Devotional

శ్రీవారి ఆలయంలో మొదలైన ఆర్జితసేవలు

శ్రీవారి ఆలయంలో మొదలైన ఆర్జితసేవలు

దాదాపు రెండేళ్ల తర్వాత తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ఆర్జితసేవలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా 2020 మార్చి రెండవవారం నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జితసేవలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే కొవిడ్‌ పూర్తిగా తగ్గిన నేపథ్యంలో దర్శనాల సంఖ్యను పెంచిన టీటీడీ శుక్రవారం నుంచి ఆర్జితసేవలకు భక్తులను అనుమతించడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ ద్వారా వివిధ సేవలను బుక్‌ చేసుకున్న భక్తులు శుక్రవారం వేకువజామున సుప్రభాతం, తోమాల, అర్చన, అభిషేకం వంటి ఆర్జితసేవల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ ఆర్జితసేవల్లో పాల్గొన్న భక్తులందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా భక్తులు ఆర్జితసేవలకు దూరమయ్యారని తెలిపారు. ప్రస్తుతం స్వామి అనుగ్రహంతో తిరిగి ఆర్జితసేవలను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.