Politics

ప్రధానమంత్రుల మ్యూజియాన్ని ప్రారంభించి మొదటి టికెట్ కోనుగోలు చేసిన మోదీ

ప్రధానమంత్రుల మ్యూజియాన్ని ప్రారంభించి మొదటి టికెట్ కోనుగోలు చేసిన మోదీ

దేశంలోని 14 మంది మాజీ ప్రధానులకు అంకితం చేసిన కొత్త మ్యూజియం ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ను గురువారం ప్రధాని మోదీ ప్రారంభించారు.దానిని సందర్శించేందుకు తొలి ప్రవేశ టికెట్‌ను ఆయన కొనుగోలు చేశారు. దేశ రాజధాని దిల్లీలోని తీన్‌ మూర్తి ఎస్టేట్‌లో ఈ మ్యూజియం ఉంది. అభివృద్ధి చెందుతోన్న భారత్‌ను ప్రతిబింబించేలా ఈ మ్యూజియంను రూపొందించారని అధికారులు తెలిపారు.మాజీ ప్రధానుల జీవితాల్లో చోటుచేసుకొన్న అనుభవాలు, వారి హయాంలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే క్రమంలో ఎదురైన సవాళ్లను ఈ మ్యూజియం ద్వారా దేశ ప్రజలు తెలుసుకోనున్నారని అధికారులు వెల్లడించారు. అదే సమయంలో స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను కూడా తెలుసుకునే ఏర్పాటు ఉంది. పార్టీలకతీతంగా దేశాన్ని పాలించిన ప్రధానులందరి సేవల్ని గుర్తించడమే సంగ్రహాలయం ఉద్దేశమని చెప్పారు. ’14 మంది ప్రధానుల గురించి అవగాహన కల్పించేందుకు ఈ మ్యూజియాన్ని అభివృద్ధి చేశారు. వారు అనుసరించిన సిద్ధాంతాలు, పదవిలో ఉన్నకాలంతో సంబంధం లేకుండా.. వారి హయాంలో చేసిన సేవలను ఇది వెల్లడిస్తోంది. వారి జీవితాల ఆధారంగా స్వతంత్ర భారతావని గురించి తెలుసుకునే ఏర్పాటు ఇది’ అని మీడియాకు తెలిపారు. ఈ ప్రదర్శన కోసం అధునాతన సాంకేతికతను వినియోగించారు. రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా మోదీ ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు.