మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యోదంతం కేసులో దోషిలా తేలిన ఏజీ పెరారివాలన్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం బెయిల్ మంజూరుచేసింది. పెరారివాలన్‌కు గతంలో యావజ్జీవ కారాగార శిక్ష పడటంతో ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అయితే, గత 30 సంవత్సరాలుగా ఆయన జైల్లో మగ్గిపోయారని, పెరోల్ కాలంలోనూ సత్ప్రవర్తనతో మెలిగాడని బెయిల్ ఉత్తర్వుల మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.ఎండీఎంఏ కేసు పూర్తయ్యేదాకా తన జీవితకాల శిక్షను రద్దు చేయాలంటూ 47 ఏళ్ల పెరారివాలన్ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1991 మే 21న రాజీవ్‌గాంధీని మహిళా ఆత్మాహుతి బాంబర్ ధను హత్యచేయడం తెల్సిందే. ఈ ఘటనలో ప్రమేయమున్న మురుగన్, సంథమ్, నళినిలతోపాటు పెరారివాలన్‌లకు ఉరిశిక్ష పడింది. అయితే శంథన్, మురుగన్, పెరారివాలన్‌ల క్షమాభిక్ష పిటిషన్లు 11 ఏళ్లపాటు పెండింగ్‌లో ఉండటంతో 2014 ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు పెరారివాలన్ ఉరిశిక్షను యావజ్జీవశిక్షగా మారుస్తూ తీర్పు చెప్పింది.