అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు 1,50,439 డాలర్ల ఆదాయ పన్ను చెల్లించారు. 2021లో 6,10,702 డాలర్లు ఆర్జించిన బైడెన్, ఆయన భార్య జిల్… దానిపై 24.6 శాతం పన్ను చెల్లించారు. అధ్యక్షుడు కాకముందుతో పోలిస్తే బైడెన్ దంపతుల ఆదాయం తగ్గడం విశేషం. 2019లో పుస్తకాల అమ్మకాలు, ప్రసంగాలు, టీచింగ్ ద్వారా వాళ్లు దాదాపు 10 లక్షల డాలర్లు ఆర్జించారు. ఫస్ట్ లేడీ జిల్ నార్తర్న్ వర్జీనియా కమ్యూనిటీ కాలేజీలో ఇప్పటికీ బోధన వృత్తిలో కొనసాగుతున్నారు.
బైడెన్ అధ్యక్షుడయ్యాక తన ఆదాయ పన్ను చెల్లింపు వివరాలు విడుదల చేయడం వరుసగా ఇది రెండో ఏడాది. తద్వారా యూఎస్ ప్రెసిడెంట్లు తమ ఐటీ చెల్లింపులను ప్రజల ముందుంచే సంప్రదాయాన్ని ఆయన పునరుద్ధరించారు. బైడెన్‌కు ముందు అధ్యక్షునిగా చేసిన డొనాల్డ్ ట్రంప్ తన ఆదాయ పన్ను వివరాలు వెల్లడించేందుకు నిరాకరించడం తెలిసిందే. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దంపతులు 16,55,563 డాలర్ల ఆదాయంపై 5,23,371 డాలర్ల పన్ను చెల్లించారు.