*హైదరాబాద్ నగరంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు అందిన సమాచారంతో ఐపీఎల్ -2022 క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 18 మంది కలిసి ముఠాగా ఏర్పడ్డారన్నారు. మాదాపూర్ జోన్ పరిధిలోని 5 చోట్ల క్రికెట్ బెట్టింగ్‌ను ఈ ముఠా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 1 కోటి 62 లక్షల విలువచేసే సొత్తును స్వాధీనం చేసుకున్నామని వారు పేర్కొన్నారు. 42 లక్షల 38 వేల నగదు, 05 కమ్యూనికేషన్ బోర్డ్స్, 07 ల్యాప్ టాప్స్, 46 స్మార్ట్ మొబైల్స్, 32 మొబైల్ ఫోన్లు, 01 ట్యాబ్, 03 టీవీలు, 03 కార్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు స్తున్నారు.
*ప.గో.జిల్లా ఉండిలో శశి జ్యూయిలర్స్ లో దోపిడీ…తెల్లవారుజామున దోపిడీలో పెద్ద మొత్తంలో బంగారు వెండి ఆభరణాలు చోరీ…సుమారు 77 కేజీల వెండి,150 గ్రాములు బంగారం చోరికి గురైనట్లు ప్రాధమిక సమాచారం…సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు…సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ పరిశీలించారు.
*ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పెదబయలు మండలం ఎగతరాబులో ఈ ఘటన చోటు చేసుకుంది . ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నాడని ఆరోపణలతో బొంగజంగి గ్రామానికి చెందిన కొర్రా లక్ష్మణారావును మావోయిస్టులు హత్య చేశారు. లక్ష్మణరావు గతంలో మావోయిస్టు దళంలో పని చేసి పోలీసులకు లొంగిపోయాడు.
*రెండు ఆకుల గుర్తు కోసం ముడుపుల కేసులో కీలక సాక్షి బీ గోపీనాథ్ (31) అనుమానాస్పద స్థితిలో మరణించి కనిపించారు. న్యాయవాది అయిన ఆయన ఏప్రిల్ 8న ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యూఢిల్లీ కార్యాలయంలో విచారణకు హాజరుకావలసి ఉంది. ఆయన బుధవారం తన నివాసంలోనే సీలింగ్‌కు వేలాడుతూ కనిపించారు.
*చిత్తూరు జిల్లాలో వైసీపీకి చెందిన నాయకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో విషాదం నింపింది. జిల్లాలోని కుప్పం నియోజకవర్గం కుప్పం గ్రామంలో గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్‌గా పనిచేసిన వైసీపీ నేత పార్థసారథి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల ఆలయానికి పాలకవర్గం చైర్మన్‌గా, సభ్యులుగా కొత్తవారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది .
*చిత్తూరు జిల్లా: కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయం మాజీ చైర్మన్ పార్థసారధి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం కుప్పం తిరుపతి గంగమ్మ దేవస్థానం పాలకమండలి సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఇదే పాలకమండలిలో పార్థసారధిని సభ్యునిగా ప్రభుత్వం నియమించింది. అయితే గత రెండేళ్లుగా పార్థసారధి చైర్మన్‌గా పనిచేశారు. కరోన కారణంగా నామమాత్రంగానే చైర్మన్‌గా ఉన్నారు. మరోసారి తనకు చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. అయితే చైర్మన్‌గా మంజునాథ్‌ని ప్రభుత్వం నియమించడంతో పదవి ఇవ్వలేదనే మనస్తాపంతోనే పార్థసారధి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
*గుంటూరు జిల్లాలోని బుడంపాడు దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణలను తెలుసుకుని, మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
*రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొనగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు సజీవ దహనం అయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
*వికారాబాద్ జిల్లాలోని కులకచర్ల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని అంతరాం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
* అవినీతి కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్‌ను సీబీఐ బుధవారం అరెస్టుచేసింది. స్థానిక జేజే ఆస్పత్రి నుంచి మంగళవారం డిశ్చార్జ్ ఆయనను ప్రత్యేక న్యాయమూర్తి వీసీ బార్డే ఎదుట సీబీఐ బుఽధవారం హాజరుపరిచింది. కేసు విచారించిన న్యాయమూర్తి.. ఈనెల 11 వరకు దేశ్‌ముఖ్‌ను సీబీఐ కస్టడీలోకి ఇస్తున్నట్టు ఆదేశాలు జారీచేశారు. అంతకుముందు దేశ్‌ముఖ్ వ్యక్తిగత కార్యదర్శి కుందన్ షిండే, కార్యదర్శి సంజీవ్ పలాండేను కేంద్ర దర్యాప్తు సంస్థ కస్టడీలోకి తీసుకుంది.
* బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో డ్రగ్స్ సప్లయర్ నాగేశ్వర్‌రావు, లక్ష్మీపతిని అరెస్ట్ చేశారు. నిందితులు గంజాయి, హాష్ ఆయిల్ అమ్ముతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. లక్ష్మీపతిపై గతంలో 6 కేసులు నమోదయ్యాయని నార్కోటిక్ డీసీపీ చక్రవర్తి తెలిపారు. నాగేశ్వర్‌రావుతో లక్ష్మీపతి కిలో గంజాయిని రూ.50 వేలకు కొనుగోలు చేసి… హైదరాబాద్‌లో కిలో రూ.6 లక్షలకు అమ్ముతున్నారని చక్రవర్తి తెలిపారు. గంజాయిని హాష్ ఆయిల్‌గా మార్చి అమ్ముతున్నారని, 80 మందికి రెగ్యులర్‌గా గంజాయి సప్లై చేస్తున్నారని చెప్పారు. ఒడిశాలో 14 మంది, తమిళనాడులో 13, కర్ణాటకలో 7, ముంబైలో నలుగురు డ్రగ్ పెడ్లర్లు ఉన్నారని తెలిపారు. గంజాయి తీసుకుంటున్న వంశీ కృష్ణ, విక్రమ్ అరెస్ట్ చేశామని, 840 గ్రాముల హాష్ ఆయిల్ సీజ్ చేశామని చక్రవర్తి తెలిపారు.
*నాగిరెడ్డిపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దర్మారెడ్డి గ్రామ శివారులో ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ధర్మారెడ్డి గ్రామానికి చెందిన దాసరి విఠల్(45), కమ్మరి వినోద్ (25)గా పోలీసులు గుర్తించారు.