Business

టీసీఎస్‌ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త..!

టీసీఎస్‌ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త..!

ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్తను అందించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌ తన ఉద్యోగులకు భారీగా వేతనాలను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

భారీగా ఇంక్రిమెంట్స్‌..!
గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 6 నుంచి 8శాతం మేర జీతాలను పెంచిందని కంపెనీ సీఈవో, ఎండీ రాజేష్‌ గోపినాథన్‌ వెల్లడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరం ఫలితాలు సానుకూలంగా ఉండడంతో FY23లో కూడా ఉద్యోగులకు భారీగా ఇంక్రిమెంట్‌ లభించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కంపెనీలో భారీగా అట్రిషన్‌ రేటు అత్యధికంగా 17.4 శాతానికి చేరుకుంది. దీంతో ఉద్యోగుల వలసలను ఆపేందుకుగాను ఉద్యోగులకు ఈ ఏడాదిలో భారీ స్థాయిలో ఇంక్రిమెంట్లను ఇచ్చేందుకు కంపెనీ సిద్థంగా ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్‌ రంగంలో రికార్డులను సృష్టిస్తూ నికరంగా లక్షకు పైగా ఉద్యోగాలను టీసీఎస్‌ కల్పించింది. ఈ ఏడాది(2022–23)లో 40,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించేందుకు టీసీఎస్‌ సిద్దంగా ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది.

తొలిసారి రికార్డు స్థాయిలో..!
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో త్రైమాసిక ఫలితాలను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) ప్రకటించింది. నాలుగో త్రైమాసిక ఫలితాలతో టీసీఎస్‌ దుమ్మురేపింది. గడిచిన త్రైమాసికంలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో ఆదాయాలను టీసీఎస్‌ గడించింది. గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించి నాలుగో త్రైమాసికంలో రూ. 9,926 నికర ఆదాయాలను ఆర్జించింది. గత ఏడాది నాలుగో త్రైమాసికంతో పోల్చితే…7.4 శాతం వృద్ధిని సాధించింది. ఒక త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం తొలిసారిగా రూ.50 వేల కోట్లను దాటడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే 15.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 1, 91, 754 కోట్ల ఆదాయన్ని నమోదు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ. 16.8 శాతం వార్షిక వృద్ధిని టీసీఎస్‌ ఆర్జించింది. ఈ నేపథ్యంలో ఒక్కో షేరుకు రూ. 22 డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది.