నందమూరి హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఎన్టీఆర్ కారును ఆపి సోదాలు నిర్వహించారు. అంతేగాక అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలిం తెరను పోలీసులు తొలగించారు. కాగా వై కాటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా ఇతరులెవరూ వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ముత్తు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ వాహనాన్ని అడ్డుకుని అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను పోలీసులు తొలగించారు. అంతేకాదు ఎన్టీఆర్ కారుకు రూ. 700 జరిమాన కూడా వేసినట్లు తెలుస్తోంది. తనిఖీ సమయంలో కారులో డ్రైవర్‌తోపాటు.. ఎన్టీఆర్ తనయుడు.. మరో వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం.
శుక్రవారం జూబ్లీహిల్స్ కారు ప్రమాదం ఘటన నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ తన తాజా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో ఎన్టీఆర్ కోమరం భీంగా నటిస్తుండగా.. రామ్ చరణ్ సీతారామారాజుగా కనిపించనున్నాడు. తారక్ సరసన ఒలీవియా మోరిస్, చెర్రీకి జోడిగా ఆలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు.