ఊపిరి సలపని బిజీ షెడ్యూల్స్ వల్ల నిద్రకు నోచుకోలేకపోతున్నానని బాధపడిపోయింది ఢిల్లీ సొగసరి రాశీఖన్నా. ప్రస్తుతం ఈ భామ దక్షిణాదితో పాటు బాలీవుడ్ చిత్రసీమలో కూడా జోరుమీదుంది. భారీ అవకాశాల్ని సొంతం చేసుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నది. వరుస షూటింగ్స్ వల్ల నిద్ర పోవడానికి కూడా సరైన సమయం చిక్కడం లేదని రాశీఖన్నా కాస్త అసంతృప్తి వ్యక్తం చేసింది. తన పరిస్థితి గురించి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకుంది. ‘తమిళ చిత్రం ‘సర్దార్’ షూట్ నుంచి తిరిగొచ్చిన వెంటనే హిందీ సినిమా ‘యోధ’ సెట్స్‌లో జాయిన్ అయ్యాను. రాత్రికి రాత్రే చెన్నై నుంచి ఢిల్లీకి రావాల్సి వచ్చింది. కొంచెం కునుకు తీద్దామన్నా కుదరలేదు. కానీ ఈ కష్టాన్నంతా భరించక తప్పదు. సినీ తారల జీవితమే అలా ఉంటుంది. ఇంతటి కష్టంలో కూడా ఇష్టాన్ని వెతుక్కుంటున్నా’ అని చెప్పింది రాశీఖన్నా. ప్రస్తుతం ఈ భామ తెలుగులో గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్యతో కలిసి ‘థాంక్యూ’ చిత్రాల్లో నటిస్తున్నది.