బాలీవుడ్ చిత్రసీమలో ప్రతిభావంతురాలైన కథానాయికగా పేరు సంపాదించుకుంది అనుష్కశర్మ. వాణిజ్య చిత్రాలతో పాటు ప్రయోగాత్మక ఇతివృత్తాల్లో నాయికగా నటించి విమర్శకుల ప్రశంసలందుకుంది. కేవలం నటనకు పరిమితం కాకుండా తన అభిరుచిని ప్రతిబింబించేలా చిత్రాల్ని కూడా నిర్మించింది. క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ పతాకంపై ఆమె నిర్మించిన ‘ఎన్.హెచ్.10’ ‘ఫిల్లౌరి’ ‘పాతాళ్ లోక్’ వంటి చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. అయితే తాను నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లుగా అనుష్కశర్మ తాజాగా ఓ ప్రకటన చేసింది. ఇకముందు పూర్తి స్థాయిలో నటనపై దృష్టిపెట్టాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రకటన చేసింది. ‘ప్రస్తుతం నేను గృహిణిగా, నటిగా రెండు బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నందు వల్ల మిగతా పనులకు సమయం సరిపోవడం లేదు. అందుకే సినీ నిర్మాణం నుంచి తప్పుకుంటున్నా. జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుందామని ఈ నిర్ణయం తీసుకున్నా. ఇక నుంచి నటనకే పూర్తి సమయాన్ని కేటాయిస్తా’ అని అనుష్కశర్మ పేర్కొంది. సోదరుడు కర్నేష్‌శర్మతో కలిసి అనుష్కశర్మ సినీ నిర్మాణ సంస్థను స్థాపించింది. దాదాపు ఆరేళ్ల పాటు నిర్మాతగా బాధ్యతల్ని నిర్వర్తించింది. ప్రస్తుతం అనుష్కశర్మ ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో నటిస్తున్నది.