ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానంతరం తల్లీబిడ్డను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఇంటికి చేర్చే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 500 ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను ప్రారంభించింది. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వేదికగా శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కూనారిల్లిన 108, 104 సేవలకు ఊపిరిలూదినట్టుగానే.. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలనూ ప్రభుత్వం విస్తరించింది. అరకొరగా ఉన్న పాత వాహనాల స్థానంలో 500 కొత్త వాహనాలను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అక్కచెల్లెమ్మల కోసం అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తెచ్చాం. ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నాం. అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకే ఈ వాహనాలను ప్రారంభిస్తున్నాం. గతంలో వాహనాలు అరకొరగా ఉండేవి, వసతులు కూడా సరిగా ఉండేవి కావు. నాడు-నేడుతో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, శంకర నారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
*ఏటా సగటున 4 లక్షల మందికి ప్రయోజనం
రాష్ట్ర వ్యాప్తంగా 1,057 ప్రభుత్వాస్పత్రుల్లో ఏడాదికి సగటున నాలుగు లక్షల దాకా ప్రసవాలు జరుగుతుంటాయి. నెలలు నిండిన గర్భిణులను కాన్పుకు ఇంటి నుంచి 108 వాహనంలో తీసుకెళ్లి ఆస్పత్రిలో చేరుస్తున్నారు. నాణ్యమైన వైద్య సేవలు, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఆయా ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాల సంఖ్య ఆధారంగా డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను కేటాయించారు. తల్లులకు సాయం అందించేందుకు వీలుగా కేంద్రీకృత 102 కాల్ సెంటర్ సేవలనూ మెరుగుపరిచారు.