టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ప్రస్తుతం ముందు వరుసలో ఉన్న బ్యూటీ పూజా హెగ్డే. దక్షిణాది అగ్ర కథానాయకుల సరసన అమ్మడు కథానాయికగా నటిస్తోంది. అలాగే.. బాలీవుడ్ లోనూ వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’ చిత్రంలో నటిస్తున్న పూజా, మహేశ్, త్రివిక్రమ్ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో రామ్ చరణ్ జోడీగా అభినయిస్తోంది. ఇక తమిళ దళపతి ‘బీస్ట్’ లోనూ బుట్టబొమ్మ గ్లామర్ ఒలికించబోతోంది. ఇక బాలీవుడ్ లో సర్కస్ అనే మూవీలో నటిస్తోంది. మరికొన్ని సినిమాలు అమ్మడి అంబుల పొదిలో ఉన్నాయి.ఇక సినిమాల విషయాలు పక్కనపెడితే.. పూజా హెగ్డేకి దేవుడి పట్ల నమ్మకం , భక్తి కూడా ఎక్కువే. శివరాత్రి సందర్భంగా వారణాసి కాశీ విశ్వేశ్వరుడ్ని దర్శించుకొని భక్తి పారవశ్యంలో మునిగిపోయింది పూజా హెగ్డే. వారణాసి లోని గంగానది ఒడ్డున ఒక బోటులో కూర్చుని ఆ పరమపవిత్రమైన నగరాన్ని తిలకిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఓం నమఃశివాయ .. మన కలల్ని సాకారం చేసుకొనేటప్పుడు.. పరమశివుడంతటి పట్టుదలగా ఉండాలి, క్షమించే విషయంలో ఆయనంతటి దయాళువై ఉండాలి’ అంటూ అద్భుతమైన జీవిత సత్యాన్ని వేదాంత కోణంలో తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.