*ఏప్రిల్ 10న ధ్వజారోహణం
*ఏప్రిల్ 15న శ్రీ సీతారాముల కల్యాణం
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 10 నుండి 18వ తేదీ వరకు జరుగనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఏప్రిల్ 9న శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది.ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహిస్తారు.
**ఏప్రిల్ 10న ధ్వజారోహణం
ఏప్రిల్ 10న ఆదివారం ఉదయం 8 నుండి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. సాయంత్రం 4 నుండి రాత్రి 7 గంటల వరకు పోతన జయంతి, కవి సమ్మేళనం, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శేష వాహనసేవ నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
*సాంస్కృతిక కార్యక్రమాలు
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 10 నుండి 19వ తేదీ వరకు ఆలయ ప్రాంగణంలో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ధార్మికోపన్యాసం, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఊంజల్‌సేవలో భక్తి సంగీతం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు హరికథ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం, రాత్రి వాహనసేవల్లో కళాబృందాలు భజనలు, కోలాటాలు తదితర కళారూపాలను ప్రదర్శిస్తారు.
*కవి సమ్మేళనం, సాహితీ సదస్సు…
ఏప్రిల్ 10న బమ్మెర పోతన జయంతి సందర్భంగా మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కవి సమ్మేళనం నిర్వహిస్తారు. ఏప్రిల్ 11న శ్రీరామపట్టాభిషేకం సందర్భంగా మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాహితీ సదస్సు జరుగనుంది.
*ఏప్రిల్ 15న కల్యాణోత్సవం రోజున ప్రత్యేక కార్యక్రమాలు…
ఏప్రిల్ 15న కల్యాణోత్సవం సందర్భంగా సాయంత్రం 4 నుండి 4.30 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో నాదస్వర వాద్యం, సాయంత్రం 4.30 నుండి 5 గంటల వరకు ఎస్వీబీసీ అదివో అల్లదివో కార్యక్రమం కళాకారులతో భక్తిసంగీతం, సాయంత్రం 5 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులతో నామసంకీర్తనం, సాయంత్రం 5.30 నుండి 6.15 గంటల వరకు ఎదుర్కోలు, సాయంత్రం 6.15 నుండి 7.45 గంటల వరకు తమిళనాడుకు చెందిన శ్రీ విఠల్‌దాస్ మహరాజ్ బృందం నామసంకీర్తనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య చక్రవర్తి రంగనాథన్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ కల్యాణోత్సవానికి ప్రత్యేకంగా వ్యాఖ్యానం చేస్తారు.
**బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు
తేదీ ఉదయం రాత్రి
10-04-2022(ఆది) ధ్వజారోహణం(ఉ|| 8-9గం||ల)(వృషభ లగ్నం), పోతన జయంతి, శేషవాహనం.
11-04-2022(సోమ) వేణుగాన అలంకారం, హంస వాహనం.
12-04-2022(మంగళ) వటపత్రశాయి అలంకారం, సింహ వాహనం.
13-04-2022(బుధ) నవనీతకృష్ణ అలంకారం, హనుమత్సేవ.
14-04-2022(గురు) మోహినీ అలంకారం, గరుడసేవ.
15-04-2022(శుక్ర) శివధనుర్భంగాలంకారం, శ్రీ సీతారాముల కల్యాణం (రా|| 8 గం||లకు), గజవాహనం.
16-04-2022(శని) రథోత్సవం.
17-04-2022(ఆది) కాళీయమర్ధన అలంకారం, అశ్వవాహనం.
18-04-2022(సోమ) చక్రస్నానం, ధ్వజావరోహణం(రా|| 7 గం||).
19-04-2022(మంగళ) పుష్పయాగం(సా|| 6 గం||).