Devotional

భద్రాచలంలో ప్రసాదాల రేట్లు పెంపు – TNI ఆధ్యాత్మికం

భద్రాచలంలో ప్రసాదాల రేట్లు పెంపు – TNI ఆధ్యాత్మికం

1. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో వివిధ ప్రసాదాల రేట్లను పెంచుతూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నుంచి పెరిగిన రేట్లను దేవస్థాన అధికారులు అమలు చేయనున్నారు.
పెరిగిన రేట్లు…100 గ్రాముల చిన్న లడ్డు రూ.20 నుంచి రూ.25500 గ్రాముల మహాలడ్డు రూ.100 ల నుంచి 400 గ్రాములకు కుదించి రూ.100200 గ్రాముల పులిహోర ప్యాకెట్ రూ.10 నుంచి రూ.15100 గ్రాముల చక్కెర పొంగలి రూ.10 నుంచి రూ.15లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

2. ఢిల్లీ రాజ్‌భవన్‌కు చినవెంకన్న లడ్డూ
ఉగాది పర్వదినం సందర్భంగా ద్వారకాతిరుమల చినవెంకన్న లడ్డూ ప్రసాదాన్ని ఢిల్లీ రాజ్‌భవన్‌కు చేరేలా దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పండుగ వేడుకలలో పాల్గొనే వారికి ఇచ్చేందుకు గాను దాదాపు 3000 లడ్డూలను సిబ్బంది సిద్ధం చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాధరావు తెలిపారు.

3. యాదాద్రి ఆలయ తిరువీధుల్లో రెడ్‌ కార్పెట్‌
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకునే భక్తులు నడిచేందుకు ఆలయ తిరువీధులతో పాటు శివాలయం వరకు రెడ్‌ కార్పెట్‌ ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలోని తిరువీధుల్లో మ్యాట్‌, కార్పెట్‌ లేకపోవడంతో ఎండలకు బండలు వేడెక్కి, భక్తులు పాదరక్షలు లేకుండా నడవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ తిరువీధులతో పాటు శివాలయం వరకు రెడ్‌ కార్పెట్‌ ఏర్పాటు చేశారు. దీంతో భక్తులకు ఎండ నుంచి ఉపశమనం కలిగింది.

4. తిరుమల తరహాలో బ్రేక్‌ దర్శనాలు
తిరుమల తరహాలో యాదాద్రిలోనూ బ్రేక్‌ దర్శనానికి శ్రీకారం చుట్టారు. ఆలయ పునర్నిర్మాణం కాకముందు బాలాలయంలో భక్తుల కోసం బ్రేక్‌ దర్శనాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయలేదు. తిరుమల తరహాలో ఇకపై యాదాద్రిలోనూ భక్తులకు బ్రేక్‌ దర్శనాలకు అవకాశం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటలకు ఆలయ అధికారులు బ్రేక్‌ దర్శనాన్ని ఏర్పాటు చేశారు. అలాగే లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిత్య కైంకర్యాల వేళల్లో మార్పులు చేశారు. స్వామివారి నిజాభిషేకం, సహస్రనామ కైంకర్యాల్లో పాల్గొనే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసి అభిషేకంలో పాల్గొనేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. వారి సౌకర్యార్థం ఏప్రిల్‌ 1 నుంచి స్వామివారి నిత్య కైంకర్యాల వేళల్లో మార్పులు చేశామని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. ఇక స్వామివారి నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, స్వామివారి మొక్కుజోడు సేవలను త్వరలో ప్రధానాలయంలో ప్రారంభించనున్నారు. కాగా శుక్రవారం నుంచి కొండ కింది నుంచి కొండపైకి భక్తులను ఉచితంగా చేరవేసేందుకు అధికారులు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. తరలింపు వ్యయం మొత్తాన్ని దేవస్థానం భరిస్తుంది. అలాగే భక్తుల ద్విచక్ర వాహనాలు, కార్లు, ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలను శుక్రవారం నుంచి కొండపైకి అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. విమాన గోపురం బంగారు తాపడానికి 18.71 కోట్ల విరాళాలుయాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమానగోపురం బంగారు తాపడం కోసం ఈ నెల 17 నుంచి 30 వరకు వివిధ రూపాల్లో రూ.18.71 కోట్ల విరాళాలు సమకూరాయి. ఈ సొమ్మును బంగారు తాపడం అకౌంట్లలో జమచేశామని ఈవో గీతారెడ్డి తెలిపారు. కాగా లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గురువారం భక్తుల పూజల సందడి నెలకొంది. వివిధ విభాగాల ద్వారా రూ.13,26,958 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.

5. రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం
రికార్డు స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ ఆదాయం లభించింది. మార్చి మాసంలో హుండీ ద్వారా శ్రీవారికి రూ.128.61 కోట్ల ఆదాయం వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. మార్చి నెలలో 19.70 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 9.48 లక్షల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు

6. Srisailamలో మూడో రోజు ఉగాది మహోత్సవాలు
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉగాది మహోత్సవాలు మూడవ రోజుకు చేరుకున్నాయి. మహాసరస్వతి అలంకార రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం స్వామి, అమ్మవార్లకు ప్రభోత్సవం, నందివాహన సేవ నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటలకు శివదీక్ష శిభిరాలలో శరీరాలపై శూలాలతో గుచ్చుకుంటూ కన్నడిగుల వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం జరుగునుంది. స్వామిఅమ్మవార్ల దర్శనం కోసం భక్తులు ఆలయానికి పోటెత్తారు

7. యాదాద్రి శ్రీ ల‌క్ష్మీ నార‌సింహ స్వామిని ద‌ర్శించుకున్న ఎమ్మెల్యే రోజా
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన న‌గ‌రి ఎమ్మెల్యే రోజా ఇవాళ యాదాద్రి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా యాదాద్రి శ్రీ ల‌క్ష్మీ నార‌సింహ స్వామి వారిని రోజా ద‌ర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే రోజాను ఆల‌య అర్చ‌కులు ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. రోజా వెంట టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుర‌భి వాణిదేవీ, యాదాద్రి జ‌డ్పీ చైర్మ‌న్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ఉన్నారు.