బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ లాస్ ఏంజెలిస్‌లోని విశ్వవిద్యాలయాన్ని సందర్శించాడు. అతడి కొడుకులు హ్రీహాన్, హ్రీదాన్ కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ముంబై నుంచి ఏప్రిల్ 1న ఈ ముగ్గురు బయలుదేరినట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. విశ్వ విద్యాలయానికి చెందిన అనేకమంది విద్యార్థులు స్టార్ హీరోతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. యూనివర్శిటీ ఆఫ్ సౌతార్న్ కాలిఫోర్నియా(యూఎస్‌సీ) క్యాంపస్‌లోకి హీరో హృతిక్ రోషన్ వచ్చాడనే వార్త అందరికీ తెలిసింది. దీంతో అభిమానులందరూ స్టార్ హీరోతో ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. విద్యార్థులతో బాలీవుడ్ నటుడు కాసేపు మచ్చటించాడని తెలుస్తోంది. క్యాంపస్‌కు చెందిన కొంతమంది విద్యార్థులు కూడా హృతిక్‌తో సెల్ఫీ తీసుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘యూఎస్‌సీలో నేను ఎవరిని కలుసుకున్నానో ఊహించండి. హృతిక్ రోషన్, అతడి పిల్లల్ని ఈ రోజు క్యాంపస్‌లో నేను కలిశాను’’ అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు. క్యాంపస్‌లో హృతిక్ కొత్త లుక్‌ను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. హృతిక్ పెద్ద కొడుకు హ్రీహాన్ ఉన్నత విద్య కోసమే అతడు యూఎస్‌సీని సందర్శించాడని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. హృతిక్ రోషన్ చివరగా ‘వార్’లో కనిపించాడు. ఈ చిత్రం 2019లో విడుదలైంది. ప్రస్తుతం అతడు ‘విక్రమ్ వేద’ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, రాధికా అప్టే తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ‘ఫైటర్’ అనే మరో చిత్రం కూడా అతడు చేయనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా థియేటర్స్‌లోకి రానుంది