Politics

రెండుగా చీలిన తెలంగాణ కాంగ్రెస్

రెండుగా చీలిన తెలంగాణ కాంగ్రెస్

కలహాలు, విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు, హెచ్చరికలు ఇవన్నీ కలిస్తే కాంగ్రెస్ పార్టీ. ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ అంటేనే కలహాల పార్టీ అనే ముద్రపడిపోయింది. ఆ పార్టీలో సాధారణ కార్యకర్త కూడా అధినేతను కూడా విమర్శిస్తుంటారు. ఇదేం క్రమశిక్షణ అంటే మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామం ఎక్కువ అని ఆ పార్టీ నేతలు జవాబిస్తూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు నడుస్తోంది. టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి రేవంత్‌రెడ్డిని దింపాలని ఆ పార్టీలో కొందరు సీనియర్ నేతలు పట్టుబడుతున్నారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారి పార్టీ రెండుగా చీలే పరిస్థితి వచ్చింది. ఆదివారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ సీనియర్లు సమావేశమయ్యారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న నేతలందరూ భేటీ అయ్యారు. సీనియర్ల భేటీపై పలువురు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి హరీష్‌రావుతో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ రహస్య సమావేశం తర్వాతే.. సీనియర్ల భేటీలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు పార్టీలో చిచ్చు పెడుతున్నారని మండిపడుతున్నారు. పార్టీకి నష్టం చేసేవారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పార్టీ నాయకులతో టీఆర్ఎస్ నాయకులకు ఏం పని? అని ప్రశ్నిస్తున్నారు. వీహెచ్‌ను హరీష్‌రావు ఏందుకు కలిశారని నిలదీస్తున్నారు. కోకాపేటలో ఏం జరిగిందో తాము బయటపెట్టాలా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో సమస్యలుంటే కొట్లాడాలి కానీ.. శత్రువు దగ్గర మొకరిల్లితే ఎలా అని నిలదీస్తున్నారు. హరీష్‌రావును కలిసిన తర్వాతే వీహెచ్ సమావేశం పెట్టారని మండిపడుతున్నారు. కొత్త పీసీసీ వచ్చాక ప్రజల్లో కాంగ్రెస్ పట్ల విశ్వాసం పెరిగిందని కొందరు నేతలు రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిలుస్తారు. కాంగ్రెస్‌కు ప్రజాదరణ చూసి టీఆర్ఎస్‌కు భయం పట్టుకుందని, సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండడంతో టీఆర్ఎస్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.