మనిషి శరీరానికి, మనసుకు సంబంధం ఉంటుందన్న సంగతి తెలిసిందే. శారీరక, మానసిక ఆరోగ్యానికి మధ్య గల సంబంధంపై పరిశోధకులు చాలాఏళ్లుగా లోతైన అధ్యయనం కొనసాగిస్తున్నారు. ఆరోగ్యకరమైన మనసు శారీరక ఆరోగ్యానికి సూచిక అని చెబుతున్నారు. అలాగే మనిషిలో కుంగుబాటు(డిప్రెషన్) అనేది గుండె జబ్బులతో ముడిపడి ఉంటుందని గుర్తించారు. సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే గుండె జబ్బులతో బాధిపడుతున్నవారిలో కుంగుబాటు అధికమని పరిశోధకులు పేర్కొన్నారు. స్పెయిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రెనడా పరిశోధకులు 55 నుంచి 75 ఏళ్లలోపు వయసున్న 6,500 మందిపై నిర్వహించిన ఈ నూతన అధ్యయనం ఫలితాలను ప్లోస్‌వన్ పత్రికలో ప్రచురించారు.
ఆరోగ్యవంతుల్లో క్రమంగా డిప్రెషన్ లక్షణాలు బయటపడితే వారికి గుండెజబ్బుల ముప్పు పొంచి ఉన్నట్లేనని అధ్యయనంతో తేలింది. ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధులతోపాటు కుంగుబాటు కూడా ఉంటే త్వరగా మరణించే అవకాశాలు పెరుగుతున్నట్లు వెల్లడయ్యింది. మనుషుల్లో కుంగుబాటును సృష్టించడంలో మెటబాలిక్ సిండ్రోమ్ కూడా కీలక పాత్ర పోషిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధికంగా చక్కెర, నడుము చుట్టూ అధిక కొవ్వు, రక్తంలో అధికంగా చెడు కొలెస్టరాల్‌ను మెటబాలిక్ సిండ్రోమ్‌గా పరిగణిస్తారు. గుండె జబ్బులు, కుంగుబాటు నుంచి విముక్తి పొందాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. మద్యం, పొగాకుకు దూరంగా ఉండాలి. రోజువారీ దినచర్యలో శారీరక వ్యాయామాన్ని ఒక భాగంగా మార్చుకోవాలి.