DailyDose

దేశంలో పెరిగిన మాంసాహార ప్రియత్వం

దేశంలో పెరిగిన మాంసాహార ప్రియత్వం

*నాన్‌వెజ్‌లో ఇప్పటికీ బెంగాలీ బాబులే ఫస్ట్‌
*ఆ తర్వాతి స్థానం తెలుగు రాష్ట్రాలదే
*దేశంలో 70శాతం మాంస వినియోగం
*అచ్చంగా శాకాహారులు 30 శాతం లోపే

ముక్క లేనిదే ముద్ద దిగని రోజులు వచ్చేశాయి. నిజానికి, మాంసాహారం భారతీయులకు మొదటినుంచీ ప్రీతికర ఆహారమే. పశ్చిమబెంగాల్‌ను ఈ విషయంలో కొట్టే రాష్ట్రం ఈనాటికీ లేదు. అదే సమయంలో ఆహార శాలల్లో శాకాహారం కూడా విరివిగానే దొరికేది. తినేవారూ అదే స్థాయిలో ఉండేవారు. వారంలో ఒకరోజు మాంసాహారం తీసుకుని.. మిగతా రోజులు శాకాహారం తినే కుటుంబాలే దేశంలో ఎక్కువ. అయితే.. ఈ ఆహార చిత్రం వేగంగా మారిపోతున్నదని, వారంలో మూడు, నాలుగు రోజులు కూడా నాన్‌వెజ్‌ తీసుకునేవారి జనాభా పెరుగుతున్నదని శాంపిల్‌ రిజిస్ర్టేషన్‌ సిస్టమ్‌ అనే సంస్థ నిర్వహించిన బేస్‌లైన్‌ సర్వేలో వెల్లడైంది. ఆహార శాలలు, కార్యాలయాలు, ప్రయాణాలు, విహారయాత్రలు, విడిది గృహాలు, వేడుకలు.. ఇలా ప్రతి సందర్భంలో కలుసుకునే ప్రతి వందమందిలో 70శాతం మంది మాంసాహారులుంటే, 30 శాతం కంటే తక్కువగానే శాకాహారం అడిగేవారు ఉంటున్నారట! శిశు జననాలు, అక్షరాస్యతలో స్ర్తీ, పురుషుల నిష్పత్తితో ఎంతో తేడా! కానీ, నాజ్‌ వెజ్‌ విషయంలో మాత్రం వీరి దామాషాలో అట్టే భేదం లేదని కూడా ఈ సర్వే వెల్లడించింది. అంతేకాదు.. ఈ విషయంలో పశ్చిమబెంగాల్‌ తర్వాతి స్థానం తెలుగు రాష్ట్రాలదేనట! అందులోనూ మాంసం తీసుకునే మహిళల జనాభాలో బెంగాల్‌ను తెలంగాణ దాటేయడం మరో విశేషం! అన్ని వయసులు, సామాజిక శ్రేణులు, గ్రామాలు-పట్టణాల వారీగా స్ర్తీ, పురుషులపై ఈ అధ్యయనం సాగింది. ఈ క్రమంలో 8,856 మందిని సర్వే బృందం కలుసుకుంది. ఇలా ప్రతి పదేళ్లకు ఒకసారి ఈ సంస్థ సర్వే చేస్తుంటుంది. చివరిసారిగా 2014లో… 2011నాటి జనగణన వివరాల ఆధారంగా అధ్యయనం జరిపింది. అందులో వెల్లడైన వివరాలను తాజాగా ఓ ప్రముఖ ఇంగ్లిష్‌ దినపత్రిక ప్రచురించింది.
04072022033805n49
**ఆడవారూ తక్కువేం కాదు..
2011నాటికి భారతదేశ జనాభా 121 కోట్లపైమాటే. ఇందులో పురుషులు 62 కోట్ల మంది ఉంటే.. స్ర్తీలు 58 కోట్లుపైనే. ఈ సర్వే కోసం కలిసినవారి ప్రతి వందమంది పురుషుల్లో 71.6శాతం మంది మాంసాహారం ఇష్టపడతామని చెప్పారు. దాదాపు ఇదే స్థాయిలో మగువలు కూడా తమ ఇష్టాన్ని వెల్లడించారు. తాము తరచూ నాన్‌వెజ్‌ తీసుకుంటామని ప్రతి వందమంది ఆడవారిలో దాదాపు 70.7 శాతం తెలిపారు. సామాజిక శ్రేణులవారీగా చూసినా.. అన్ని వర్గాల్లోని స్ర్తీలదీ ఇదే మాట! ప్రతి వందమందిలో జనరల్‌ క్యాటగిరీలో పురుషులు 69.7శాతం, మహిళలు 68.8శాతం, ఎస్సీల్లో మగవారు 77.9శాతం మహిళలు 76.1శాతం, ఎస్టీల్లో మగవారు 76.0శాతం, మహిళలు 75శాతం మేర మాంసాహార ఉత్పత్తుల పక్షమే! చికెన్‌, మటన్‌, చేపలు, రొయ్యలు, కోడిగుడ్డుతో చేసిన ఆహారఉత్పత్తులను వీరంతా ఇష్టంగా తీసుకుంటున్నారు. రాష్ట్రాలవారీగా చూస్తే.. బెంగాల్‌ కంటే తెలంగాణలోనే ఎక్కువమంది ఆడవాళ్లు మాంసం తీసుకుంటున్నారు. మాంసాహార ప్రియులు తెలంగాణ మహిళల్లో ప్రతి వందమందికి 98.6శాతం ఉంటే, బెంగాల్‌ మహిళల్లో అది 98.4శాతంగా ఉంది. ఆ తర్వాతి స్థానం ఆంధ్రప్రదేశ్‌ ఆక్రమించింది. ఇక్కడ ప్రతి వందమంది మహిళల్లో 98.1% మాంసాహార ఉత్పత్తులు తీసుకుంటున్నారు.

***రాజస్థాన్‌లో శాకాహారమే…
దేశవ్యాప్తంగా 28.4 శాతం పురుషులు, 29.3శాతం మహిళలు శాకాహారంపై ఆసక్తి చూపుతున్నారని సర్వే తెలిపింది. అత్యధికంగా రాజస్థాన్‌ మహిళలు 76.6శాతం ఆకుకూరలు, దుంపలు తీసుకుంటున్నారు. అక్కడి పురుషుల్లో 73.2శాతం మందిదీ ఇదే బాణీ! ఇక హరియాణాలో 70శాతం మంది మహిళలు, 68.5శాతం మంది పురుషులు శాకాహారప్రియులు. పశ్చిమబెంగాల్‌లో కేవలం 1.3శాతం మగవారు, 1.6శాతం మహిళలు మాత్రమే మాంసాహారేతర వంటకాలను ఇష్టపడుతున్నారు. ఇదిప్రతి వందమందిని పరిగణనలోకి తీసుకుని తీసిన లెక్క! తెలంగాణలో 1.2శాతం పురుషులు, 1.4శాతం మహిళలు శాకాహారాన్ని ఇష్టపడుతుండగా, ఏపీలో పురుషులు 1.6శాతం మహిళలు 1.9శాతం శాకాహారాన్ని కోరుకుంటున్నారు.