*కేంద్రం ఇచ్చిన సొమ్ముతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి సీఎం జగన్ సొంత డబ్బ కొట్టుకొంటున్నారని బీజేపీ ఆరోపించింది. ఆస్పత్రి వ్యవస్థల రూపురేఖలు మార్చివేసి సామాన్యులకు వైద్యం అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి డాంబికాలు పలికారు. గర్భిణిలు, బాలింతల కోసం వైఎస్సార్ తల్లీ బిడ్డా ఎక్స్ ప్రెస్ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. శుక్రవారం 5 వందల వాహనాలను సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు.తల్లీ బిడ్డా వాహనాలు శ్రీరామరక్షగా ఉంటాయని జగన్ అన్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించిన మేరకు ఆస్పత్రిలో గర్భిణిలు, బాలింతలకు మందులు అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లే సమయంలో సిజేరియన్ చేసుకున్న మహిళకు రూ. 2,500, సాధారణ ప్రసవం జరిగిన మహిళకు రూ. 5వేలు ఇస్తున్నామన్నారు.వాహనాల నిర్వహణ, మహిళలకు నగదు సహాయంలాంటివి కేంద్ర ప్రభుత్వ సహాయంతో జరుగుతున్నప్పుడు.. పేరు మార్చి వైఎస్సార్ తల్లీ బిడ్డా ఎక్స్ ప్రెస్ అంటూ జగన్ సొంత డబ్బ వాయించుకోవడం ఏంటని బీజేపీ ప్రశ్నిస్తోంది. ప్రధానమంత్రి మాతృవందన యోజన పేరుతో తల్లికి విశ్రాంతి సమయంలో కేంద్రం రూ. 5వేలు ఇస్తోంది. ఈ రూ. 5వేలకు జగన్ ప్రభుత్వం ఒక్క పైసా కూడా జోడించడంలేదు. సొమ్ము మొత్తం కేంద్రం ఇస్తుంటే.. జగన్ తన స్టిక్కర్లు వేసుకుంటున్నారని కమలం పార్టీ మండిపడుతోంది.
*అవసరమైతే నూకలు తింటాం.. కేంద్రాన్ని గద్దె దించుతాం : మంత్రి హరీశ్‌రావు
అడుగడుగునా తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను అవమానపరుస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నూకలు తినమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. బిడ్డ నూకలు తినమని చెప్తావా. అటుకులో, అన్నమో తిని తెలంగాణ సాధించుకున్నాం. అవసరమైతే నూకలు తింటాం.. మిమ్మల్ని గద్దె దించుతాం. ఇది మా రైతులు చేసి చూపిస్తారు. తెలంగాణ ఏదైనా సహిస్తది కానీ అవమానాన్ని సహించదు. సమైక్య పాలకులు మాట్లాడిన మాదిరిగానే ఇప్పుడు పీయూష్ గోయల్ మాట్లాడుతున్నారు. నాడు సమైక్య పాలకులు అవమానిస్తే.. నేడు పీయూష్ గోయల్ అవమానిస్తున్నారు. సమైక్యవాదులకు చరమగీతం పాడాం.. మీకు కూడా ఆరోజులు దగ్గర్లోనే ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
*ఓట్లేసిన జనాలను జగన్ పిచ్చోళ్లని చేశారు: బోండా ఉమా
ఓట్లేసిన జనాలను సీఎం జగన్ పిచ్చోళ్లని చేసి ఉగాది కానుకగా విద్యుత్ ఛార్జీలు పెంచారని టీడీపీ నేత బోండా ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ నగరంలోని టీడీపీ ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ… ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. బాదుడే బాదుడు అన్న జగన్.. నిజమైన బాదుడు ఎలా ఉంటుందో ఆచరించి చూపారన్నారు. గడపల ముందుకు వస్తున్న వైసీపీ నాయకులను చొక్కాలు పట్టుకుని నిలదీయాలని పిలుపునిచ్చారు. అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెంచారన్నారు. చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇది అంటూ ధ్వజమెత్తారు. పనులు లేక పస్తులుండే పరిస్థితి ఉంటే… మళ్లీ ఈ కొత్త బాదుడు అంటూ ఆగ్రహించారు. ఏప్రిల్ 1న జనాలను ఫూల్స్ చేసి రాక్షస ఆనందం పొందుతున్నారని… జగన్‌ను తరిమికొట్టేందుకు జనం ఎదురు చూస్తున్నారని బోండా ఉమా తెలిపారు
*గర్భానికి, గర్వానికి సీఎం జగన్‌కు తేడా తెలియదు: రఘురామ
ఏపీలో మద్యం షాపుల్లో క్యాష్ విధానం ఎందుకని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ వాలంటీర్లకు రూ.300 కోట్లతో సన్మానం ఎందుకని నిలదీశారు. తల్లీ బిడ్డా ఎక్స్‌ప్రెస్ పథకం గతంలో కూడా ఉండేదని, ఇప్పుడు దాని పేరు మార్చి వైఎస్సార్ తల్లీ, బిడ్డా ఎక్స్‌ప్రెస్ అని పెట్టారన్నారు. గర్భానికి, గర్వానికి తేడా తెలియకుండా సీఎం జగన్ మాట్లాడారని ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని రామాలయంలో క్రైస్తవ ప్రచారం చేయడం దారుణమన్నారు. విజయసాయిరెడ్డి, సీఎం జగన్ కోర్టుకు హాజరై.. కేసులు కొట్టేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని రఘురామ కృష్ణంరాజు అన్నారు
*పోలీసులు టీఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు
పోలీసులు టీఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారు.. తనపై భౌతిక దాడులకు యత్నించారని, అదనపు బందోబస్తు ఇవ్వాలని కోరినా.. పోలీసులు పట్టించుకోలేదన్నారు. బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు వేధిస్తున్నారని రఘునందన్‌రావు ఆరోపించారు.
*తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్’ పేరుతో సొంత డప్పు ఏంటి?: లంకా దినకర్
108 వాహనాలు, నిర్వహణ నేషనల్ హెల్త్ మిషన్ సహకారంతో అయినప్పుడు “వైయస్సార్ తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్” పేరుతో సొంత డప్పు ఏంటి అని బీజేపీ నేత లంకా దినకర్ ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… తల్లికి విశ్రాంతి సమయం ఖర్చుల కోసం చేతిలో పెట్టే రూ.5 వేలు మొత్తం కేంద్ర ప్రభుత్వం “ప్రధాన మంత్రి మాతృ వందన యోజన” నుండి ఇస్తున్నవే అని తెలిపారు. తల్లికి ఇచ్చే రూ.5వేలలో ఒక్క పైసా కూడా జగన్ ప్రభుత్వం భాగం లేదు, మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఏప్పుడులాగే జగన్ స్టిక్కర్ వేశారని మండిపడ్డారు. నేడు జగన్ ఫోటో స్టిక్కర్ వేసి ప్రారంభంచబోయే 500 ” వైయస్సార్ తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్” వాహనాల వ్యయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయని లంకా దినకర్ పేర్కొన్నారు
*ఆ తర్వాతే కేంద్ర ప్రణాళిక శాఖ కు కొత్త జిల్లాలు: విజయ్ కుమార్
ఏప్రిల్ 4న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త జిల్లాలను ప్రారంభించస్తారని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. 26 జిల్లాల ఏర్పాటుకి రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తాం. ప్రజల నుండి 17,500కి పైగా సూచనలు, అభ్యంతరాలు వచ్చాయి. మొత్తం 284 అంశాలపై ప్రజలు వినతులు వచ్చాయి. 90 శాతం అంశాలకు సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా పరిష్కరించారు.కొన్ని మండలాలను ప్రజల డిమాండ్ మేరకు జిల్లాలు మార్చాం. పూర్తి శాస్త్రీయంగా ప్రజల సౌకర్యార్థం పునర్విభజన చేశాం. ప్రతి జిల్లాలో కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. అదనంగా రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశాం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన సాధించేలా జిల్లాల పునర్విభజన జరిగింది. ఏప్రిల్ 4 తర్వాత కేంద్ర ప్రణాళిక శాఖకు కొత్త జిల్లాలను పంపుతామని ప్రణాళిక కార్యదర్శి విజయ్‌కుమార్ అన్నారు.
*డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలి: రమణారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్‌చార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ధర్నాకు పిలుపునిచ్చారు. ధర్నాకు రాకుండా నాయకులకు పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు
*విద్యుత్ చార్జీల పెంపు తగదు: సోము వీర్రాజు
సామాన్యులపై విద్యుత్ చార్జీల బాదుడు నిర్ణయాన్ని జగన్ సర్కార్ వెనక్కి తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ చార్జీలు సామాన్య వినియోగదారులకు ఎంత భారమో ప్రభుత్వం ఆలోచించకపోవడం అన్యాయమన్నారు. ఓవైపు చార్జీలు పెంచి, మరో వైపు అనధికార విద్యుత్ కోతలు విధించడం దుర్మార్గమని సోము మండిపడ్డారు.
*టీడీపీ ప్రజా పోరాటం: చినరాజప్పt
విద్యుత్ చార్జీల పెంపు పై ప్రజా పోరాటం చేస్తామని టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. టీడీపీ శ్రేణులు మండల/వార్డు స్థాయిలో విద్యుత్ చార్జీలపై ఆందోళనలు చేపట్టి ప్రభుత్వ దోపిడీని ప్రజలకు వివరిస్తారన్నారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు వల్ల ప్రజలపై రూ.9వేల కోట్ల అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కాగా, సీఎం జగన్‌రెడ్డి విద్యుత్ చార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలకు ఉగాది కానుక అందించారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. జగన్‌రెడ్డి తప్పుడు నిర్ణయాల కారణంగానే విద్యుత్ చార్జీలు పెరిగాయని, ఫలితంగా ప్రజలపై ఏటా రూ.1,400 కోట్ల భారం పడుతుందన్నారు. విద్యుత్ చార్జీల పెంపు ఆదేశాలను ఉపసంహరించుకోవాలని, లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళితే బాదుడే బాదుడని అన్నారు.
*రాజకీయాల నుంచి రిటైర్ కావడం లేదు: టీజీ
రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేస్తున్నప్పటికీ రాజకీయాల నుంచి రిటైర్ కావడం లేదని టీజీ వెంకటేశ్ అన్నారు. తాను చేపట్టే సామాజిక కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రవాణా శాఖ పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌గా బాగా పనిచేశారని వెంకయ్య నాయుడు ప్రశంసించారు.
*కాంగ్రెస్ వల్లే ఎంపీనయ్యాను: విజయసాయి
రాజ్యసభ సభ్యులుగా తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్న వారికోసం గురువారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సభ నుంచి నిష్క్రమించనున్న పలువురు నేతలు తమ మనోభావాలను పంచుకున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ‘‘కాంగ్రెస్ వల్లనే నేను ఎంపీని అయ్యాను. కాంగ్రెస్ పార్టీ నాపై కేసులు పెట్టకపోతే నేను రాజ్యసభకు వచ్చేవాడినే కాదు. చెన్నైలో సీఏగా ప్రాక్టిస్ చేస్తున్న నేను ఈ సభకు వస్తానని కలగనలేదు’’ అన్నారు.
*సోనియా వల్లే తెలంగాణ వచ్చింది: డీఎస్
ప్రత్యేక తెలంగాణ కావాలన్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వల్లే నెరవేరాయని టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. సోనియా గాంధీ జన్మదిన కానుకగా తెలంగాణను ప్రసాదించారని ఆయన చెప్పారు. రాజ్యసభలో తన పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా వీడ్కోలు సందేశంలో ఆయన పలు విషయాలు ప్రస్తావించారు. తాను రాజ్యసభ సభ్యుడిని కావడానికి సీఎం కేసీఆర్ కారణమని, ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. డీఎస్ తన ప్రసంగం సుదీర్ఘంగా కొనసాగిస్తుండగా.. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. సభలో ఇది తన తొలి ప్రసంగమని డీఎస్ చెప్పినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. ‘‘సభలో ఇది మీ చివరి ప్రసంగం..? ఇంకా మాట్లాడడానికి 33 మంది సభ్యులున్నారు’’ అని హరివంశ్ అన్నారు.
*వేలం ద్వారానే బొగ్గు గనుల కేటాయింపు: జోషి
ఓపెన్ టెండర్ల ద్వారానే తెలంగాణలోని బొగ్గు గనుల కేటాయింపు జరుగుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. నూతనంగా నెలకొల్పదల్చిన నాలుగు బొగ్గు బ్లాక్‌లకు సింగరేణి కూడా బిడ్ దాఖలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఎంపీ బండి సంజయ్ రాసిన లేఖకు కేంద్ర మంత్రి ఓ లేఖ ద్వారా సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ ద్వారా నూతన గనుల కేటాయింపులు చేస్తుందని వెల్లడించారు
*బీసీ బిల్లుకు మద్దతివ్వండి: ఆర్ కృష్ణయ్య
చట్టసభల్లో బీసీలకు 50ు రిజర్వేషన్లు కల్పించడానికి బీసీబిల్లును ప్రవేశపెట్టేలా కృషిచేయాలని మాజీ ప్రధాని దేవెగౌడకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. గురువారం బీసీ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణ, జబ్బల శ్రీనివా్‌సతో కలిసి మాజీ ప్రధానికి వినతిపత్రాన్ని అందించారు. కేంద్రం బీసీ బిల్లు పెడితే పూర్తి మద్దతిస్తామని దేవెగౌడ చెప్పారని కృష్ణయ్య తెలిపారు