ప్రయాణికులతోపాటు ఇద్దరు డ్రైవర్లూ, ఏజెన్సీ ప్రతినిధీ, వైద్య సహాయకుడూ, గైడూ ఉంటారు. ఆయా దేశాల్లోని పర్యటక ప్రాంతాల్లో ఆగినప్పుడు స్థానిక కరెన్సీ సిమ్ కార్డు వంటివి కూడా ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులు ఇప్పిస్తారు. ప్రయాణం మధ్యలో స్టార్ హోటళ్లలోనే బస ఉంటుంది.
*అతి త్వరలో ఈ అతి పొడవైన ప్రయాణానికి శ్రీకారం చుట్టిన తుషార్ అగర్వాల్, సంజయ్ మదన్లు 2017- 19 మధ్య మూడు సార్లు ఢిల్లీ నుంచి లండన్కు కారులో ప్రయాణించారు. ఆ అనుభవంతోనే పక్కాగా ప్రయాణానికి ప్రణాళికలు వేశారు. గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఈ ప్రయాణం ఈ ఏడాది రోడ్డెక్కబోతోంది.
*లండన్కు భారత్ నుంచి బస్సు వెళ్లడం ఇదే తొలిసారి కాదు. 1957 లోనే దిల్లీ మీదుగా కోల్కతా నుంచి లండన్కు ఒక బ్రిటిష్ కంపెనీ బస్సు సర్వీసును నడిపింది. కొంతకాలానికి బస్సు ప్రమాదానికి గురికావడంతో ఆ సర్వీసును ఆపేశారు. అప్పట్లో బస్సు టికెట్ రూ.13600. ఆ తరవాత ఆల్బర్ట్ టూర్స్ అనే కంపెనీ డబుల్ డెక్కర్ బస్సును అందుబాటులోకి తెచ్చి సిడ్నీ- ఇండియా- లండన్ మీదుగా సర్వీసును ప్రారంభించింది. ఇరాన్ అంతర్యుద్ధం, భారత్- పాక్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆ బస్సును నిలిపేశారు. దాదాపు 46 ఏళ్ల తరువాత మళ్లీ మనదేశం నుంచి లండన్కు బస్సు ప్రయాణం ప్రారంభం కానుంది. దూర ప్రయాణాలు ఇష్టపడేవారికి ఈ బస్సు జర్నీ మాంచి కిక్నిస్తుంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తిలేదు.
map images hd