DailyDose

పోలీసులకు విదేశీ వనిత కృతజ్ఞతలు – TNI నేర వార్తలు

పోలీసులకు విదేశీ వనిత కృతజ్ఞతలు – TNI నేర వార్తలు

* ‘ఫిర్యాదు చేసిన తక్షణమే స్పందించారు. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టుచేసి నాకు రక్షణ కల్పించిన జిల్లా పోలీసులకు రుణపడి ఉంటా’ అని విదేశీ వనిత పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో మంగళవారం లిథువేనియా దేశానికి చెందిన మహిళ (27)పై ఇద్దరు యువకులు లైంగికదాడికి యత్నించడం.. ఆమె తప్పించుకుని వాహనచోదకుల సహాయంతో పోలీసుల రక్షణ పొందడం విదితమే.బుధవారం ఆమె నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సీహెచ్‌ విజయారావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు స్పందన చాలా బాగుందని కొనియాడారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను ఒంటరిగా అనేక దేశాలు పర్యటించినా.. ఎప్పుడు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కోలేదన్నారు. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్‌ చేశారని, జిల్లా ఎస్పీకి, పోలీసు అధికారులకు రుణపడి ఉంటానంటూ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

*విజయనగరం జిల్లా సాలూరు పరిధిలో ఉన్న బంగారమ్మ పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కొత్తూరు గ్రామానికి చెందిన మామిడి లక్ష్మణ్(24) అనే యువకుడు మృతి చెందాడు. కొత్తూరు గ్రామానికి చెందిన మామిడి లక్ష్మణ్ ద్విచక్ర వాహనంపై తోణం వైపు వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. హెల్మెట్ ఉన్నప్పటికీ పెట్టుకోక పోవడం వల్లే.. తలకు త్రీవమైన గాయాలై మరణించాడని పోలీసులు భావిస్తున్నారు. హెల్మెట్ ధరించి ఉన్నట్లయితే ప్రాణహాని తప్పేదని.. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ ఫక్రుద్దీన్ అన్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

*కృష్ణాజిల్లాలో వేరువేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో.. ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గన్నవరం శివారు దుర్గాపురం వద్ద చెన్నై-కోల్ కతా జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తులపైకి లారీ దూసుకురావడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

*గోవా నుండి గుంటూరుకు అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను సెబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు జగ్గారెడ్డి, నాగార్జున, ప్రసాద్ వద్ద నుంచి 492 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మద్యం బాటిళ్లను సరఫరా చేస్తున్న లారీని, కారును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మద్యం విలువ సుమారు రూ.21 లక్షలు ఉంటుందన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

*గుంటూరు జిల్లా మంగళగిరిలో ద్విచక్రవాహనాలు చోరీ చేస్తున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. కొప్పురావూరు కాలనీకి చెందిన బత్తిన కోటేశ్వరరావు చెడు వ్యవసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. సైడ్ తాళం వేయని ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిని తీసుకెళ్లి ఇతర ప్రాంతాలలో విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. మొదట్లో చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడని.. ఇప్పుడు ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్నారని తెలిపారు. కోటేశ్వరరావు నుంచి 8 ద్విచక్రవాహనాలు, మూడు కుట్టు మిషన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాంబాబు తెలిపారు.

*భార్యాభర్తలను హత్య చేయాలనే ఉద్దేశంతో పెట్రోల్‌ పోసి తగులబెట్టినట్లుగా దాఖలైన కేసులో ఐదుగురు నిందితులపై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికీ పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ మహిళా సెషన్స్‌ జడ్జి జి.ప్రతిభాదేవి బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన జూలూరి రమాదేవితో జూలూరి హనుమంతరావుకు రెండో వివాహం జరిగింది. ఈ వివాహం హనుమంతరావు మొదటి భార్య పిల్లలకు ఇష్టం లేదు. ఆస్తి వ్యవహారాల్లో వారికి తండ్రి హనుమంతరావుతో విభేదాలున్నాయి.

*తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అధికార డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కజకం) పార్టీకి చెందిన ఎంపీ కుమారుడు రాకేష్‌(22) మృత్యువాతపడ్డాడు.

*కర్నూలు… డోన్‌లో దొంగలు బీభత్సం
కర్నూలు ల్లాలోని డోన్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. వైఎస్ నగరంలో ఒకే వీధిలో 7 ఇండ్లలో వరుస చోరీలకు పాల్పడ్డారు. 8 తులాల బంగారు,10 తులాల వెండి, బైక్‌ను దొంగలు అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

* కాలేజ్ స్టూడెంట్స్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థులను టార్గెట్ గా చేసుకుని మత్తుపదార్థాలను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి రూ. 7 కోట్లు విలువైన 13 కిలోల హాషిష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు.
ఈజీ మనీతో పాటు లగ్జరీ జీవితానికి అలవాటు పడి డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్న ముగ్గురిని బెంగళూరులోని హుళిమావు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కేరళ కొత్తనూర్కు చెందిన విష్టుప్రియ, ఆమె ప్రియుడు సిగిల్ వర్గీస్, మరో సహాయకుడు విక్రమ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7 కోట్లు విలువైన 13 కిలోల హషీష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

*ఒంగోలు ఆర్టీసీ కార్గోలో గుట్కా ప్యాకెట్ల రవాణా కలకలం రేపుతోంది. కర్నూలు నుండి ఒంగోలుకు ఆర్టీసీ బస్సులో గుట్కా ప్యాకెట్లు పార్శిల్ చేసిన పృద్వీ అనే వ్యక్తిని ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. దాదాపు 28 వేల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీలో గుట్కా ప్యాకెట్ల రవాణాపై ఎస్ఈబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

*ఇద్దరు దారిదోపిడి దొంగలను అరె్‌స్టచేసి వారి నుంచి 15గ్రాముల బంగారం, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాదీనం చేసుకుని రూరల్‌ సీఐ హమీద్‌ఖాన తెలిపారు. అరెస్ట్‌ వివరాలను బుధవారం సర్కిల్‌ కార్యాలయం వెలుపల విలేకరులతో వెల్లడించారు.

*పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇంజినీరింగ్ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖకు చెందిన స్వామి కృష్ణ సాయి అనే విద్యార్థి ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. జంబ్లింగ్ విధానంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఏ కళాశాల విద్యార్థులు అదే కళాశాలలో పరీక్షలకు హాజరవుతారని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లాయర్ మతుకిమిల్లి శ్రివిజయ్ పిటిషనర్లు తరుపు వాదనలు వినిపించారు.

*పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాంటిస్సోరి స్కూల్ ఉపాధ్యాయుడు కేఎస్ శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ భవనంలో ఉరి వేసుకుని ఉపాధ్యాయుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. శివప్రసాద్ స్వస్థలం కేరళ రాష్ట్రం. గత మూడేళ్లుగా స్కూలులో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*కామారెడ్డిలోని తాడ్వాయిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. యువతి స్నేహ(18) మృతి చెందింది. యువకుడి నందీశ్వర్‌ పరిస్థితి విషమంగా ఉంది. ప్రేమజంట మెదక్‌ జిల్లా ఘన్పూర్‌ వాసులుగా గుర్తించారు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెంది ఈ ఘటనకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

*చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జైకేసారం గ్రామానికి చెందిన అండాలు(అనే మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు మంటలను ఆర్పివేసి వెంటనే సదరు మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఘర్షణనే ఆత్మహత్యాయత్నానికి గల కారణమని పోలీసులు భావిస్తున్నారు.

*శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రాంతం మేనకూరు సెజ్‌లోని లాయల్‌ టెక్స్‌టైల్‌ కర్మాగారంలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్టు అంచనా. కర్మాగారంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్మికులంతా భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. కర్మాగారంలోని దూది, వస్త్ర గోదాములకు మంటలు వ్యాపించి దట్టమైన పొగలు అలముకున్నాయి. నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, కోట ప్రాంతాలకు చెందిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల జరిగిందో లేదా మరేదైనా కారణం ఉందో తెలియాల్సి ఉందని యాజమాన్యం తెలిపింది.

*చెన్నైలో తీగ లాగితే.. ఒంగోలులో డ్రగ్స్‌ డొంక కదిలింది. ఒంగోలులోని ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో నిషేధిత మత్తు పదార్థాల తయారీ స్థావరంపై సోమవారం రాత్రి చెన్నై పోలీసులు దాడిచేసి ఈ కేంద్రాన్ని సీజ్‌ చేశారు. దీంతో అక్కడ నిషేధిత మెథాంఫెటమైన్‌ అనే డ్రగ్‌ని గుట్టుగా తయారు చేసి ప్యాకెట్ల రూపంలో ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు వెలుగులోకొచ్చింది. సోమవారం రాత్రి చెన్నై నుంచి వచ్చిన పోలీసుల ప్రత్యేక బృందం నేరుగా పారిశ్రామిక వాడలోని గోడౌన్‌ వద్దకు వెళ్లి తనిఖీ చేయగా.. మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఆరు రోజుల క్రితం చెన్నైలో మెథాంఫెటమైన్‌ డ్రగ్‌ తీసుకుంటున్న నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఇది ఎక్కడ నుంచి వచ్చింది..? ఎవరు సరఫరా చేస్తున్నారు..? అనే కోణంలో వారిని విచారించగా.. ఒంగోలు తయారీ కేంద్రం గుట్టు తెలిసింది. దీని మూలాలు హైదరాబాద్‌లో ఉన్నట్లు తేలింది. దీంతో అక్కడకు కూడా ప్రత్యేక బృందాలు వెళ్లినట్లు సమాచారం. మత్తుపదార్థాలు బయటపడిన కేంద్రంలో రెండేళ్ల క్రితం వరకు ఒంగోలుకు చెందిన పెంట్యాల బ్రహ్మయ్య విస్తరాకుల తయారీ నిర్వహించేవాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నామని చెబుతున్న విజయ్‌, వెంకటరెడ్డి అనే వ్యక్తులు దీన్ని అద్దెకు తీసుకున్నారు. అప్పటినుంచి గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్‌ తయారుచేసి చెన్నైతోపాటు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు తెలిసింది.

*పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మర్రిపాలెంలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న భార్యను భర్త సుందరరావు దారుణంగా హత్య చేశారు. నిందితుడు గతంలో ఒక కేసులో పదేళ్ళు జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.