NRI-NRT

భారత దౌత్య వేత్తలు అద్భుతమైన వారు: జర్మన్ రాయబారి

భారత దౌత్య వేత్తలు అద్భుతమైన వారు: జర్మన్  రాయబారి

భారత దౌత్యవేత్తలు అద్భుతమైన వారంటూ జర్మన్‌ రాయబారి వాల్టర్ జే లిండ్నర్ ప్రశంసించారు. సంక్షోభ సమయాల్లో ఏం చేయాలో అన్నది వారికి బాగా తెలుసని కితాబు ఇచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో భారతీయులను అక్కడి నుంచి సరక్షితంగా తరలించేందుకు భారత దౌత్యవేత్తలు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. ఉక్రెయిన్‌లో పెరుగుతున్న ఆందోళనలపై మీడియాతో ఆదివారం మాట్లాడారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు తగిన స్థానంతోపాటు అద్భుతమైన దౌత్య సేవలు ఉన్నాయన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న దేశ ప్రజలను రక్షించడంపై భారత దౌత్యవేత్తలను చూసి ఏం చేయాలో తెలుసుకోవాలని తమ దౌత్య అధికారులకు ప్రపంచ దేశాలు చెబుతున్నాయని వ్యాఖ్యానించారు.ప్రపంచం విషయంలో భారతదేశం పాత్రను యూరోపియన్ యూనియన్ ఎలా చూస్తుంది అన్నదానిపై భారత్‌లోని జర్మన్‌ రాయబారి వాల్టర్ జే లిండ్నర్ స్పందించారు. ‘భారతదేశం అద్భుతమైన దౌత్య సేవలను కలిగి ఉంది. ఏమి చేయాలో వారికి తెలుసు. ఇది (రష్యా దాడి) ఉక్రెయిన్ లేదా ఈయూ లేదా నాటో గురించి మాత్రమే కాదు. ఇది ప్రపంచ వ్యవస్థకు సంబంధించినది. దీనికి వ్యతిరేకంగా మనమందరం కలిసి నిలబడాలి’ అని ఆయన అన్నారు.