*పుల్లటి మజ్జిగతో పోషకాలు పుష్కలం.. మేలు చేసే బ్యాక్టీరియాతో అనేక లాభాలు ‘పెద్దల మాట.. సద్దన్నం మూట’.. ఈ మాట తాతల నాటిది. సద్దన్నం ప్రాధాన్యం ఎంత గొప్పదో సూచించేది. ‘సద్దన్నం తిన్నందుకే ఇంత సత్తువతోని ఉన్నం’ అని పెద్దలు చెప్తుంటారు. మారిన జీవన విధానం, పాశ్చాత్య సంస్కృతి ప్రవేశంతో పాతతరం ఆహారపు అలవాట్లు మారిపోయాయి. పూర్వం రాత్రి మిగిలిన అన్నాన్ని సద్ది అన్నంగా మార్చుకొని పొద్దుగాలనే తినేటోళ్లు. రాత్రివేళ ఎవరైనా అనుకోని అతిథి వస్తారేమోనన్న ముందుజాగ్రత్తతో అన్నం ఎక్కువగా వండేవారు. ఎవరూ రాకపోతే అది మిగిలి మరుసటి రోజు సద్ది అన్నంగా మారిపోయేది. ఈ రోజుల్లో అలా మిగులకుండా వండుకోవటం అలవాటుగా మారింది. కానీ కరోనా మహమ్మారి చాలామందిని మళ్లీ పాత అలవాట్లవైపు తిప్పింది. గ్రామాల్లో అక్కడక్కడ కనిపించే ఈ సద్దన్నం సంస్కృతి ఇప్పుడు నగరాలకు పాకింది. సద్దన్నంలో రోగనిరోధక శక్తి ఉంటుందని నిపుణులు సూచించడంతో ఇప్పుడు ఆన్‌లైన్ ఆర్డర్స్‌లో కూడా సద్దన్నం చేరిపోయింది. చాలా వరకు కొవిడ్ పేషెంట్లు సద్దన్నం తినడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఓ హోటల్ నిర్వాహకుడు రాజేంద్ర తెలిపారు. ఒకప్పుడు సద్ది అన్నాన్ని సింపుల్‌గా తీసుకున్నారు. రాత్రి మిగిలినదానిని పొద్దున తినడం నామోషీగా ఫీలయ్యారు. కానీ ఇప్పుడు సద్దన్నంలో గొప్ప పోషకాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో కీలకంగా పనిచేస్తుందని సూచిస్తున్నారు.
*ఇలా తయారు చేయాలి
రాత్రి మిగిల్చిన అన్నాన్ని ఒక మట్టి పాత్ర లేదా స్టీల్ గిన్నెలో వేయాలి. దాంట్లో అన్నం మునిగేంత వరకు నీళ్లు పోయాలి. ఆ తరువాత కొన్ని గోరువెచ్చని పాలు పోయాలి. తోడుగా పెరుగు జత చేయాలి. దాంట్లో నాలుగైదు పచ్చి మిరపకాయలు తరిగి వేయాలి. ఉల్లిగడ్డ ముక్కలు, కొంచం ఉప్పు వేసి కలియబెట్టాలి. ఆ తరువాత మూత బెట్టి వదిలేయాలి. అలా రాత్రంతా ఆ అన్నం పులిసిపోయి చద్దన్నంగా మారిపోతుంది. ఉదయం ఆ అన్నం తింటే శరీరానికి శక్తి లభిస్తుంది.
*చద్దన్నం.. ప్రయోజనాలు
రాత్రంతా అన్నం పులవడం వల్ల దానిలో చాలారకాల మార్పులు జరుగుతాయి.50 గ్రాముల అన్నాన్ని రాత్రి పులియబెడితే అందులో 1.6 మిల్లీగ్రాములుగా ఉన్న ఐరన్ 35 మిల్లీ గ్రాములకు పెరుగుతుంది. అలాగే పొటాషియం, కాల్షియంలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి. ఇవన్నీ మన శరీరాన్ని మరింత ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతాయని, రోగ నిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్న వారు చద్దన్నం తింటే ఆ వేడి తగ్గుతుంది. ఎక్కువ సమయం ఉల్లాసంగా గడపడానికి చద్దన్నం ఉపయోగపడుతుంది. పలు చర్మవ్యాధుల నుంచి సద్దన్నం కాపాడుతుంది.పేగుల్లో అనారోగ్య సమస్యలను సైతం తగ్గిస్తుంది. మలబద్దకం, నీరసం తగ్గిపోతాయి. బీపీ అదుపులో ఉంటుంది. కడుపులో మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది.ఆంగ్సైటీ తగ్గుతుంది. బీ12, బీ 6 విటమిన్లు, పీచు అధికంగా లభిస్తుంది. మజ్జిగలో ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి రక్షణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. మన శరీరంలో ఉండే హానికర వైరస్‌లను నాశనం చేస్తుంది.
**తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు
చద్దన్నం చిన్నప్పుడు తినేవాళ్లం. ఇప్పుడు మరిచిపోయాం. మళ్లీ అందరూ చద్దన్నం అంటున్నారు. కరోనాకు మంచి విరుగుడని చెప్తున్నారు. ముఖ్యంగా పులిసిన మజ్జిగలో మేలు చేసే బ్యాక్టీరియాలు ఉండటం వలన శరీరంలోని వ్యాధికారకాలను నయం చేస్తుంది. చద్దిఅన్నంలో కొంచం ఆవకాయ పచ్చడి వేసుకొని కూడా తినొచ్చు. చాలా తక్కువ ధరలో అత్యధిక పోషకాలు లభిస్తుండటం గొప్ప విషయం.