Movies

ఫేస్‌ ఆఫ్‌ ఇండియా.. రిద్ధి కుమార్‌

ఫేస్‌ ఆఫ్‌ ఇండియా.. రిద్ధి కుమార్‌

పలు కళలకు చక్కటి ఆకృతినిస్తే.. ఆ పేరు రిద్ధి కుమార్‌. తెలుగు సినిమా ప్రేక్షకులకు తెలుసు.. ఇటీవలి ‘లవర్‌’, ఈనాటి ‘రాధే శ్యామ్‌’ సినిమాల ద్వారా. ఆమె వెబ్‌స్టార్‌ కూడా! అందుకే ఈవారానికి రిద్ధి కుమార్‌ను ఈ ‘కాలమ్‌’ గెస్ట్‌గా తీసుకొచ్చాం. పుట్టింది పుణెలో. తండ్రి ఆర్మీ ఆఫీసర్‌ అవడం వల్ల దేశంలోని చాలా ప్రాంతాల్లో పెరిగింది. తల్లి అల్కా కుమార్‌… అడ్వకేట్‌. పుణె, ఫెర్గ్యూసన్‌ కాలేజ్‌లో ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. పదవ తరగతి పూర్తయిన నాటి నుంచే పని చేయడం మొదలుపెట్టింది. డ్యాన్స్‌ టీచర్‌గా, ఈవెంట్‌ మేనేజర్‌గా, యాంకర్‌గా ఇలా పలు రంగాల్లో ప్రతిభను చాటుకుంది.

డిగ్రీ చదువుతున్నప్పటి నుంచే మోడలింగ్‌ చేయడం మొదలుపెట్టింది. ఎన్నో అందాల పోటీల్లోనూ పాల్గొంది. అన్నిట్లోనూ ఏదో ఒక టైటిల్స్‌ను గెలుచుకుంది. వాటిల్లో మిస్‌ పుణె (2015), ఫేస్‌ ఆఫ్‌ ఇండియా (2016) వంటివి మచ్చుకు కొన్ని. మోడలింగ్‌లో ఉన్నప్పుడే సినిమా అవకాశం వచ్చింది. అదే ‘లవర్‌’.. తెలుగు చిత్రం. దాని తర్వాత మాతృభాష మరాఠీలో, అనంతరం మలయాళం సినిమాల్లోనూ వరుస చాన్స్‌లు వచ్చాయి.

ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉండగానే వెబ్‌ చానెల్స్‌లోనూ ఆఫర్స్‌ ఆమె డేట్స్‌ డైరీలోని పేజీలను నింపేశాయి. అలా ‘వూట్‌’లో స్ట్రీమ్‌ అయిన ‘క్యాండీ’ రిద్ధిని దేశమంతటికీ పరిచయం చేసింది. డిస్నీ హాట్‌స్టార్‌లోని ‘హ్యుమన్‌’ సిరీస్‌ కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నటనంటే అమితంగా అభిమానించే రిద్ధి చిత్రకారిణి కూడా. ఆమె ఆయిల్‌ పెయింటింగ్స్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో మహా ఫాలోయింగ్‌ ఉంది. ఇంకా చాలా కళలున్నాయి ఆమెలో.. రాస్తుంది.. కమ్మటి వెరైటీలను వండుతుంది.. విపరీతంగా ప్రయాణాలు చేస్తుంది. వృత్తి, ప్రవృత్తి రెండూ రెండు కళ్లలాంటివి అంటుంది.

తమను తాము ఆవిష్కరించుకునే భూమికలు అంటే ఇష్టం. కానీ డ్రీమ్‌ రోల్స్‌ మాత్రం ఫన్‌ క్యారెక్టర్సే. అంతేకాదు డిటెక్టివ్, పోలీసు పాత్రల్లో నటించాలనీ ఉంది. – రిద్ధి కుమార్‌