*ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను రష్యా మీదుగా తరలించేందుకు సహకరించాలని కోరారు. భారతీయ విద్యార్థుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదిలావుండగాఖర్కివ్ నుంచి భారతీయులు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటల్లోగా వెళ్ళిపోవాలని ఇండియన్ ఎంబసీ హెచ్చరించింది. ఇక్కడి నుంచి పెసోచిన్బా బేబెజ్లిడోవ్కా నగరాలకు త్వరగా వెళ్లాలని ఆదేశించింది. భారతీయులకు 6 గంటల పాటు రష్యా వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9:30 గంటల వరకు గడువు ఇచ్చినట్లు సమాచారం. రాత్రి 9:30 గంటల తర్వాత ఖర్కివ్‌ను స్వాధీనం చేసుకునేందుకు చిట్టచివరి అస్త్రాన్ని ప్రయోగించేందుకు రష్యా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది
* అమరావతిపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతినే ఏపీ రాజధానిగా నిర్ధారిస్తూ 2022-23 బడ్జెట్‌లో కేటాయింపులను కేంద్రం ప్రకటించింది. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి నిధులను కేంద్ర కేటాయించింది. ఏపీ నూతన రాజధాని అమరావతి పేరుతోనే బడ్జెట్‌లో ప్రొవిజన్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. కేంద్ర బడ్జెట్‌లో పట్టణాభివృద్ధి శాఖ నుంచి అమరావతిలో సచివాలయం, ఉద్యోగుల నివాస గృహాల నిర్మాణానికి నిధులను కేటాయించారు. సచివాలయ నిర్మాణానికి రూ.1214 కోట్లను అంచనా వ్యయంగా కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల నివాస గృహాల కోసం రూ. 1126 కోట్లను కేంద్రం అంచనా వేసింది. ఈ బడ్జెట్‌లో రూ. లక్షల రూపాయలను పట్టణాభివృద్ది శాఖ కేటాయించింది. GPOA కి భూసేకరణ కోసం రూ. 6.69 కోట్ల అంచనా వ్యయంగా పేర్కొంది. 2020-21, 2021-22 బడ్జెట్‌లలో మొత్తం రూ. 4.48 కోట్లను కేంద్రం ఖర్చు చేయనుంది. ఉద్యోగుల నివాస గృహాలకు అవసరమైన భూ సేకరణకు 2021-22లో రూ. 21 కోట్లు అంచనా వేసి ఇప్పటి వరకు రూ.18.3 కోట్లను కేంద్రం ఖర్చు చేసింది.
* తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడుమాజీ సీఎం చంద్రబాబుపై విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సంజయ్‌వర్మ ప్రశంసలు కురిపించారు. ఏ సమస్య వచ్చినా చంద్రబాబు తక్షణమే స్పందిస్తారని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అక్కడ ఉంటున్న విద్యార్థుల విషయంలో కూడా ఆయన స్పందించిన తీరు అభినందనీయమన్నారు. సహజంగానే చంద్రబాబు ముందుచూపుతో వ్యవహరిస్తారనిపక్కా ప్లానింగ్‌తో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారని సంజయ్‌వర్మ ప్రశంసించారు.
* ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై వేల సంఖ్యలో అభ్యంతరాలు, సూచనలు వచ్చాయని ఏపీ ప్రణాళిక కార్యదర్శి విజయ్‌కుమార్ వెల్లడించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. విజయనగరంలో 4,500, కృష్ణలో 2,800, కడపలో 1,300 తదితర జిల్లాలో వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని వివరించారు. అంశాల వారీగా పరిశీలిస్తే దాదాపు 60 వరకు అభ్యంతరాలున్నాయని పేర్కొన్నారు. వీటన్నింటినీ క్రోడీకరించి రేపు ఏపీ సీఎం జగన్‌కు నివేదిస్తామని స్పష్టం చేశారు.
* అంకుర సంస్థగా ప్రారంభమైన భారత్ బయోటెక్.. అనేక రకాల వ్యాధులకు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసినట్లు సంస్థ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. హైదరాబాద్లో జరిగిన సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో మంత్రి కేటీఆర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని కృష్ణ ఎల్ల కొనియాడారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో భారత రైతులు మరింత పురోగతి సాధించాలని కోరారు.
*టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్‌వర్మను కలిశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను వేగవంతంగా తరలించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపుకు కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నామన్నారు. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా సేకరించిన.. తెలుగు సహా ఇతర విద్యార్థుల వివరాలను విదేశాంగ శాఖకు అందజేశామన్నారు.
* ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల తరలింపు కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ చర్యల్లో భాగంగా బుధవారం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలండ్, హంగేరీలకు ఏపీ ప్రతినిధులను పంపాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విద్యార్థుల వివరాలను విదేశాంగశాఖకు ఏపీ ప్రభుత్వం అందించింది.
* ఢిల్లీకి చెందిన విశ్వవిద్యాలయం శివనాడార్ 2022–23 విద్యా ఏడాదికి పలు కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంజనీరింగ్, నేచురల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్– ఎంటర్ ప్రెన్యూర్‌షిప్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్‌లో అండర్ గ్రాడ్యుయేట్ పరిశోధన అందించే అకాడమీ ఆఫ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు చేపడుతోంది.
* టీడీపీ కేంద్ర కార్యాలయ ఆహ్వాన కమిటీ కన్వీనర్ వల్లూరి కుమారస్వామి(కన్నుమూశారు. గుండె పోటుతో ఈరోజు ఉదయం కుమారస్వామి తుదిశ్వాస విడిచారు. కుమారస్వామి మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతివ్యక్తం చేశారు. రోజూ పార్టీ కార్యాలయంలో కలిసే వల్లూరి అకాలమరణం షాక్‌కు గురిచేసిందన్నారు. పార్టీ పరంగా కుమార స్వామి కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు
* నరసాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఐదు వేల మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆందోళనకు వైసీపీతో సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్, వైసీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, టీడీపీ ఇన్‌చార్జ్ పొత్తూరి రామరాజు, బొమ్మిడి నాయకర్‌లు పాల్గొన్నారు
*రాష్ట్రంలోని రైతుల అవస్థలను తీర్చలేని సీఎం కేసీఆర్ దేశంలోని రైతులకు ఏం సమాధానం చెబుతారని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ప్రశ్నించారు.మిర్చి రైతుల ఆత్మహత్యలను ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ బూటకమవుతుందనే ఈ రైతు కుటుంబాలను పరామర్శించడంలేదా? అంటూ ట్వీట్ చేశారు.
*విప్లవ కవి, విరసం రచయిత వరవరరావుకు ముంబై హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. ఎల్గర్ పరిషద్ కేసులో నిందితునిగా ఉన్న ఆయనకు ఆరోగ్య కారణాల రిత్యా ఇచ్చిన బెయిల్‌ను మార్చి 8 వరకు పొడిగించింది. ఈ మేరకు జస్టిస్ ఎస్‌బీ షుక్రే, జస్టిస్ జీఏ సన్‌పతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. అంతేకాక తలోజా సెంట్రల్ జైలు ప్రస్తుత పరిస్థితిపై న్యాయమూర్తి ప్రశ్నించారు తదుపరి విచారణను మార్చి 8కి వాయిదా వేసింది.
*పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులను ఈనెల 4న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అక్కడి అంశాల ఆధారంగా కేంద్ర జల్ శక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి షెకావత్, సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని షెకావత్కు సీఎం జగన్ విజ్ఞప్తి చేయనున్నారు.
*గండిపేట మండలం పుప్పాలగూడలో రూ.200కోట్ల విలువైన నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
*నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా పాటు ప్రజల సౌకర్యార్థం మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం కేంద్రాలుగా నూతన జిల్లాలను ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. అదే విధంగా సత్యసాయి జిల్లాకు హిందూపురం జిల్లా కేంద్రంగా, అన్నమయ్య జిల్లాకు రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారు. సోమవారం ఈ మేరకు సీఎం జగన్కు లేఖ రాసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా కందుకూరు, నూజివీడు, సత్తెనపల్లిలను రెవెన్యూ డివిన్లుగా ప్రకటించాలన్నారు.
*యూరోపియన్ యూనియన్ దేశాల చర్యకు ప్రతిచర్య అనేలా రష్యా నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్పై దూకుడుకు కళ్లెం వేసేందుకు గత వారం ఈయూ దేశాలు.. రష్యా విమాన సర్వీసులను రద్దు చేస్తే దీనికి దీటుగా రష్యా కూడా ఆ దేశాల నుంచి వచ్చే విమానాలను నిలిపివేయాలని నిర్ణయించింది. బ్రిటన్, జర్మనీ సహా 36 దేశాల విమానాలపై సోమవారం నిషేధం విధించింది. పశ్చిమ దేశాల తీరుకు ప్రతీకారంగానే ఈ చర్య చేపట్టిన్నట్లు రష్యా విమాన యాన సంస్థ ప్రకటించింది. ఈ కారణంగా ప్రజలకు ప్రయాణ దూరం, చార్జీలు పెరగనున్నాయి. ఇప్పటికే యూర్పలోని అత్యధిక దేశాలతో పాటు, కెనడా గగనతలంలో ప్రవేశానికి రష్యా విమానాలకు అనుమతి లేదు. ప్రస్తుతం రష్యా గగనతలంలోకి ప్రత్యేక అనుమతి ఉన్న విమానాలనే అనుమతిస్తున్నారు.
*టెక్ మహీంద్రా విజయవాడలో తన యూనిట్ను ఏర్పాటు చేయబోతోంది. కేసరపల్లిలోని ఏస్ అర్బన్-ఏపీఐఐసీ హైటెక్ సిటీలోని మేథ టవర్లో తన శాఖను త్వరలో ప్రారంభిచనుంది.
*రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. విజయవాడకు చెందిన ఎమ్మెల్సీ మహమ్మద్ కరీమున్నీసా మరణంతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు మార్చి 7న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మార్చి 14 వరకు నామినేషన్ల దాఖలు, 15న పరిశీలన, 17న ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించింది. మార్చి 24న పోలింగ్, అదేరోజు కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది.
*వైసీపీ అనుబంధ విభాగాల ఇన్చార్జిగా ఎంపీ విజయసాయిరెడ్డిని వైసీపీ జాతీయాధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి నియమించారు. ఈమేరకు సోమవారం అధికారిక ఉత్తర్వు జారీ చేశారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా.. ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా ఉన్న విజయసాయిరెడ్డికి గతంలోనూ ఈ బాధ్యతలు ఉన్నాయి.
*ఏప్రిల్ 14 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత పాదయాత్ర చేపట్టనున్నారు.పార్లమెంట్ సమావేశాలు ముగిశాక సంజయ్ ఈయాత్ర చేయనున్నారు. ఇప్పటికే 36 రోజులపాటు మొదటి విడత పాదయాత్ర సాగింది.రెండో విడతలో 200 రోజులపాటు యాత్ర చేయాలని సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఐదు విడతలుగా బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. కరోనా దృష్ట్యా రెండో విడత యాత్ర ఆలస్యంగా ప్రారంభమవుతుందని బీజేపీ అధిష్ఠానం తెలిపింది. రెండో విడత యాత్రని మహబూబ్నగర్ నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
*రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 14 నుంచి రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ప్రారంభిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రకటించారు. గత ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నేతలు ఈసీకి సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తులను.. ఎమ్మెల్యేలు, మంత్రులయ్యాక సంపాదించిన ఆస్తులను బేరీజు వేసి వాటి ఆధారంగా విచారణ జరిగేదాకా ప్రజాక్షేత్రంలో పోరాడతామన్నారు. సోమవారం హైదరాబాద్ బీజేపీ జోనల్ సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ.. ‘ఈసీకి మంత్రి శ్రీనివాస్గౌడ్ సమర్పించిన తప్పుడు అఫిడవిట్పై ఫిర్యాదు చేసిన వారిని సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో పోలీసులు కిడ్నాప్ చేయడం అత్యంత దారుణం. దీనిపై ఈసీ విచారణ ముగిసే వరకు ఆరుగురు ఫి ర్యాదుదారులను జైళ్లో పెట్టడమే లక్ష్యంగా కేసులు నమోదు చేశారు. బీజేపీ ఇలాంటి దా రుణాలను అడ్డుకుని తీరుతుంది. మంత్రి రాజీనామా చేసే వరకు పార్టీ పరంగా ఆందో ళనలను కొనసాగిస్తాం’అని ప్రకటించారు.