*వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లలో సరికొత్త ఆల్‌టైం రికార్డు నమోదైంది. ఈ ఏడాది మార్చిలో జీఎస్‌టీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 15 శాతం వృద్ధితో రూ.1.42 లక్షల కోట్లు అధిగమించాయని కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ప్రకటించింది. ఆర్థిక సంవత్సరాంతం కావడంతో పాటు కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం తో ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాలు జోరందుకోవడం, పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేయ డం ఇందుకు దోహదపడింది. గత ఆల్‌టైం రికార్డు ఆదాయమైన రూ.1.40 లక్షల కోట్లు ఈ ఏడాది జనవరిలో నమోదైంది. 2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి (జనవరి-మార్చి) జీఎస్‌టీ స్థూల వసూళ్ల సగటు రూ.1.38 లక్షల కోట్లుగా ఉండగా.. మూడో త్రైమాసికానికి (అక్టోబరు-డిసెంబరు) రూ.1.30 లక్షల కోట్లు, రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబరు) రూ.1.15 లక్షల కోట్లు, తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) రూ.1.10 లక్షల కోట్లుగా నమోదైంది.
*ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్ చాట్‌లకు విచ్చలవిడిగా పోటెత్తుతున్న ఫార్వార్డెడ్ మెసేజ్‌లకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్ల కోసం ప్రత్యేకంగా ఓ ఫీచర్‌ను తీసుకొస్తోంది.
*మర్షియల్ ఎలక్ట్రిక్ వాహన తయారీ దారు ఈకా… దేశీ మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ బస్ ఈ9ను విడుదల చేసింది. శనివారం నాడిక్కడ పుణె ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ కాంక్లేవ్‌లో మహారాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య థాకరే ఈ బస్సును విడుదల చేశారు. 200 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్‌తో రూపొందించి ఈ9 బస్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు పినాకిల్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన ఈకా వెల్లడించింది. ప్రజా రవాణా కోసం 31 సీట్లతో కూడిన ఈ ఎలక్ట్రిక్ బస్ చక్కగా ఉపయోగపడుతుందని పేర్కొంది.
*యూటీఐ నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్‌ను తీసుకువచ్చింది. మిడ్‌క్యాప్ విభాగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్ల కోసం ఈ ఫండ్ చక్కగా సరిపోతుందని యూటీఐ ఎంఎఫ్ తెలిపింది. ఈ ఫండ్‌కు నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 క్వాలిటీ టోటల్ రిటర్న్ ఇండెక్స్ (టీఆర్‌ఐ) బెంచ్‌మార్క్‌గా ఉండనుంది. ఈ ఫండ్ ఈ నెల 5 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ నెల 15 నుంచి ఈ స్కీమ్.. సబ్‌స్ర్కిప్షన్, రిండప్షన్ కోసం అందుబాటులో ఉండ నుంది. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.5,000. ఆ తర్వాత రూపాయి చొప్పున పెట్టుబడులు పెంచుకోవచ్చు
*మధుకాన్ ఇన్‌ఫ్రా అనుబంధ సంస్థ సింహపురి ఎనర్జీ లిమిటెడ్ విలువను తగ్గించి విక్రయించాలన్న ప్రతిపాదనపై హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఈ సంస్థ గతంలో ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణాలు పొందించింది. ఈ మొత్తం రుణాలను వన్ టైం సెటిల్‌మెంట్ కింద రూ. 800 కోట్లు చెల్లిస్తామని ప్రతిపాదించింది.
*కొవాక్సిన్ ఉత్పత్తిని తాత్కాలికంగా తగ్గిస్తున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. కొనుగోలు చేసిన ఏజెన్సీలకు సరఫరా పూర్తి కావడం.. భవిష్యత్తులో గిరాకీ తగ్గనుండడంతో అన్ని యూనిట్లలో కొవాక్సిన్ ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. గత ఏడాది కాలంలో ఇతర వాక్సిన్ల ఉత్పత్తిని తగ్గించి కొవాక్సిన్ ఉత్పత్తిపై భారత్ బయోటెక్ దృష్టి పెట్టింది. అత్యవసర వినియోగ లిస్టింగ్ (ఈయూఎల్)లో చేర్చిన అనంతరం ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) బృందం కంపెనీ ప్లాంట్లను సందర్శించింది. ఈ నేపథ్యంలో ప్రణాళిక బద్ధంగా కార్యకలాపాలను పెంచేందుకు డబ్ల్యూహెచ్‌ఓ బృందానికి కంపెనీ హామీ ఇచ్చింది. ఇక ఉత్పత్తి యూనిట్ల మెయింటెనెన్స్, ప్రాసెస్ కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించాలని కంపెనీ భావిస్తోంది
*భారత్‌లో కార్డియోవాస్క్యులర్ (హృద్రోగ సంబం ధ) ఔషధ బ్రాండ్ ‘సిడ్మ్‌స’ను వినియోగించుకునేందుకు నొవార్టిస్ ఏజీతో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బ్రాండ్‌ను భారత్‌లో వినియోగించుకునేందు కు 6.1 కోట్ల డాలర్లు (దాదాపు రూ.464 కోట్లు) చెల్లిస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. గుండెపోటు వచ్చిన రోగులకు ఇచ్చే వల్సార్టన్, సాక్యుబిట్రిల్ (నొవార్టి్‌సకు పేటెంట్ ఉంది) కాంబినేషన్ ఔషధానికి డాక్టర్ రెడ్డీస్ ఈ బ్రాండ్‌ను వినియోగించి, విక్రయిస్తుంది. ఈ టాబ్లెట్లను మూడు మోతాదుల్లో డాక్టర్ రెడ్డీస్ అందుబాటులోకి తీసుకువస్తుంది. 2022 ఫిబ్రవరితో ముగిసిన ఏడాది కాలానికి భారత్‌లో రూ.136 కోట్ల విలువైన సిడ్మస్ టాబ్లెట్స్ విక్రయం అయినట్లు అంచనా.
*ఎన్‌ఎండీసీ ఇనుప ఖనిజం ధరలను మళ్లీ పెంచింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. లంప్ రకం ఖనిజం ధరను టన్నుకు రూ.100, ఫైన్స్ రకం ధరను రూ.200 సవరించింది. దీంతో టన్ను లంప్ ఖనిజం ధర రూ.6,100కు, ఫైన్స్ ధర రూ.5,160 చేరుతుందని ఎన్‌ఎండీసీ వెల్లడించింది. దీనికి రాయల్టీ, సెస్, ఫారెస్ట్ పర్మిట్ ఫీజు అదనం. కాగా గత నెల 8న ఇనుప ఖనిజం ధరలను కంపెనీ పెంచింది.