అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు ఎప్పడూ ఏదో ఒక కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూనే ఉంది. అందులో భాగంగానే అఫ్గనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్‌ని అమలు చేసింది. దీని ప్రకారం పురుష ప్రభుత్వ ఉద్యోగులు గడ్డం లేకుండా కార్యాలయానికి రాకూడదని తెలిపింది. పాశ్చాత్య సూట్లు ధరించకూడదని, తమ తలలను కప్పుకోవడానికి టోపీ లేదా తలపాగాతో పాటు సంప్రదాయ పొడవాటి టాప్స్ , ప్యాంటులు ధరించాలి అని పేర్కొంది.ఈ కోడ్‌ను ఉల్లంఘిస్తే, ఉద్యోగులు తమ కార్యాలయాల్లోకి ప్రవేశించడానికి అనుమతించకపోవడమే కాకుండా చివరికి విధుల నుంచి తొలగించే అవకాశం కూడా ఉందని తాలిబాన్ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మంగళవారం నుంచే కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. పైగా గతవారం నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉండగా బాలికలు పాఠశాలలకు హాజరుకాకుండా నిషేధించింది. దీంతో యూఎన్ ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ఈ విషయమై తాలిబన్లకు విద్యాహక్కును గౌరవించమని నొక్కి చెప్పింది. ఆఖరికి పురుషులు, కుటుంబ సభ్యులు లేకుండా మహిళలు ఒంటరిగా ప్రయాణించడాన్ని నిషేధించింది కూడా.