కరోనా కారణంగా గత రెండేళ్లుగా శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. పైగా ఇప్పుడు చైత్ర, వైశాఖ మాసాల్లో ముహూర్తాలు కూడా బాగున్నాయి. శ్రీరామనవమి తర్వాత నుంచి వచ్చే నెల 25 వరకు బలమైన ముహూర్తాలు ఉండటంతో అందరూ తమ ఇంట వివాహాలను ఘనంగా జరిపించాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో ఏప్రిల్, మేలలో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 90 వేల వివాహ వేడుకలు జరగనున్నాయని తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే సుమారు 35 వేల పెళ్లిళ్ల వరకు జరగనున్నట్లు పురోహితులు, ఫంక్షన్ హాళ్ల ప్రతినిధులు వివరిస్తున్నారు.
మరోవైపు ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తుండటంతో ఇప్పటి నుంచే వాటిని బుక్ చేసుకునేందుకు బారులు తీరుతున్నారు. నగరంలోని కొన్ని ఫంక్షన్ హాళ్ల ప్రతినిధులు ఉదయం పెళ్లి, సాయంత్రం రిసెప్షన్‌కు బుకింగ్ తీసుకుంటున్నారు.
అటు గ్రామీణ ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లకు ఏప్రిల్‌కు సంబంధించిన బుకింగ్‌లు మార్చి రెండో వారంలోనే పూర్తయ్యాయి. అంతేకాకుండా నగరంలోని పలు హోటళల్లో గదులు కూడా బుకింగ్ అయిపోతున్నాయి. సొంతూళ్ల నుంచి వచ్చే బంధువులకు ఇళ్లలో ఆతిథ్యం ఇవ్వడం కష్టంగా మారిన ఈ రోజుల్లో హోటల్ గదులు అయితే సౌలభ్యంగా ఉంటాయని ముందస్తుగా వాటిని కూడా బుక్ చేసేస్తున్నారు.
పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో ఇప్పటికే శుభలేఖలు అచ్చువేసే ప్రింటింగ్ ప్రెస్‌లు, వస్త్ర దుకాణాలు సందడిగా కనిపిస్తున్నాయి. అటు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, పురోహితులు, మేకప్, బంగారు వ్యాపారులు, ఇళ్లను విద్యుద్దీపాలతో అలంకరించేవారు, క్యాటరింగ్ సహా దాదాపు 20 రంగాలకు చెందినవారు చేతినిండా పనితో బిజీ అయిపోయారు.