* బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న రెండోవిడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభానికి ఈ నెల 14న గద్వాలకు అమిత్ షా రావాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమంలో జరిగిన మార్పుల కారణంగా 15న అమిత్ షా గద్వాల(జంబులాంబ దేవాలయం సమీపం) బహిరంగసభలో పాల్గొనడం ద్వారా ఈ పాదయాత్రను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.14న దేశవ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని నిర్వహిస్తున్న నేపథ్యంలో అమిత్‌షా కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున ఈ మేరకు మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి గద్వాలకు రోడ్డు మార్గాన వెళ్లేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నందున, కర్నూలు నుంచి గద్వాలకు రోడ్డుమార్గం గుండా చేరుకునేలా కార్యక్రమంలో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 14న ముందుగా నిర్ణయించిన విధంగా జోగుళాంబ ఆలయంలో బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర కోసం పూజలు నిర్వహించి, ఆ రోజు రాత్రి అక్కడే బస చేయనున్నట్టు తెలుస్తోంది
*రష్యా చౌక చమురును ఎందుకు కొనకూడదు? : నిర్మల సీతారామన్
దేశ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తామని, రష్యా చౌక చమురును కొనడాన్ని కొనసాగిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. దేశంలో ఇంధన భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. రాయితీ ధరకు చమురు దొరికినపుడు ఎందుకు కొనకూడదని ప్రశ్నించారు. CNBC-TV18 ఇండియా బిజినెస్ లీడర్ పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడాన్ని ప్రారంభించామని చెప్పారు. కొన్ని బ్యారెల్స్ చమురు వచ్చిందని, ఇది మూడు, నాలుగు రోజులకు సరిపోతుందని చెప్పారు. ఈ విధంగా కొనడాన్ని కొనసాగిస్తామని చెప్పారు. భారత దేశ సర్వతోముఖ ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుంటామని చెప్పారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో రష్యా నుంచి చమురును భారత దేశం కొనడం అమెరికా, బ్రిటన్‌లకు ఇష్టపడటం లేదన్న సంగతి తెలిసిందే. అయితే భారత్-రష్యా మధ్య దీర్ఘకాలిక సత్సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలను మరింత పటిష్టపరచుకోవడం కోసం రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించాలని భారత్ నిర్ణయించింది. విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కూడా మన దేశ వైఖరిని సమర్థించుకున్నారు. రష్యా నుంచి భారత దేశం కొంటున్నది కేవలం 1 శాతం చమురు మాత్రమేనని, రష్యా నుంచి యూరోపు దేశాలే ఎక్కువ చమురును కొంటున్నాయని తెలిపారు. చమురు ధరలు పెరిగినపుడు, మార్కెట్లోకి వెళ్ళి, ప్రజలకు మేలు కలిగించే లావాదేవీల కోసం అన్వేషించడం సహజమేనని తెలిపారు. భారత్‌కు భారీ డిస్కౌంట్ ఇచ్చి చమురును అమ్మేందుకు రష్యా సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
*న్యాయవ్యవస్థపై జగన్ వ్యతిరేకత పెంచుకున్నారు: వర్ల రామయ్య
న్యాయవ్యవస్థపై సీఎం జగన్ వ్యతిరేకత పెంచుకున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య తప్పుబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ రాచరికపు పోకడల వల్లే 8 మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష పడిందని తెలిపారు.న్యాయవ్యవస్థ దయతో జైలుశిక్ష తప్పించుకుని సేవాశిక్షతో బయటపడ్డారని పేర్కొన్నారు. జగన్‌కు నైతిక విలువ ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ అత్యంత బలహీనమైన ముఖ్యమంత్రి అని ఎద్దేవాచేశారు. అందుకే తప్పుచేసిన మంత్రులపై చర్యలు తీసుకోవట్లేదని వర్ల రామయ్య విమర్శించా,
*ఎవరో చేసిన తప్పులకు ఐఏఎస్‌లు ఎందుకు జైలుకెళ్లాలి?- వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు
రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ అధికారులకు హైకోర్టు శిక్ష విధించడంతో ఐఏఎ్‌సలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిందని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఎవరో చేసిన తప్పులకు ఐఏఎ్‌సలు ఎందుకు జైలుకు వెళ్లాలని ప్రశ్నించారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగం గురించి, దానినెలా గౌరవించాలో మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ చెప్పాలని సూచించారు. గత సార్వత్రిక ఎన్నికలు 2019 ఏప్రిల్లో జరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ఏప్రిల్ ఫూల్స్ అయ్యారని చాలా మంది అంటున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా, ఉచిత ఇసుక, మద్యపానం నిషేదం వంటి హామీలతో తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. మద్యాన్ని నిషేధించకుండా కొత్త బ్రాండ్లు ప్రవేశపెట్టారని విమర్శించారు. మంచి మద్యాన్ని తయారు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని రామాలయంలో అన్యమత ప్రచారం దారుణమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈ మధ్య జోకులు ఎక్కువయ్యాయన్నారు. ‘కాంగ్రెస్ వల్లే ఎంపీని అయ్యానని విజయసాయిరెడ్డి రాజ్యసభలో వ్యంగ్యంగా అన్నారు. ఆయన, జగన్ కోర్టుకు హాజరై కేసులు కొట్టేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కోర్టుకు రానని 11ఏళ్లుగా ఉండడం ఏంటి? అందరూ అనే మాటలు పడాల్సిన అవసరమేముంది? అందుకే మీరు నీటుగా బయటకు రావాలని బెయిల్ రద్దు పిటిషన్ వేశాను’ అని రఘురామ వ్యాఖ్యానించారు
*ఏనాడూ కక్షలు.. కార్పన్యాలతో ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టలేదు: తుమ్మల
అక్రమ కేసులో ఇటీవల జైలుకు వెళ్లొచ్చిన మాజీ కార్పొరేటర్ జంగం భాస్కర్‌ను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. చిల్లర వ్యక్తుల రాజకీయాలను పట్టించుకోవద్దన్నారు. తన నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ కక్షలు.. కార్పన్యాలతో ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టలేదన్నారు. పాలేరులో సొంత పార్టీ నేతలనే ఇబ్బంది పెడుతున్న వారి సంగతి పార్టీ పెద్దలే చూస్తారని తుమ్మల పేర్కొన్నారు. అభివృద్ధి కోసం రాజకీయాలు చేయాలి తప్ప అధికార దుర్వినియోగం కోసం కాదన్నారు. కొందరు కుహనా నేతల కవ్వింపులను పట్టించుకొవద్దని కార్యకర్తలకు సూచించారు. తనను నమ్ముకున్న కార్యకర్తలు, నేతలకు తాను ఎల్లపుడూ అండగా ఉంటానని తుమ్మల హామీ ఇచ్చారు
*కేసీఆర్ నీ మెడ మీద ఏకే 47 పెడితే నీ ఫామ్ హౌజ్ రాసిస్తావా?: రేవంత్
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ వైఖరితో ప్రజల్లో ఉగాది పండగ ఉత్సాహం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘కేసీఆర్ నీ మెడ మీద ఏకే 47 పెడితే నీ ఫామ్ హౌజ్ రాసిస్తావా? సీఎం కుర్చీ ఇస్తావా?’ అంటూ రైతుల విషయమై సీఎంపై మండిపడ్డారు. నేడు గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రజలను ఏదో రకంగా దోచుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. యూపీఏ హయాంలో గ్యాస్ 414, డీజిల్ 55, పెట్రోల్ 71 రూపాయలు మాత్రమే ఉండేవన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పడి పోయాయని.. అయినప్పటికీ ధరలు పెరిగాయన్నారు. ఇంకా రేవంత్ మాట్లాడుతూ.. ‘‘కేంద్రం పన్నుల రూపంలో రూ.10లక్షల కోట్లు దోచుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ మీద పన్నుతో రూ.36 లక్షల కోట్లు ప్రజల నుంచి వసూలు చేశాయి. లీటర్ పెట్రోల్‌పై కేంద్రం 30, రాష్ట్రం 35 రూపాయలు టాక్స్ వసూలు చేస్తున్నాయి. చత్తీస్‌ఘడ్‌లో రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించింది.ధరల పెంపులో కేంద్రం, రాష్ట్రం ప్రభుత్వాలు రెండూ దోషులే. దోపిడీలో రెండూ ఒక్కటే. విద్యుత్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 17వేల కోట్లు బకాయి పడింది. దాని వల్ల విద్యుత్ సంస్థలు దివాలా తీసి కుప్ప కూలుతున్నాయి. ప్రభుత్వం బకాయిలు తీర్చడానికి ప్రజల మీద విద్యుత్ చార్జీల భారం వేస్తోంది. వ్యవసాయానికి ఉచితం ఇచ్చి ఇంటి బిల్లు డబుల్ వసూల్ చేస్తున్నాడు. రైతులను వరి పంట వైపు మార్చి ఇప్పుడు వరి కొనం అంటున్నారు. పారా బాయిల్డ్ రైస్ సరఫరా చేయబోమని కేంద్రానికి లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. దీంతో తెలంగాణ రైతులకు మరణ శాసనం రాశారు. రైతుల హక్కులను కేంద్రానికి తాకట్టు పెట్టే అధికారం ఎవరిచ్చారు? కేసీఆర్ నీ మెడ మీద ఏకే 47 పెడితే నీ ఫామ్ హౌజ్ రాసిస్తావా? సీఎం కుర్చీ ఇస్తావా? సంతకాలు చేసిన మిమ్మల్ని ఉరి తీయాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని రైతులు రాళ్లతో కొట్టి చంపాలి’’ అని రేవంత్ ఫైర్ అయ్యారు
*జగన్ చెప్పిందేమిటి.. చేసిందేమిటి: budda venkanna
ముఖ్యమంత్రి జగన్ చెప్పిందేమిటి.. చేసిందేమిటి అని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుని నిరసిస్తూ శనివారం టీడీపీ వినూత్న నిరసన చేపట్టింది. నమ్మి ఓట్లేసిన ప్రజలకు జగన్ చెవిలో పూలు పెట్టాడంటూ.. చెవిలో పూలు పెట్టుకుని బుద్దా వెంకన్న, నాగుల్ మీరా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ…ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసి చెవిలో పూలు పెట్టారని విమర్శించారు. మద్యం నియంత్రణ అన్న జగన్.. చీప్ లిక్కర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారన్నారు. 151 సీట్లు తెచ్చుకుని కూడా జగన్ భయంతో పాలన సాగిస్తున్నారని అన్నారు. అందుకే తాము చెవిలో పువ్వు జగన్ అని పిలుస్తున్నామని తెలిపారు. విద్యుత్ ఛార్జీల భారాలను మోపి సిగ్గులేకుండా సమర్ధించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీలు ఆపాలని చెబుతున్న జగన్.. ముందు నీ ప్యాలెస్‌లో ఏసీలు బంద్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘నీ దెబ్బకు ఎలాగూ ఫ్యాన్లు కూడా వేసుకునే పరిస్థితి లేదు. ముందు మీరు త్యాగాలు చేసి… అప్పుడు ప్రజలకు సూచనలు చేయండి. మీరు, మీ మంత్రులు మాత్రం ఎసీ గదుల్లో కూర్చుంటారా. ప్రజలు ఏసీలు లేకుండా ఉక్కపోతతో అల్లాడాలా. కరెంటు ఆదా చేయమని చెబుతారు కానీ.. ఏసీలు వాడొద్దన్న సీఎంను నిన్నే చూస్తున్నాం’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు అందరికీ సీఎం జగన్ చెవిలో పువ్వు పెట్టారని అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును రద్దు చేసే వరకూ టీడీపీ పోరాటం చేస్తుందని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు
*ఏడు సార్లు కరెంటు చార్జీలు పెంచిన చరిత్ర జగన్ రెడ్డి ది: నాగుల్ మీరా
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు చెవిలో పూలు పెట్టే కార్యక్రమం మొదలు పెట్టారని టీడీపీ నేత నాగుల్ మీరా అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా టీడీపీ చేపటిన నిరసనలో నాగుల్ మీరా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడు సార్లు కరెంటు చార్జీలు పెంచిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ది అని వ్యాఖ్యానించారు. ఒక సామాన్యుడు ఇంట్లో ఫ్యాను వేసుకోవడానికి కూడా భయపడుతున్నారన్నారు. కరెంటు చార్జీల పెంపుతో బాదుడు కార్యక్రమం మొదలు పెట్టారని మండిపడ్డారు. మద్యనిషేధం అన్నారు 20 వేల కోట్ల రూపాయలు ప్రజల వద్ద నుండి దోచుకుంటున్నారని ఆరోపించారు. టిడ్కో ఇల్లు ఉచితంగా ఇస్తామని, ఇప్పుటి వరకూ ఇవ్వలేదన్నారు. ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షం గొంతు నొక్కే కార్యక్రమం చేయడం అత్యంత హేయమైన చర్య అని నాగుల్ మీరా ఆగ్రహం వ్యక్తం చేశారు
*ప్రజలు తలపెట్టిన కార్యాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగాలి: లోకేష్తె
లుగు ప్రజలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ శ్రీశుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ప్రజలు తలపెట్టిన కార్యాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగాలని ఆకాంక్షించారు. అచ్చ తెలుగు పండగని ఇంటిల్లిపాదీ ఆనందంతో జరుపుకోవాలని లోకేష్ తెలిపారు.
*త్వరలో కర్నూలులో న్యాయ రాజధాని: మంత్రి బుగ్గన
త్వరలో కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అన్ని అనుమతులతో న్యాయ రాజధాని నిర్మాణం జరుగుతుందని ఆయన తెలిపారు. వైసీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూ ప్రజలకు సుభిక్షమైన పాలన అందిస్తున్నామన్నారు. మూడు నెలల్లో గుంతలమయంగా ఉన్న రోడ్లన్నీ బాగుచేస్తామని ఆయన పేర్కొన్నారు. కర్నూలులో రూ.100 కోట్లతో జగన్నాధ గట్టుపై సిల్వర్ జూబ్లీ కాలేజ్ నిర్మాణ చేపడుతామని ఆయన తెలిపారు.
*రాష్ట్రంలో యథా లీడర్ తథా కేడర్: ఆచంట సునీత
ఓ టీవీ చర్చలో కావలి గ్రీష్మ అనే మహిళపై వైసీపీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి విచక్షణా రహితంగా మాట్లాడారని టీడీపీ అంగన్‌వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ఆరోపించారు. నారాయణమూర్తి మాటలతో యధా లీడర్ తథా కేడర్ అని నిరూపితమైందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలను ప్రశ్నిస్తే ”మీపై అత్యాచారం జరగలేదు కదా” అంటారా? అని ఆమె ప్రశ్నించారు. ప్రశ్నించినప్పుడు చేతనైతే సమాధానం చెప్పాలి గానీ దుర్మార్గపు మాటలు మాట్లాడకూడదన్నారు. వైసీపీ పార్టీ కామాంధుల పార్టీ అని ఆమె అభివర్ణించారు. సంయమనం కోల్పోయి మట్లాడే పశువులకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. గ్రీష్మపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. 48 గంటల్లో న్యాయం జరగకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు.
*జగన్ పరిపాలన చూస్తుంటే ప్రజలకు భయమేస్తోంది: నాదెండ్ల
జగన్ పరిపాలనలో ఎప్పుడు ఏ చార్జీలు పెంచుతారోనని ప్రజలు భయపడుతున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రంగా విమర్శించారు. పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా శుక్రవారం కాకినాడలో జనసేన ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ఈ రోజు ఫ్యాన్ ఆన్ చేసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ‘‘మీ తండ్రి హయాంలో ఎప్పుడూ విద్యుత్ చార్జీలు పెంచలేదని, ఆయన్ని చూసే మీకు ఓటేశారన్న సంగతి మరిచిపోయి.. అవగాహన లేని పాలన చేస్తున్నారు’’ అని మనోహర్ విమర్శించారు.
*గర్భానికి, గర్వానికి సీఎం జగన్‌కు తేడా తెలియదు: రఘురామ
ఏపీలో మద్యం షాపుల్లో క్యాష్ విధానం ఎందుకని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ వాలంటీర్లకు రూ.300 కోట్లతో సన్మానం ఎందుకని నిలదీశారు. తల్లీ బిడ్డా ఎక్స్‌ప్రెస్ పథకం గతంలో కూడా ఉండేదని, ఇప్పుడు దాని పేరు మార్చి వైఎస్సార్ తల్లీ, బిడ్డా ఎక్స్‌ప్రెస్ అని పెట్టారన్నారు. గర్భానికి, గర్వానికి తేడా తెలియకుండా సీఎం జగన్ మాట్లాడారని ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని రామాలయంలో క్రైస్తవ ప్రచారం చేయడం దారుణమన్నారు. విజయసాయిరెడ్డి, సీఎం జగన్ కోర్టుకు హాజరై.. కేసులు కొట్టేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
*ఈ ఏడాదిని ఉద్యమ నామ సంవత్సరంగా పరిగణించాలి: Ramakrishna
తెలుగు ప్రజలందరికీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ శుభకృత్ నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది అంటే తీపి, చేదుల కలయిక అని… కానీ ప్రభుత్వాలు ప్రజలకు చేదునే మిగిల్చాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెనుభారాలు మోపిన నేపథ్యంలో ఈ ఏడాదిని ఉద్యమ నామ సంవత్సరంగా పరిగణించాల్సి ఉందని తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల అధిక ధరలు, విద్యుత్ ఛార్జీలు, ఆస్తి, చెత్త పన్నుల పెంపు వంటి భారాలు ప్రజలకు గుదిబండగా మారాయని రామకృష్ణ వ్యాఖ్యానించారు.