యోగా శిక్షకులు, చెఫ్‌లకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ రెండు రంగాలకు చెందిన వారిని ప్రత్యేకంగా పరిగణిస్తూ వీసాలు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆ దేశ వాణిజ్య, పర్యాటక శాఖ మంత్రి డాన్ తెహాన్ మీడియాకు తెలిపారు. ఇటీవల భారత్, ఆసీస్ మధ్య కుదిరిన ఆస్ట్రేలియా ఇండియా ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్(ఏఐఈసీటీఏ) వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. “ఈ వాణిజ్య ఒప్పందం కీలక ఫలితాలలో మొబిలిటీ ఒకటి. దీనిలో భాగంగా భారతీయ చెఫ్‌లు, యోగా శిక్షకులకు ప్రత్యేక వీసా ఏర్పాట్లకు మేము అంగీకరించాము” అని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.
భారతీయ యోగా మాస్టర్లు, చెఫ్‌లకు ఆస్ట్రేలియా అదిరిపోయే ఆఫర్!కాగా, ఇప్పటి వరకు వంట మాస్టర్లు, యోగా గురువులకు స్కిల్డ్ పర్సన్స్ కోటాలోనే ఆస్ట్రేలియా వీసాలు జారీ చేస్తోంది. దీని వల్ల వీసాలు లభించడానికి చాలా సమయం పడుతోంది. ఇరు దేశాల మధ్య రాకపోకలు పెరిగినప్పుడే ఏఐఈసీటీఏ ప్రయోజనాలు నెరవేరుతాయని ఆయన పేర్కొన్నారు. ఇక త్వరలోనే ఈ వీసాల జారీకి సంబంధించిన నియమ నిబంధనలు ప్రకటిస్తామని మంత్రి తెలియజేశారు. అలాగే భారతీయ బ్యాక్‌ప్యాకర్లకు ఆస్ట్రేలియా 1,000 వర్కింగ్ హాలిడే వీసాలు కూడా మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అంతేగాక అగ్రశ్రేణి భారతీయ ఐటీ, ఇంజనీరింగ్, గణితం, సైన్స్ గ్రాడ్యుయేట్‌లకు సుదీర్ఘ పోస్ట్-స్టడీ వీసాలను కూడా జారీ చేస్తామన్నారు.