తెలుగు, హిందీ భాషల్లో కథానాయికగా తమదైన ముద్ర వేసిన వారిలో రకుల్ ప్రీత్‌సింగ్ ఒకరు. ‘థాంక్ గాడ్’, ‘ఎటాక్’, ‘రన్ వే’, ‘డాక్టర్ జీ’ చిత్రాల్లో చేస్తూ బాలీవుడ్‌లో బిజీగా కొనసాగుతున్నారు. అయితే కెరీర్ మొదట్లో కొన్ని అవకాశాలను వదులుకున్నాను అన్నారు రకుల్. ‘నటిగా తొలిసారి కన్నడ చిత్రంలో చిన్న పాత్ర చేశాను. దాంతో హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి. కానీ చదువు పూర్తి చేయాలని వాటిని వదులుకున్నాను. అలా చేయడం చాలా పెద్ద తప్పు అని తర్వాత అర్థమైంది. కాళ్ల దగ్గరకు వచ్చిన దాన్ని కాదనుకోకూడదని అర్థమైంది. అప్పుడు మాత్రం నాపై నాకే కోపం వచ్చింది. నన్ను నేను ‘స్టుపిడ్’ అని తిట్టుకున్నాను. అప్పటి నుంచి ఎంత బిజీగా ఉన్నా మంచి చిత్రాలను వదులుకోలేదు. కెరీర్‌లో వెను తిరిగి చూసుకోలేదు’ అని రకుల్ ప్రీత్‌సింగ్ గతాన్ని గుర్తు చేసుకున్నారు.