Business

హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు తగ్గుముఖం

హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు తగ్గుముఖం

దేశవ్యాప్తంగా ఎనిమిది మెట్రోల్లో ఇళ్ల విక్రయాలు 2022 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) సగటున ఏడు శాతం పెరగ్గా.. హైదరాబాద్‌ మార్కెట్లో 15 శాతం క్షీణించాయి. ఈ మేరకు ప్రాప్‌ టైగర్‌ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్‌ సహా ఎనిమిది పట్టణాల్లో 2022 జనవరి–మార్చి కాలంలో 70,623 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2021 మొదటి మూడు నెలల్లో విక్రయాలు 66,176 యూనిట్లతో పోలిస్తే సుమారు 7 శాతం అధికం.

**హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు 15 శాతం తగ్గి 6,556 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో 7,721 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. ఇళ్ల ధరలు హైదరాబాద్‌లో 7 శాతం పెరిగాయి. బెంగళూరులో విక్రయాలు 3 శాతం అధికంగా 7,671 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో 7,431 యూనిట్లు అమ్ముడు పోవడం గమనార్హం. ముంబైలో ఇళ్ల అమ్మకాలు 26 శాతం పెరిగి 23,361 యూనిట్లుగా ఉన్నాయి. చెన్నై మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 26 శాతం తగ్గి 3,299 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ఇళ్లకు డిమాండ్‌ 19 శాతం తగ్గింది. 6,556 యూనిట్లు విక్రయమయ్యాయి. కోల్‌కతా మార్కెట్లోనూ అమ్మకాలు 15 శాతం క్షీణించి 2,860 యూనిట్లుగా ఉన్నాయి. పుణెలో 19 శాతం అధికంగా 16,314 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. అహ్మదాబాద్‌లోనూ ఇళ్ల అమ్మకాలు 18 శాతం పెరిగి 5,549 యూనిట్లుగా ఉన్నాయి. ఇళ్ల యూనిట్ల సరఫరా 50 శాతం పెరిగి జనవరి–మార్చి కాలంలో 79,532 యూనిట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కొత్త ఇళ్ల సరఫరా 53,037 యూనిట్లుగానే ఉండడం గమనార్హం. బిల్డింగ్‌ మెటీరియల్స్‌ ధరలు గణనీయంగా పెరిగిపోవడం ఇళ్ల ధరలు పెరిగేందుకు దారితీసింది. అత్యధికంగా చెన్నై మార్కెట్లో ఇళ్ల ధరలు సగటున 9 శాతం పెరిగాయి. పుణె, అహ్మదాబాద్‌లో ఇళ్ల ధరలు 8 శాతం పెరగ్గా.. బెంగళూరులో 6 శాతం, కోల్‌కతాలో 5 శాతం, ముంబై మెట్రో పాలిటన్‌ రీజియన్, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో 4 శాతం వరకు ధరల్లో పెరుగుదల కనిపించింది.

*హౌసింగ్‌.. ఆశాకిరణం
‘‘దేశ ఆర్థిక రంగంలో హౌసింగ్‌ రంగం ఆశాకిరణంగా మరోసారి అవతరించింది. కరోనా కారణంగా మందగించిన ఆర్థిక రంగానికి చేదోడుగా నిలిచింది. రానున్న నెలల్లో ఆర్థిక కార్యకలాపాలు మరింత సాధారణ స్థితికి వస్తే గొప్ప సానుకూల మార్పులను చూడొచ్చు. ఇళ్ల ధరలు కూడా జనవరి–మార్చి త్రైమాసికంలో పుంజుకున్నాయి. ఈ నివేదికలో భాగంగా పరిగణనలోకి తీసుకున్న అన్ని పట్టణాల్లోనూ ధరలు సగటున పెరిగాయి. ఇళ్ల నిర్మాణంలోకి వాడే ఉత్పత్తుల ధరలు పెరగడమే ఇందుకు ఎక్కువ నేపథ్యంగా ఉంది’’ అని ప్రాప్‌ టైగర్‌ పేర్కొంది.