Movies

మూడో ముచ్చట తీరలేదట.

మూడో ముచ్చట తీరలేదట.

బాలీవుడ్‌లో పాగా వేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది నాయిక రష్మిక మందన్న. ప్రస్తుతం రెండు హిందీ సినిమాల్లో నటిస్తున్న ఆమె తాజాగా ముచ్చటగా మూడో చిత్రాన్నీ ఖాతాలో వేసుకుందని వార్తలొచ్చాయి. రణబీర్‌ కపూర్‌ హీరోగా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా రూపొందించనున్న ‘యానిమల్‌’ సినిమాలో రష్మిక నాయికగా ఎంపికైందనే విషయం వైరల్‌ కాగా..ఈ భామ సన్నిహితులు ఆ వార్తల్ని తోసిపుచ్చారు. ‘యానిమల్‌’ సినిమాలో రష్మిక నటించడం లేదు అని తెలిపారు. ముందుగా ఈ సినిమాలో పరిణీతి చోప్రాను నాయికగా అనుకున్నారు. అమర్‌ సింగ్‌ చమ్కీలా జీవిత కథ ఆధారంగా దర్శకుడు ఇంతియాజ్‌ అలీ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పరిణీతి చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ సినిమాకు, ‘యానిమల్‌’ చిత్రానికీ తన డేట్స్‌ కుదరకపోవడంతో ‘యానిమల్‌’ చిత్రాన్ని వదులుకుంటున్నట్లు ఆమె తెలిపింది. ఈ అవకాశం రష్మికను వెతుక్కుంటూ వచ్చిందనేది సదరు వార్తల సారాంశం. ఈ వార్తలకు స్పందించిన రష్మిక సన్నిహితులు ఈ చిత్రంలో ఆమె నటించడం లేదని తెలిపారు. దీంతో కన్నడ భామ మూడో ముచ్చట తీరలేదని తెలుస్తున్నది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్‌లో ‘మిషన్‌ మంజు’, ‘గుడ్‌ బై’ చిత్రాల్లో నటిస్తున్నది. ‘పుష్ప’ సంచలన విజయం తర్వాత ఆమెకు హిందీ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు దక్కింది.