Devotional

ఆరోగ్యదాయిని ‘ఉగాది’ పచ్చడి

ఆరోగ్యదాయిని ‘ఉగాది’ పచ్చడి

పాతకు వీడ్కోలు పలుకుతూ.. కొత్తకు స్వాగతం పలుకుతూ చేసుకునే తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఈ పండుగపూట పిండి వంటల కన్నా పచ్చడికే అధిక ప్రాధాన్యం ఉంటుంది. మనలో ప్రతిఒక్కరికీ ఆనందం, దుఃఖం, కోపం, శాంతం, ఆశ, నిరాశ వంటి భావనలు ఉంటాయి. ఆత్మభావనలకు ఉగాది పచ్చడిలోని రుచులతో పోలిక ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సమపాళ్లల్లో స్వీకరించాలనేదే ఉగాది పచ్చడి సారాంశం. అయితే ఉగాది పచ్చడి ఆరోగ్యదాయినిగా ఉపయోగపడుతుందని పురాణాలు చెబుతున్నాయి. వేపపువ్వు, బెల్లం, మామిడి, చింతపండు, ఉప్పు, కారంతో తయారుచేసే ఉగాదిపచ్చడి సేవనం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం.
చైత్రమాసంలో ప్రకృతిలో వసంతం వెల్లివిరిస్తుంది. చెట్లు చిగురిస్తాయి. పచ్చటి ఆకులు నేత్రపర్వం చేస్తుంటాయి. కుహుకుహు నాదాలతో కోయిలల సందడి వినసొంపుగా ఉంటుంది. నవవికాసం అంతటా ఆవిష్కృతం అవుతుంది. ఈ సందర్భంగా ఉగాది పండుగనాడు ప్రసాదంగా పంపిణీ చేసే పచ్చడికి ప్రాధాన్యం ఎంతో ఉంది. ఆరు రుచుల మిళితంగా తయారయ్యే ఉగాది పచ్చడి ఆరోగ్యపరంగానూ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పురాణేతిహాసాల్లో నింబ కుసుమ భక్షణం, అశోక కలికా ప్రాశనం అని వ్యవహరించే ఉగాది పచ్చడి ఎంతో ప్రత్యేకమైనది.
వేపపువ్వు :
ఉగాది పచ్చడిలో ప్రథమ ప్రాధాన్యం వేపపూతకే ఉంటుంది. చైత్రమాసంలో చెట్లు చిగుర్లు వేస్తాయి. ఈ సమయంలో చిగురించిన వేపపూతను ఉగాది పచ్చడిలో వినియోగించినందున కొంచెం చేదు, కొంచెం వగరు కలుస్తుంది. ఇందులో వ్యాధి నిరోధక శక్తి ఉంది. రుతువు మార్పు కారణంగా ఆటలమ్మ, అమ్మవారు వంటి వ్యాధుల నుంచి బాలలను రక్షించేందుకు వేపపూత ఉపయోగపడుతుంది. వేపపూత రక్తాన్ని శుద్ధిచేస్తుంది. పచ్చడి ద్వారా నేరుగా వేపపూత తీసుకుంటే రక్తశుద్ధి జరుగుతుంది. వాయుకాలుష్యం ద్వారా వచ్చే వ్యాధులను వేపపూత అరికడుతుంది
బెల్లం :
పచ్చడికి తియ్యదనాన్ని అందించే బెల్లం అక్కడికే పరిమితం కాదు. బెల్లంలో ఇనుపధాతువు ఉంటుంది. మానవ శరీరానికి అవసరమైన ఇనుము బెల్లం ద్వారా లభిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శరీరంలోని విషపదార్థాలను సమర్థంగా వెలుపలకు పంపుతుంది.
మామిడి :
చైత్రమాసం ప్రారంభంలో వచ్చే మామిడి కాయల్లో పులుపు తక్కువగా ఉంటుంది. కొద్దిగా వగరు ఉంటుంది. దీంతో మామిడి ముక్కలు ఉగాది పచ్చడికి మంచి రుచిని కలిగిస్తాయి. మామిడిలోని విటమిన్‌-సి కారణంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మవ్యాధులు రాకుండా అడ్డుపడుతుంది. చర్మం నిగారింపులో ఉపయోగపడుతుంది. పేగుల్లో ఇన్ఫెక్షన్‌ లేకుండా మామిడి ముక్క శుభ్రం చేస్తుంది. డీహైడ్రేషన్‌ రాకుండా కాపాడే శక్తి మామిడికి ఉంది. ఉగాది పచ్చడిలో మామిడికాయలను తురిమి వేయకుండా ముక్కలుగా వేస్తేనే ప్రయోజనకరంగా ఉంటుంది.
చింతపండు :
మానసిక చింతలను, చాంచల్యాలను దూరంచేసే గుణం చింతపండులో ఉంది. మామిడి ముక్కలతో కలసిన చింతపండు జీర్ణశక్తిని పెంచడంతోపాటు, రోజువారి ఎదురయ్యే ఒత్తిళ్లను దూరం చేస్తుంది.
ఉప్పు :
ఉగాది పచ్చడిలో ఉప్పు పాత్ర ఎంతో ఉంది. చిటికెడు ఉప్పుతో ఈ పచ్చడి రుచికరంగా మారుతుంది. ఇదే సమయంలో ఎండలకు చెమట రూపంలో వెళ్లే సోడియంను భర్తీ చేస్తుంది.
మమ‘కారం’ : ఉగాది పచ్చడిలో వినియోగించే కారంతో రుచులు సమపాళ్లవుతాయి. కారంలో వ్యాధినిరోధక శక్తి ఉంటుంది. తగు మోతాదులో వినియోగిస్తే ఇన్ఫెక్షన్లు తొలగుతాయి.