DailyDose

గతేడాది కన్నా 11 శాతం పెరిగిన సంపన్నులు

గతేడాది కన్నా 11 శాతం పెరిగిన సంపన్నులు

దేశంలో అల్ట్రా హెచ్‌ఎన్‌ఐ (అధిక విలువ కలిగిన వ్యక్తులు)ల సంఖ్య 2021లో 11 శాతం పెరిగి 13,637కు చేరుకుంది. 30 మిలియన్‌ డాలర్లు (రూ.225 కోట్లు) అంతకంటే ఎక్కువ కలిగిన వారిని అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలుగా పరిగణిస్తారు. గడిచిన ఏడాది ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేయడం, డిజిటల్‌ విప్లవం హెచ్‌ఎన్‌ఐల వృద్ధికి తోడ్పడినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ తన తాజా నివేదికలో తెలిపింది. 2021లో బిలియనీర్ల సంఖ్యా పరంగా భారత్‌ మూడో స్థానంలోఉన్నట్టు పేర్కొంది. 748 బిలియనీర్లతో అమెరికా మొదటి స్థానంలో ఉంటే, 554 మంది బిలియనీర్లతో చైనా రెండో స్థానంలో ఉంది. భారత్‌లో 145 మంది బిలియనీర్లు ఉన్నారు. ‘ద వెల్త్‌ రిపోర్ట్‌ 2022’ను నైట్‌ ఫ్రాంక్‌ మంగళవారం విడుదల చేసింది.
* 2021లో అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల సంఖ్య అంతర్జాతీయంగా 9.3 శాతం పెరిగి 6,10,569కు చేరింది. అంతకుముందు సంవత్సరంలో వీరి సంఖ్య 5,58,828.
* భారత్‌లో అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 2020 చివరికి 12,287గా ఉంటే, 2021 చివరికి 13,637కు పెరిగింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌లోనే వృద్ధి ఎక్కువగా నమోదైంది.
* బెంగళూరు నగరంలో వీరి సంఖ్య పెరుగుదల ఎక్కువగా ఉంది. గతేడాది ఈ నగరంలో అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 17 శాతం వృద్ధి చెంది 352గా ఉంది.
* ఆ తర్వాత ఢిల్లీలో 12.4 శాతం పెరిగి 210కి, ముంబైలో 9 శాతం పెరిగి 1,596కు అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల సంఖ్య చేరింది.
* దేశంలోని సంపన్నుల్లో 69 శాతం మంది సంపద 2022లో 10 శాతం పెరుగుతుందని నైట్‌ ఫ్రాంక్‌ అంచనా.
* ఆసియా బిలియనీర్ల క్లబ్‌గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2021 నాటికి ఉన్న బిలియనీర్లలో 36 శాతం మంది ఆసియాలోనే ఉన్నారు.
* అంతర్జాతీయంగా 1,35,192 అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలు తాము సొంతంగా సంపాదించి ఈ స్థితికి చేరినవారు. వీరిలో 40 ఏళ్లలోపు వారు 20 శాతంగా ఉన్నారు.
* ఇలా స్వయంగా పైకి ఎదిగిన అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల వృద్ధి విషయంలో భారత్‌ ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది.
* వచ్చే ఐదేళ్లలో అంతర్జాతీయంగా హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 28 శాతం పెరుగుతుందని అంచనా. అలాగే భారత్‌లో 2021–2026 మధ్య అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 39 శాతం పెరిగి 19,006కు చేరుకోవచ్చు.