బాలీవుడ్ ప్రేమజంట ఆలియా భట్, రణబీర్ కపూర్‌ల పెళ్లి సందడి మొదలైంది. ముంబై వాస్తు అపార్ట్‌మెంట్స్‌లోని వారి స్వగృహంలో వివాహ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం గణపతి పూజ, సాయంత్రం నిశ్చితార్థం, మెహందీ కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకలకు చిత్ర పరిశ్రమ నుంచి కరీనా కపూర్, కరణ్ జోహార్ వంటి కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. రణబీర్ తల్లి నీతూ కపూర్, ఆమె సోదరి పెళ్లి పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆర్కే స్టూడియో, వాస్తు అపార్ట్‌మెంట్స్, కృష్ణరాజ్ బంగ్లాలను అందంగా అలంకరించారు. ఆలియా, రణబీర్ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని వీడియో, ఎవరూ బయటకు లీక్ చేయకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు. పనిలో ప్రతి స్టాఫ్ మెంబర్ సెల్‌ఫోన్ కెమెరాలను టేప్‌తో మూసేస్తున్నారు. గురువారం పెళ్లి జరగనుందని సమాచారం. వివాహ కానుకగా వీరు కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలోని కేసరియా పాటను చిత్రబృందం విడుదల చేశారు.