DailyDose

ఏపీ కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారు

ఏపీ కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారు

కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11న ఏపీ కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాసేపట్లో గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ పర్యటన విషయాలను గవర్నర్‌కు జగన్‌ వివరించనున్నారు. ఈ సందర్భంగా కేబినెట్‌ విస్తరణ కార్యక్రమానికి గవర్నర్‌ను జగన్‌ ఆహ్వానించనున్నారు. గురువారం ఆఖరిసారి మంత్రివర్గ సమావేశాన్ని జగన్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత అందరితో రాజీనామాలు చేయిస్తారని సమాచారం. గవర్నర్ ఆమోదం తెలపగానే అదే రోజు కొత్తగా మంత్రిమండలిలోకి వచ్చేవారికి సమాచారం ఇస్తారు. ఈనెల 11న ఉదయం 11:30 గంటలకు సచివాలయం భవన సముదాయం పక్కనున్న స్థలంలో కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు.మంత్రివర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణతో పాటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని జగన్ తొలగించడం ఖాయమని పాలకపక్షంలో జోరుగా ప్రచారం సాగుతోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తిగా ముఖ్యమంత్రి అభీష్టమని సీనియరు మంత్రులు బహిరంగ వేదికలపై చెబుతున్నా.. కొందరు మాత్రం లోలోన అసంతృప్తితో రగిలిపోతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఈ పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఈ జిల్లాలో మంత్రి ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగించి.. బాలినేనిని తొలగించాలన్న యోచనలో సీఎం ఉన్నారని వైసీపీ వర్గాల్లో అంతర్గత చర్చ జరుగుతోంది. దీనిపై బాలినేని అసంతృప్తితోనే ఉన్నారని, ఇద్దరినీ మంత్రులుగా కొనసాగించాలని… లేదంటే ఇద్దరూ కొత్తవారే ఉండాలని జగన్‌తో బాలినేని అన్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి మాత్రం తన మనసులో మాట తెగేసి చెప్పారని.. పార్టీ బాధ్యతలను భుజానికెత్తుకోవాలని బాలినేనికి స్పష్టం చేశారని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు