పాస్పోర్టులకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. కరోనా కారణంగా గత ఏడాదిన్నరగా అనేక ఆంక్షలు ఉండడంతో విదేశాలకు వెళ్లేవారి సంఖ్య తగ్గింది. దీంతో కొత్తగా పాస్పోర్టులు తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇప్పుడు ఆంక్షలు తొలగిపోవడంతోపాటు విదేశాలకు విమానాల రాకపోకలు పెరిగాయి. విదేశీ వర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి చాలామంది దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాస్పోర్టుల కోసం దరఖాస్తు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలోని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయాల ద్వారా జనవరి నెలాఖరు వరకు రోజుకు 1,600 స్లాట్లు మాత్రమే ఇచ్చేవారు. ఫిబ్రవరి నుంచి తాకిడి పెరగడంతో రెండు నగరాల్లో కలిపి ఇప్పుడు 2,800 స్లాట్లు ఇస్తున్నారు. కాగా, పాస్పోర్టుల కోసం ఏజెంట్లు ఉండరని, ఎవరికీ అటువంటి అనుమతులు ఇవ్వలేదని ప్రాంతీయ పాస్పోర్టు అధికారి డీఎస్ఎస్ శ్రీనివాసరావు చెప్పారు. అధీకృత వెబ్సైట్, యాప్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.