1. Ukraine దేశానికి ప్రపంచ బ్యాంకు 3 బిలియన్ డాలర్ల సహాయం
రష్యా సైనిక దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ దేశానికి 3 బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీని ఇవ్వనున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది.ఈ ప్యాకేజీలో 350 మిలియన్ డాలర్లను తక్షణం విడుదల చేయాలని వరల్డ్ బ్యాంకు నిర్ణయించింది. ఉక్రెయిన్ దేశంలోని కైవ్ నగరానికి సమీపంలో 64 కిలోమీటర్ల మేర రష్యా సేనలు మోహరించాయి. ఖార్కివ్ లోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయంపై రష్యా సైనికులు దాడి చేయడంతో 10 మంది మరణించారు.ఉక్రెయిన్ దేశంలోని నివాస భవనాలపై వైమానిక దాడితో 8మంది పౌరులు మరణించారు.రష్యా దాడి తర్వాత 6,77,000 మందికి పైగా ప్రజలు ఉక్రెయిన్ నుంచి పారిపోయారని ఐక్యరాజ్యసమితి యొక్క శరణార్థి ఏజెన్సీ తెలిపింది.
2. ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన
ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌కు అమెరికా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ను రష్యా బలహీనపర్చలేదని, ఉక్రెయిన్‌పై దాడులకు వ్లాదిమిర్ పుతిన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు దుర్మార్గమని మండిపడ్డారు. పుతిన్‌ను ప్రపంచం ఏకాకి చేయాలని బైడెన్ పిలుపు ఇచ్చారు. ఉక్రెయిన్‌లో ప్రతి భాగాన్ని కాపాడతామన్నారు. రష్యా ఆర్థిక వ్యవస్థను స్థంభింపచేస్తామన్నారు. అమెరికా గగనతలం నుంచి రష్యా విమానాల రాకపోకలపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఉక్రెయిన్ తరఫున అమెరికా సేనలు యుద్ధం చేయవని తెలిపారు. ఉక్రెయిన్‌ను రష్యా ముట్టడించినా.. ప్రజల మనసులు పుతిన్ గెలుచుకోలేరన్నారు. రష్యాలో ఆర్థిక సంక్షోభానికి పుతినే కారణమని జో బైడెన్ అన్నారు.
3. War effect: రష్యాలో ఆపిల్ ఉత్పత్తుల విక్రయాల నిలిపివేత
రష్యాలో ఆపిల్ కంపెనీ ఉత్పత్తుల విషయంలో అమెరికన్ టెక్నాలజీ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది.ఉక్రెయిన్‌పై సైనిక దాడి చేసిన తర్వాత రష్యాలో తమ కంపెనీ ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసినట్లు అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఆపిల్ ప్రకటించింది.‘‘మేం రష్యాలో అన్ని ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేశాం.మేం అన్ని ఎగుమతులను నిలిపివేసాం.’’అని ఆపిల్ తెలిపింది.ఉక్రెయిన్‌లో రష్యా వైమానిక దాడులు చేస్తున్నందున ఆపిల్ కంపెనీ రష్యాలో ఆపిల్ పే, ఇతర సేవలను పరిమితం చేసింది. ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక దాడి చేసినప్పటి నుంచి అమెరికా నేతృత్వంలోని పలు దేశాలు మాస్కోపై పలు ఆంక్షలు విధించాయి.యూరోపియన్ యూనియన్ తమ గగనతలంపై రష్యన్ విమానాల రాకపోకలపై నిషేధాన్ని విధించింది. కెనడా , స్వీడన్ కూడా రష్యా నుంచి బయలుదేరే విమానాలకు తమ గగనతలాన్ని మూసివేశాయి.రష్యాను ఒంటరిగా చేయడానికి పాశ్చాత్య మిత్రదేశాలు సమిష్ఠిగా ఆర్థిక ఆంక్షలు విధించాలని నిర్ణయించుకున్నాయి. ఈ చర్యలు తప్పనిసరిగా దాని విదేశీ కరెన్సీ నిల్వలను స్తంభింపజేశాయి. స్విఫ్ట్ నెట్‌వర్క్ నుంచి టాప్ రష్యన్ బ్యాంకులను లాక్ చేసింది.అంతర్జాతీయ ఈవెంట్‌ల నుంచి రష్యన్, బెలారసియన్ అథ్లెట్లు, అధికారులను మినహాయించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ క్రీడా సమాఖ్యలు,నిర్వాహకులకు పిలుపునిచ్చింది.
4.12 మంది Russian దౌత్యవేత్తలపై అమెరికా బహిష్కరణ వేటు
ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక దాడి నేపథ్యంలో అమెరికా 12 మంది రష్యా దౌత్యవేత్తలపై బహిష్కరణ వేటు విధించింది. ఐక్యరాజ్యసమితిలో ఇంటెలిజెన్స్ ఆపరేటివ్లుగా పనిచేస్తున్న రష్యాకు చెందిన 12మంది రష్యన్ దౌత్యవేత్తలను అమెరికా దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు యునైటెడ్ స్టేట్స్ వెల్లడించింది.‘‘మా జాతీయ భద్రతకు ప్రతికూలమైన గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా యునైటెడ్ స్టేట్స్లో రష్యా దౌత్యవేత్తలు వారి నివాస అధికారాలను దుర్వినియోగం చేశారు.”అని యూఎస్ మిషన్ ప్రతినిధి ఒలివియా డాల్టన్ చెప్పారు. యునైటెడ్ స్టేట్స్ విడిచిపెట్టమని కోరిన దౌత్యవేత్తలు వారి బాధ్యతలు విస్మరించి, సంబంధం లేని కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారని ఒలివియా చెప్పారు.రష్యాకు చెందిన దౌత్యవేత్తలు దౌత్యేతర కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారని ఐక్యరాజ్యసమితిలో అమెరికా డిప్యూటీ రాయబారి రిచర్డ్ మిల్స్ గతంలో ఆరోపించారు. మార్చి 7వతేదీలోగా 12 మంది రష్యా దౌత్యవేత్తలు యునైటెడ్ స్టేట్స్ ను వదిలి వెళ్లాలని ఆదేశించినట్లు న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రష్యా దౌత్యవేత్త వాసిలీ నెబెంజియా చెప్పారు.నిష్క్రమించమని చెప్పిన వారిలో తాను కూడా ఉన్నానో లేదో పేర్కొనడానికి అతను నిరాకరించారు.ఐక్యరాజ్యసమితిలో రష్యాకు చెందిన 100 మంది సిబ్బంది పనిచేస్తుండగా వారిలో 12 మంది దౌత్యవేత్తలపై అమెరికా బహిష్కరణ వేటు వేసింది
5. ఫ్రాన్స్ ను హెచ్చరించిన రష్యా
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించిన ఫ్రాన్స్ ను రష్యా హెచ్చరించింది. ‘‘మేము రష్యా ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాం’’ అని ఫ్రెంచ్ ఆర్థిక మంత్రి బ్రూనో లి మెయిర్ అన్నట్లు బీబీసీ న్యూస్ పేర్కొంది. దానికి రష్యా మాజీ అధ్యక్షుడు, ఆ దేశ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వెదెవ్ స్పందించారు. ‘‘మీరు నోరు అదుపులో పెట్టుకోండి జంటిల్‌మేన్. మానవ చరిత్రలో ఆర్థిక యుద్ధాలు నిజమైన యుద్ధాలుగా మారిన విషయాన్ని మర్చిపోకండి’’ అని హెచ్చరించారు.
6. అణు యుద్ధం జరుగుతుందా?
ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన పుతిన్.. ‘అణు’ హెచ్చరికలు చేస్తున్నారు. పుతిన్‌వి ఉత్తుత్తి బెదిరింపులేనా? లేక నిజంగానే ఉక్రెయిన్‌పై అణుదాడికి పాల్పడతారా? అంటే.. పుతిన్ మనస్తత్వం, రష్యాలో అధ్యక్షుడికి ప్రస్తుతం ఉన్న అపరిమిత అధికారాలు, వ్యవస్థల నడుమ అంతగా కనిపించని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వంటివాటిని పరిగణనలోకి తీసుకుంటే ‘అణు’ ముప్పు లేకపోలేదనే ఆందోళనను రక్షణ రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు పుతిన్ వ్యవహారశైలినే ఉదాహరణగా వారు చూపిస్తున్నారు. రష్యా లేని భూగోళం మరుభూమితో సమానమని కూడా చాలాసార్లు అనడం పుతిన్ దూకుడు తత్వానికి నిదర్శనం. ఉదాహరణకు గత గురువారం ఉక్రెయిన్‌పై ‘ప్రత్యేక సైనిక చర్య’ తీసుకోబోతున్నామంటూ ప్రకటించిన పుతిన్.. ప్రపంచదేశాలకు కూడా ఓ హెచ్చరిక జారీ చేశారు.ఆయన ప్రకటనలో ‘ఉక్రెయిన్‌పై యుద్ధం’ అనే అంశం దగ్గరే ఆగిపోయిన మీడియా, ప్రపంచ దేశాలు ఆ తర్వాత జారీచేసిన హెచ్చరిక గురించి పట్టించుకోలేదు. ఆ హెచ్చరిక ఏంటంటే.. ‘‘ఈ విషయంలో బయట నుంచి ఎవరైనా జోక్యం చేసుకోవాలనుకుంటే చరిత్రలో వారు ఎన్నడూ ఎదుర్కోనంత భయంకరమైన విపరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’. పుతిన్ చేసిన ఈ హెచ్చరికను.. అణ్వాయుధ యుద్ధానికి పాల్పడతాననే బెదిరింపుగానే పరిగణించవచ్చని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ద్మిత్రీ మురతోవ్ ఆందోళన వ్యక్తం చేశారు.
7. రెచ్చిపోతున్న రష్యాధ ట్రూప్స్.. ఆసుపత్రిపై బాంబుల దాడి
ఉక్రెయిన్‌లో హోరాహోరి పోరు కొనసాగుతోంది. రష్యా బలగాలు ఉక్రెయిన్‌లో బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. వారి దాడులను ఉక్రెయిన్ సైన్యం తిప్పికొడుతున్నప్పటికీ అక్కడ తీవ్ర నష్టం జరుగుతోంది. తాజాగా రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోని అతిపెద్ద నగరం ఖార్కీవ్‌లో దాడులు కొనసాగిస్తున్నాయి. రష్యా యుద్ద విమానాల దాడుల్లో మంగళవారం ఖార్కీవ్ నగర పరిపాలనా భవనం ఫ్రీడమ్ స్వ్కేర్ కుప్పకూలిపోయింది. మరోవైపు రష్యా బలగాలు ఖార్కీవ్‌లోని ఓ ఆసుపత్రిపై దాడులు చేసినట్టు ఉక్రెయిన్ సైన్యంర పేర్కొంది. రష్యా వైమానిక బలగాలు ఖార్కీవ్‌లోకి ప్రవేశించాయి. వారు స్థానిక ఆసుపత్రులపై దాడులు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎదురు దాడులు కొనసాగుతున్నాయని ఉక్రెయిన్ ఆర్మీ మంగళవారం ప్రకటించింది. మరోవైపు ఫ్రీడమ్ స్క్వేర్ కూల్చివేత, ఆసుపత్రిపై దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. ఈ దాడి రష్యా ప్రభుత్వ ఉగ్ర చర్య అని జెలెన్ స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని ఎవరూ క్షమించలేరంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. తమ బలమేంటో నిరూపించుకుంటామని రష్యాకు వార్నింగ్ ఇచ్చారు.
8. పుతిన్ అంతు చూస్తాం.. అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి కొనసాగుతూనే ఉంది. ఏడు రోజులుగా జరుగుతున్న హోరాహోరి పోరులో రెండు దేశాల సైన్యం శక్తివంచన లేకుండా పోరాడుతున్నాయి. చావును సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న ఉక్రెయిన్ సైన్యం తెగువ చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలు రష్యా చర్చను వ్యతిరేకిస్తూ ఆర్ధికపరమైన కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ పుతిన్ మాత్రం వెనకంజ వేయకుండా తగ్గేదేలే అన్నట్టుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను టార్గెట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉండగా రష్యాకు అగ్ర రాజ్యం అమెరికా మరో వార్నింగ్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగవారం కాంగ్రెస్ సంయుక్త సమావేశం ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు ఉంటుందని పేర్కొన్న బైడెన్.. రష్యాతో జరిగే పోరాటంలో అమెరికా మాత్రం పాల్గొనబోదని ఉద్ఘాటించారు. ఉక్రెయిన్ గడ్డపై అమెరికా బలగాలు రష్యాతో పోరాడబోవని బైడన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ సైన్యం రష్యా బలగాలను నిలువరిస్తూ వారి దాడులను తిప్పికొడుతోందని ప్రశంసించారు. ఉక్రెయిన్ దేశ పౌరులు సైతం తుపాకులు చేతపట్టుకొని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌పై సైనిక దాడులకు దిగిన రష్యా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. రష్యా, పుతిన్‌పై రానున్న కాలంలో యుద్ద ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో పుతిన్ గెలిచినా, ఓడినా.. ఆర్థిక పరంగా, ఇతర అంశాల విషయంలో రష్యా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పుతిన్ ఓ నియంత.. అతడి అంతు చూస్తామంటూ బెడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు
9. ఐరాసలో రష్యా దౌత్యాధికారుల బహిష్కరణ
ఐక్యరాజ్యసమితిలో రష్యాకు చెందిన 12 మంది దౌత్యాధికారులను అమెరికా బహిష్కరించింది. వీరంతా గూఢచర్య కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారని ఆరోపించింది. అమెరికాది రెచ్చగొట్టే చర్యన్న రష్యా, ఐరాసకు కేంద్రకార్యాలయం ఉన్న దేశంగా అమెరికా ఈ విధంగా చేయడం ఐరాస నిబద్ధతకు వ్యతిరేకమని విమర్శించింది. ఐరాసలో రష్యా శాశ్వత రాయబార బృందానికి, ఐరాస కేంద్ర కార్యాలయానికి బహిష్కరణ విషయాన్ని తెలియజేశామని ఐరాసలో అమెరికా రాయబారి ప్రతినిధి ఓలివియా డాల్టన్ తెలిపారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని వీరిపై చర్య తీసుకున్నామని, ఐరాస కేంద్రకార్యాలయ ఒప్పంద నిబంధనలకు అనుగుణంగానే వారిని బహిష్కరించామని వివరించారు. అమెరికా చర్య నిబంధనలకు వ్యతిరేకమని రష్యా రాయబారి వాస్లీ నెబెంజియా విమర్శించారు. అమెరికా చర్యకు తప్పక ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. అనంతరం ఈ విషయాన్ని ఆయన భద్రతామండలి సమావేశంలో ప్రస్తావించారు. అయితే ఎజెండాలో రాయబారుల బహిష్కరణ అంశం లేదని నెబెంజియాను యూఎస్ ప్రతినిధి అడ్డుకున్నారు. ఉక్రెయిన్‌లో మానవీయ సంక్షోభాన్ని చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటైందన్నారు.
10. పాక్, టర్కీ విద్యార్థులను కాపాడిన భారత జాతీయ జెండా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న పాకిస్థానీ, టర్కిష్ పౌరులు భారత దేశ జాతీయ పతాకాన్ని రక్షణ కవచంగా ఉపయోగించుకుంటున్నారు. రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ నుంచి తప్పించుకోవడానికి విదేశీయులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. భారత ప్రభుత్వం భారతీయులను, విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు కట్టుదిట్టంగా ప్రయత్నిస్తోంది. భారత దేశ జాతీయ జెండాను స్పష్టంగా కనిపించేలా ఉంచుకుంటే ఇబ్బందులు తలెత్తబోవని భారతీయులకు సూచనలు అందాయి. ఈ సలహాను పాకిస్థాన్, టర్కీ జాతీయులు తమ ప్రాణాలను కాపాడుకుంటూ, ఉక్రెయిన్ నుంచి బయటపడటానికి ఉపయోగించుకుంటున్నారు. ఉక్రెయిన్‌లో ఉంటున్న పాకిస్థానీ, టర్కిష్ పౌరులు ఆ దేశం నుంచి పొరుగు దేశాలకు వెళ్ళిపోయేందుకు చాలా శ్రమించవలసి వస్తోంది. భారతీయులకు అందిన సూచన వీరికి బాగా కలిసొచ్చింది. ఓ వార్తా సంస్థ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, రొమేనియాకు చేరుకున్న భారతీయులు ఈ ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. ఉక్రెయిన్‌లోని వివిధ చెక్‌పాయింట్లను దాటుకుని పొరుగు దేశాలకు వెళ్ళిపోవడానికి పాకిస్థానీ, టర్కిష్ జాతీయులకు భారత దేశ జాతీయ పతాకం బాగా ఉపయోగపడిందని చెప్పారు. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తోంది. ‘ఆపరేషన్ గంగ’ పేరుతో చురుగ్గా వీరిని తీసుకొస్తోంది. స్పైస్‌జెట్, ఇండిగో, ఎయిరిండియా, భారత సైన్యం విమానాలను పంపించి, భారతీయులను స్వదేశానికి రప్పిస్తోంది.
11. భారతీయులను వెనక్కి తెచ్చే ఏ ప్రయత్నాన్నీ వదలం:
యుద్ధంతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ నుంచి భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఏ ఒక్క ప్రయత్నాన్నీ వదిలి పెట్టేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోన్‌భద్ర జిల్లాలో బుధవారంనాడు జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, ఆపరేషన్ గంగా పేరుతో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా వెనక్కి తెస్తున్నామని చెప్పారు. వేలాది మందిని ఇప్పటికే భారత్‌తు తీసుకువచ్చామని చెప్పారు. తాము చేపట్టిన ఆపరేషన్‌ను మరింత వేగవంతం చేసేందుకు నలుగురు మంత్రులను కూడా అక్కడకు పంపామని, భారతీయులను సురక్షితంగా తెచ్చేందుకు అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని కూడా వదలిపెట్టేది లేదని అన్నారు. ఇండియా బలం పెరుగుతున్నందున్నే మనం ఇలాంటి సురక్షిత చర్చలు తీసుకోగలుగుతున్నామని అన్నారు. కాగా, ఈనెల 7వ తేదీన జరిగే తుది విడత పోలింగ్‌లో సోన్‌భద్ర జిల్లా కూడా ఉంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటించనున్నారు.
12. ఎంబసీ అధికారులపై భారతీయ విద్యార్థుల ఆగ్రహం
ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులపై అక్కడి భారతీయ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధాని కీవ్ నుంచి తమను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎలాంటి రవాణా సౌకర్యాలూ కల్పించలేదని ఆరోపించారు. పశ్చిమ సరిహద్దుకు వెళ్లడానికి కీవ్ రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక రైళ్లు సిద్ధంగా ఉన్నాయని, స్టేషన్‌కు చేరుకోవాలని అడ్వైజరీ పంపి చేతులు దులుపుకొన్నారని ఆక్షేపించారు. స్టేషన్‌లో, రైలులో 100 మంది భారతీయ విద్యార్థులు ఏ విధంగా కష్టాలు పడుతున్నదీ వివరిస్తూ ఘజియాబాద్‌కు చెందిన ఆష్నా పండిత్, ఆమె సోదరుడు అంశ్ పండిత్ (కవలలు) తమ తల్లిదండ్రులకు, మిత్రులకు వీడియోలు పంపించారు.
కీవ్‌లో ఇప్పటికే ఏటీఎంలు ఖాళీ. తినడానికి కూడా ఏమీ లేవు. ఈ పరిస్థితుల్లో వీరంతా సోమవారం కీవ్‌లోని నేషనల్ మెడికల్ వర్సిటీ హాస్టల్ వెనుక గేటు గుండా తప్పించుకుని ప్రధాన రైల్వే హబ్‌కు చేరుకున్నారు. ఈ 100మందిలో యువతులే ఎక్కువ. ‘విదేశీయుల తరలింపునకు ఉక్రెయిన్ రైల్వేస్ ప్రత్యేక రైళ్లు నడుపుతోందని భారత రాయబార కార్యాలయం తన అడ్వైజరీలో పేర్కొంది. కానీ రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితి భిన్నంగా ఉంది. మమ్మల్ని గార్డులు రైలెక్కనివ్వలేదు. కొందరిని ఉక్రెయిన్ గార్డులు కొట్టారు కూడా. ఇలా చాలా రైళ్ల నుంచి మమ్మల్ని తోసివేశారు. బోగీల తలుపులు మూసే శారు.తర్వాత మేమంతా జట్లుగా ఏర్పడి ల్వీవ్ వెళ్లే రైలెక్కగలిగాం. రైలు ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. నిలబడేందుకే చోటు దొరికింది. ఇలాగే 9 గం టలు ప్రయాణించాలి. ఎలాగోలా ల్వీవ్ నగరం చేరితే చాలు’ అని ఆష్నా మిత్రుల మధ్య నిల్చుని ఏడుస్తూ చెప్పారు. అక్కడి నుంచి పోలండ్ లేదా హంగరీ సరిహద్దుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తామని, ఇంకో 570 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపారు. అక్కడి నుం చి వీలైనంత త్వరగా తమను తరలించాలని రాయబార కార్యాలయాన్ని మరోసారి వేడుకున్నారు. ఆమె పంపిన వీడియోలు భయంకరంగా ఉన్నాయి. ఉక్రెయిన్ గార్డులు బోగీల నుంచి కొందరిని తోసివేయడం, తరిమివేయడం వంటివి అందులో ఉన్నాయి. ఈ వీడియోలు చూసిన ఆష్నా తల్లిదండ్రులు అనిల్, సునీత బోరుమన్నారు. వీటికితోడు ఖర్కివ్‌లో కర్ణాటక విద్యార్థి చనిపోయిన సంఘటన కలవరపెడుతోంది
13. ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయిన మరో భారతీయ విద్యార్థి యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మరో భారతీయ విద్యార్థి చందన్ జిందాల్ (22) బుధవారం ప్రాణాలు కోల్పోయారు. ఆయన పంజాబ్‌లోని బర్నాలాకు చెందినవారని, వినిట్సియాలోని నేషనల్ పైరోగోవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి 24న రష్యా దాడులు ప్రారంభమైన తర్వాత ప్రాణాలు కోల్పోయిన మొదటి విద్యార్థి కర్ణాటకకు చెందిన నవీన్ అనే సంగతి తెలిసిందే. మీడియా కథనాల ప్రకారం, ఇషెమిక్ స్ట్రోక్‌తో బాధపడుతున్న జిందాల్‌ను వినిట్సియాలోని కీవ్‌స్కా వీథి-68లో ఉన్న ఎమర్జెన్సీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తున్నారు. ఆయన తండ్రి భారత ప్రభుత్వానికి రాసిన లేఖలో తమ కుమారుని మృతదేహాన్ని రప్పించేందుకు సాయం చేయాలని కోరారు. కర్ణాటకకు చెందిన నవీన్ శేఖరప్ప మంగళవారం ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో జరిగిన పేలుళ్ళలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతదేహాన్ని రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ గగనతలంలో ప్రయాణికుల విమానాల రాకపోకలపై నిషేధం అమలవుతోంది. కాబట్టి మృతదేహాలను తీసుకురావడానికి ఇతర మార్గాలను అన్వేషించవలసి ఉంటుంది. ఇషెమిక్ స్ట్రోక్ వచ్చినపుడు మెదడుకు ఆక్సిజన్, న్యూట్రియెంట్స్ సక్రమంగా అందవు. క్షణాల్లోనే బ్రెయిన్ సెల్స్ మరణిస్తాయి. దీనికి సరైన, అత్యవసర చికిత్స తప్పనిసరి. సాధ్యమైనంత త్వరగా చికిత్స అందితే మెదడుకు జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు.
14. తక్షణమే ఖార్కివ్ నుంచి వెళ్లిపొండి… భారతీయులకు ఇండియన్ ఎంబసీ ఆదేశం… యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నగరం నుంచి వెంటనే, తక్షణమే వెళ్ళిపోవాలని భారతీయులను ఇండియన్ ఎంబసీ బుధవారం ఆదేశించింది. తాజాగా జారీ చేసిన అడ్వయిజరీలో ఖార్కివ్‌లో ఉన్న భారతీయులంతా తక్షణమే పెసోచిన్, బబయే, బెజ్లియుడోవికాలకు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటల్లోగా వెళ్ళిపోవాలని తెలిపింది. రష్యా దళాలు నిరంతరం క్షిపణి దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ అడ్వయిజరీని జారీ చేసింది.