NRI-NRT

అంతర్జాతీయ విద్యార్థుల కోసం ఆస్ట్రేలియా నూతన వీసా పాలసీ విధానం

అంతర్జాతీయ విద్యార్థుల కోసం ఆస్ట్రేలియా నూతన వీసా పాలసీ విధానం

ఆస్ట్రేలియాలో విద్య, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆస్ట్రేలియన్ ప్రభుత్వ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్ కమిషనర్‌ డాక్టర్‌ మోనికా కెన్నడీ స్పష్టం చేశారు. గురువారం బేగంపేటలోని తాజ్‌ వివంత హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అంతర్జాతీయంగా విద్యార్థులు, గ్రాడ్యుయేట్ల కోసం ఆస్ట్రేలియన్ ప్రభుత్వం నూతన వీసా పాలసీ విధానం తీసుకొచ్చిందన్నారు. వీటిలో ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ వీసా ఫీ రిఫండ్‌, తాత్కాలిక గ్రాడ్యుయేట్‌ వీసాల పునరుద్ధరణతోపాటు ఆంగ్ల భాషల కోసం అదనపు సమయం, ఆరోగ్య పరీక్షలు, వర్క్‌ పీరియడ్స్‌ వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోందన్నారు. ఈ ఏడాది జనవరి 19 నుంచి మార్చి 19 వరకు వీసా దరఖాస్తుదారుల ఫీజు రీఫండ్‌కు అర్హులుగా పేర్కొన్నారు. అర్హత గల వీసా దారులు 2022 డిసెంబర్‌ 31 వరకు ఎప్పుడైనా క్లెయిమ్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. కొవిడ్‌ కారణంగా కోర్సు పూర్తి చేయలేని వీసాదారులు కూడా నూతన వీసా కోసం ధరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు.