NRI-NRT

నకిలీ పత్రాలతో వీసాలు.. గుట్టురట్టు చేసిన ఢిల్లీలోని అమెరికా ఎంబసీ

నకిలీ పత్రాలతో వీసాలు.. గుట్టురట్టు చేసిన ఢిల్లీలోని అమెరికా ఎంబసీ

విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తే అదొక అర్హత. విదేశాల్లో ఉద్యోగం చేస్తే అదో గొప్ప. ఇలాంటి ఆకాంక్షలు ఉన్న యువతను ఆకర్షించడానికి కన్సల్టెన్సీలు రకరకాల కిటుకులు అమలు చేస్తున్నాయి. ఆయా దేశాల ఎంబసీల నుంచి వీసాలు పొందడానికి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను తయారు చేసి, పని పూర్తయ్యిందనిపిస్తున్నాయి. ఈ నకిలీ ధ్రువీకరణ పత్రాల వ్యవహారం ఢిల్లీలో బట్టబయలైంది. ఇక్కడ డిగ్రీలు పూర్తిచేసిన విద్యార్థులు మాస్టర్స్‌ కోసం విదేశాలకు వెళ్తుంటారు. ఇందుకు కన్సల్టెన్సీల ద్వారా ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు రాసిన పరీక్షలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలతోపాటు జీఆర్‌ఈ (గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామినేషన్‌) టోఫెల్‌ స్కోరు, అక్కడ వర్సిటీలకు చెల్లించాల్సిన ఫీజుకు సంబంధించిన బ్యాంకు బ్యాలెన్స్‌లను వీసాలు మంజూరు చేసే దేశాల కాన్సులేట్‌ కార్యాలయాల్లో చూపించాల్సి ఉంటుంది. అలాగే డిగ్రీ పూర్తయిన తర్వాత ఏయే సంస్థల్లో పనిచేశారో దానికి సంబంధించిన అనుభవ ధ్రువీకరణపత్రం చూపించాల్సి ఉంటుంది. కొన్ని కన్సల్టెన్సీలు వీటన్నింటికీ నకిలీ పత్రాలు తయారు చేసినట్టు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ గుర్తించింది.

వాస్తవానికి అక్కడ చెల్లించాల్సిన ఫీజులకు సంబంధించి మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో చూపించాలి. కొంతమంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్టుగా టెంటివ్‌ లేఖలను ఎంబసీకి సమర్పించారు. ఇంటర్వ్యూ సమయంలో ఉన్న నగదు, ఆ తర్వాత లేకపోవడంతో కొంతమంది విద్యార్థులపై వారికి అనుమానం వచ్చింది. అన్ని విషయాలు ఆరా తీయగా నకిలీల బాగోతం బయటకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు కన్సల్టెన్సీల నుంచి విద్యార్థులు నకిలీ పత్రాలతో వీసాలు పొందినట్టు ఎంబసీ గుర్తించింది. అం దులో విజయవాడలోని స్ర్పింగ్‌ ఫీల్డ్స్‌, గుంటూరులోని బీ బెస్ట్‌ కన్సల్టెన్సీలతోపాటు వరంగల్‌, హైదరాబాద్‌కు చెందిన మరో 4 కన్సల్టెన్సీలపై ఎంబసీ అధికారులు చాణక్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 2 రోజుల క్రితం ఢిల్లీలోని చాణక్యపురి పోలీసుస్టేషన్‌ బృందం ఇక్కడికి వచ్చి స్ర్పింగ్‌ ఫీల్డ్స్‌ ఓవర్‌సీస్‌ కన్సల్టెన్సీలో సోదాలు నిర్వహించింది. ఆ సంస్థ ఎండీ ముళ్లపూడి కేశవ్‌ను ప్రశ్నించింది. తమ కన్సల్టెన్సీలో ఢిల్లీ పోలీసులు సోదాలు చేసిన మాట వాస్తవమేనని కేశవ్‌ తెలిపారు.