మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ భార్య చెన్నమ్మకు ఆదాయం పన్ను శాఖ నోటీసులు ఇచ్చింది. ఆమె ఆస్తికి సంబంధించి ఐటీ శాఖ ఈ నోటీసులిచ్చింది. ఈ విషయాన్ని దేవెగౌడ-చెన్నమ్మ దంపతుల కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌డీ రేవన్న ధ్రువీకరించారు.
వారిని (ఐటీ) నోటీసులు ఇవ్వనీయండి. ఇప్పుడు మా అమ్మకు నోటీసులిచ్చారు. మా భూమిలో మేము చెరకు పండిస్తున్నాం. వాళ్లు వచ్చి చూడొచ్చు” అని హసన్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ రేవన్న చెప్పారు. ఐటీ నోటీసులు ఇచ్చింది ఒక మాజీ ప్రధాని సతీమణికి అని, ఆ విధంగా చేసి ఉండకూడదని మాత్రం తాను చెప్పనని అన్నారు.
*నాకు సమాచారం లేదు: కుమారస్వామి
కాగా, తన తల్లికి నోటీసు ఇచ్చినట్టు తనకు ఎలాంటి సమాచారం లేదని దేవెగౌడ మరో కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. ఒకవేళ నోటీసులిచ్చి ఉంటే ఆందోళన పడాల్సినదేమీ లేదని, తమ కుటుంబంలో ఏ పని జరిగినా అందరికీ తెలిసే జరుగుతుందని, దాపరికాలు ఉండవని బెంగళూరులో విలేఖరులతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. నోటీసులకు తగిన సమాధానం ఇస్తామని చెప్పారు. 60 ఏళ్ల రాజకీయ జీవితంలో దేవెగౌడ ఎప్పుడూ డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వలేదని, తాము కూడా అంతేనని తెలిపారు. కాగా, ఈ నోటీసులపై ఐటీ శాఖ ఇంకా స్పందించాల్సి ఉంది.