NRI-NRT

TANA రంగస్థల దినోత్సవానికి విశేష స్పందన

TANA రంగస్థల దినోత్సవానికి విశేష స్పందన

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” (ప్రతి నెల ఆఖరి ఆదివారం) కార్యక్రమ పరంపరలో భాగంగా ప్రపంచ రంగస్థల దినోత్సవం (మార్చి 27) సందర్భంగా నిర్వహించిన 33 వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం “పద్యనాటక సాహితీ వైభవం – రంగస్థల కళాకారుల గానమాదుర్యం” చాలా రసవత్తరంగా సాగింది.
y2
తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి సదస్సును ప్రారంభిస్తూ మన తెలుగు భాష, సాహిత్యం, కళలను పరిరక్షిస్తూ, పరివ్యాప్తం చేయడానికి దశాబ్ధాల చరిత్ర గల్గిన తానా సంస్థ ఎల్లప్పుడూ కంకణబద్ధమై ఉన్నదంటూ ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమావేశంలో పాల్గొంటున్న కళాకారులందరుకూ హార్దిక స్వాగతం పలికారు. “ఒకప్పుడు ఎంతో వైభవంగా విరాజిల్లిన మన రంగస్థల వేదికలు మసకబారుతున్న వేళ తానా ప్రపంచ సాహిత్య వేదిక సారధ్యంలో అంతర్జాతీయ అంతర్జాల సమావేశం జరుపుకోవడం ముదావహం, యిది కళాకారులకు ఎంతో ప్రోత్సాహం కల్గిస్తుంది” అని తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ పేర్కొన్నారు.తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల క్రితమే ఆనాటి సామాజిక రుగ్మతలను, దురాచారాలను ఎండగడుతూ సామాజిక శ్రేయస్సును కాంక్షించి విలువైన సాహిత్యాన్ని సృష్టించిన రచయితలను గుర్తుచేసుకోవాల్సిన సమయం యిది అన్నారు.