తన మాజీ భర్తకు భరణం చెల్లించాలని మహారాష్ట్రలోని నాందేడ్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను బాంబే హైకోర్టు సమర్ధించింది. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మహిళ తన మాజీ భర్తకు నెలవారీ భరణంగా 3వేలరూపాయలు చెల్లించాలని సివిల్ కోర్టు ఆదేశించింది. మహిళ పనిచేస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రతినెల ఆమె జీతం నుంచి 5వేల రూపాయలు మినహాయించాలని దాని పాత బకాయిల కింద కోర్టులో డిపాజిట్ చేయాలని కోర్టు కోరింది. 2015వ సంవత్సరంలో తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు భార్య కోర్టులో వాదించింది. విడాకుల తర్వాత భార్య భర్తకు ఎలాంటి భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని మహిళ తరపు న్యాయవాది వాదించారు.
వివాహం అనంతరం తన భార్యను చదివించి ఉపాధ్యాయురాలి ఉద్యోగం వచ్చేలా చేశానని, ఇప్పుడు తనకు ఎలాంటి ఆదాయ వనరులు లేవని, తాను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని భర్త చెప్పారు.హిందూ వివాహ చట్టంలోని 24, 25 సెక్షన్ల కింద నిరుపేద జీవిత భాగస్వామికి భరణం క్లెయిమ్ చేసుకునే హక్కును కల్పిస్తున్నాయని, దిగువ కోర్టు ఆదేశాలను సమర్థిస్తూ బాంబే హైకోర్టు జస్టిస్ డాంగ్రే ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు.