భారత్, అమెరికా మధ్య బలమైన సైనిక సంబంధాలున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. హవాయి ఓహూ ద్వీపంలోని అమెరికా భారత పసిఫిక్ కమాండ్, మిలిటరీ శిక్షణ కేంద్రాలను మంగళవారం సందర్శించారు. కమాండర్ అడ్మిరల్ జాన్ అక్విలినో ఘన స్వాగతం పలికారు. భారత్, అమెరికా మధ్య బలమైన రక్షణ భాగస్వామ్యం పురోగతిపై రాజ్‌నాథ్ సింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సైనిక సహకారం, ఐక్యత గురించి ప్రస్తావించారు. భారత్ అమెరికా ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా కలిసి పనిచేయాలని నిర్ణయించారు. అన్ని డొమైన్లలో భారత్- అమెరికా రక్షణ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇండో పసిఫిక్ కమాండ్ నాయకత్వంతో విస్తృత స్థాయి చర్చలు జరిపారు.ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. హవాయిలోని ఓహూ ద్వీపంలో అమెరికా భారత పసిఫిక్ కమాండ్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల సందర్శించినట్లు తెలిపింది. ఇరు దేశాల రక్షణ వర్గాలతో పలు అంశాలపై చర్చలు జరిపినట్లు పేర్కొంది.