Devotional

శ్రీవారి భక్తులకు టీటీడీ బోర్డు శుభవార్త- TNI తాజా వార్తలు

శ్రీవారి భక్తులకు టీటీడీ బోర్డు శుభవార్త- TNI తాజా వార్తలు

* శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ బోర్డు శుభవార్త చెప్పింది. భక్తులకు మే ఒకటో తేదీ నుంచి శ్రీవారి మెట్లు మార్గంలో అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. గత వానాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలుచోట్ల మెట్ల మార్గం కొట్టుకుపోయాయి. ఈ మార్గంలో మరమ్మతులు పూర్తికావడంతో భక్తులకు అనుమతి స్తున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా నిన్న 76,746 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 31,574 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా టీటీడీ హుండీకి రూ.4.62 కోట్లు ఆదాయం వచ్చిందని సంబంధిత అధికారులు వివరించారు.

*మధ్య నిలిచిపోయిన వైద్యవిద్యను పూర్తి చేసేందుకు దేశంలోని కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వాలని ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారతీయ వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులతోపాటు వారి తల్లీదండ్రులు కూడా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారత్‌లోని యూనివర్సిటీలువిద్యాసంస్థల్లో వైద్యవిద్యను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఉక్రెయిన్‌లో అనివార్య పరిస్థితుల కారణంగా చదువులు మధ్యలోనే వదిలేసి వచ్చిన తమ పిల్లల భవిష్యత్‌ సంక్షోభంలో పడిందని విద్యార్థుల తల్లీదండ్రులు వాపోయారు. ఈ నిరసన కార్యక్రమంలో మంది ఉక్రెయిన్ ఎంబీబీఎస్ విద్యార్థులువారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఉక్రెయిన్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్(పీఏయూఎంఎస్)లో సభ్యత్వం ఉన్న రాష్ట్రాలకు చెందినవారు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పిల్లలను ప్రాణాలను రక్షించి ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చిన విధంగానే పిల్లల భవిష్యత్‌ను కూడా కాపాడాలని పేరెంట్స్ విన్నవించారు.

*ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల జీతాల నుంచి విరాళాలను పక్కాగా సేకరించాలని అధికారులను రాష్ట్ర అటవీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం అరణ్యభవన్‌లో వివిధ శాఖల ఉన్నత స్థాయి అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. మే నెల నుంచి హరితనిధికి నిధులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.

* ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్టీసీని గట్టెక్కించే దిశగా యాజమాన్యం వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా ఈ వేసవి సీజన్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. డిపోల స్థాయిలో లక్ష్యాలను నిర్దేశించి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఈ దిశగా కృషి చేసే ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతులను కూడా అందించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోజువారీ ఆదాయం రూ.17 కోట్లు మించితేనే ఆర్టీసీ గట్టెక్కగలుగుతుందని యాజమాన్యం భావిస్తోంది. ఈ దిశగానే వందరోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. కాగా, రైల్వే, ఆర్టీసీ కార్గో ఉమ్మడిగా సేవలు అందించనున్నాయి. ఈ మేరకు సరుకును సంయుక్తంగా రవాణా చేసే అంశంపై శనివారం చర్చలు జరిపాయి

*రంజాన్‌ మాసం ప్రారంభం కావటంతో ప్రభుత్వం ముస్లిం కుటుంబాలకు కానుకలు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 2.24 లక్షల ముస్లిం కుటుంబాలకు రంజాన్‌ తోఫా (కానుకలు) ఇవ్వనున్నారు. తోఫాలో చీర, కుర్తా పైజమా సెట్‌ సల్వార్‌ ఉంటాయి. మసీదుల వద్ద ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేసి వీటిని అందజేస్తున్నారు. ఇఫ్తార్‌ కోసం ఒక్కో మసీదుకు రూ. లక్ష కేటాయించారు. నగరంలో 300 మసీదుల్లో వీటి పంపిణీ చేపట్టనున్నారు.

*ఆర్టీసీ ఛార్జీల పెంపు, విద్యుత్ సమస్యలపై కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ధరల్లోను, పరిపాలనలో ప్రజల భారం పోతున్నారని మండిపడ్డారు. సామాన్య ప్రజల సహనాన్ని వైసీపీ పరీక్షిస్తోందని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు.

*తాడేపల్లి రైతులు గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌కు పోస్ట్‌కార్డులు రాశారు. కారుణ్య మరణాలకు అనుమతివ్వాలని కోరుతూ రైతులు పోస్ట్‌కార్డులు రాశారు. యూ-1 జోన్ తొలగించాలని కోరారు. జోన్‌ను తొలగించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు భరించలేకపోతున్నామన్నారు. దీనిపై రైతులు గత 13 రోజులుగా తాడేపల్లిలో రిలే దీక్షలు చేస్తున్నారు.

*మైలవరంలో వీధి కుక్కలు హల్‌చల్ చేశాయి. గ్రామపంచాయతీ పరిధిలోని హాజీపేట, నూజివీడు రోడ్డులలో ఆదివారం ఉదయం ఏకకాలంలో తొమ్మిది మందిపై వీధి కుక్కలు దాడి చేశాయి. వారికి తీవ్ర గాయాలు కావడంతో అందరినీ మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీధికుక్కల దెబ్బకు స్థానికులు బెంబేలెతిపోతున్నారు. గ్రామపంచాయతీ అధికారులు స్పందించి కుక్కలను పట్టే కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుతున్నారు.

*హోలగుందలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ ముందు ఇరు వర్గాలు మోహరించాయి. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి హోలగుందలోనే మకాం వేశారు. నిన్న హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన శోభాయాత్రలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

*విజయవాడ నగరంలోని ఏనికేపాడులో దారుణం జరిగింది. ఓ వ్యాపారి నిర్లక్ష్యనికి డిగ్రీ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు విషయానికొస్తే… ఓ దుకాణంలో విద్యార్థి వాటర్ బాటిల్ అడిగితే ఆ దుకాణదారుడు యాసిడ్ బాటిల్ ఇచ్చినట్లు బాధిత కుటుంబీకులు వాపోతున్నారు. దాహంతో విద్యార్థి చైతన్య గడగడా తాగినట్లు చెబుతున్నారు. యాసిడ్ లోపలికి వెళ్లడంతో తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిపాలు కాల్సి వచ్చింది. అవయవాలపై తీవ్ర ప్రభావం పడింది. లయోల కళాశాలలో విద్యార్థి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. చైతన్య వైద్యానికి కళాశాల యాజమాన్యం విరాళాలు సేకరిస్తోంది.

*రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు మే 24వ తేదీతో ముగుస్తున్నందున జూనియర్‌ కళాశాలలకు మే 25 నుంచి జూన్‌ 20 వరకు వేసవి సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. మరోవైపు ఒకటో తరగతి నుంచి 9వ త రగతి సమ్మేటివ్‌-2 పరీక్షలు ఏప్రిల్‌ 22 నుంచి మే 4 వరకు నిర్వహించనున్నారు. అవి పూర్తవగానే వేసవి సెలవులు ఇవ్వనున్నారు. పదో తరగతి పరీక్షలు ఈ నెల 27నుంచి మే 9వ రకు జరగనున్నాయి. అనంతరం ఆ విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు.

*రాష్ట్రంలో 18 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో కొందరు స్పెషల్‌గ్రేడ్‌ డి ప్యూటీ కలెక్టర్లు కూడా ఉన్నారు. అనకాపల్లి జిల్లా రెవెన్యూ అధికారిగా ఇటీవలే పోస్టింగ్‌ పొందిన ఎస్‌. వెంకటేశ్వర్లను విశాఖపట్టణంలోని నేషనల్‌హైవేకు బదిలీ చేశారు. ఒంగోలు ఆర్డీఓగా ఉన్న పి. వెంకటరమణను అనకాపల్లి డీఆర్‌ఓగా బదిలీ చేశారు. కాగా, ఒంగోలుగా ఆర్డీఓగా పి. విశ్వేశ్వరరావును నియమించారు. ఎస్‌. వెంకటేశ్వర్లు అనకాపల్లి డీఆర్‌ఓగా పట్టుమని పది రోజులు కూడా పనిచేయకముందే ఆయన్ను బదిలీ చేయడం ఇప్పుడు అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విశాఖపోర్టు ట్రస్టు ఎస్టేట్‌ మేనేజర్‌గా జి. జవహర్‌లాల్‌ నెహ్రూ, సీసీఎల్‌ఏ కార్యాలయంలో అసిస్టెంట్‌ సెక్రెటరీగా వీరవల్లి శైలజ, ప్రకాశం జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్‌గా పి. గ్లోరియాను నియమించారు. అన్నమయ్య జిల్లా డీఆర్‌ఓగా సత్యనారాయణరావు, కె.సత్యవతిని తిరుపతిలో దేవాదాయ భూముల రక్షణ విభాగానికి బదిలీ చేశారు.గుళ్ల నుంచే వసూళ్లు!

*ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(ఏపీటీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షురాలిగా చెన్నుపాటి మంజుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయ సంఘానికి అధ్యక్షురాలిగా మహిళ ఎన్నికవడం ఇదే తొలిసారి. ఈమె ప్రకాశం జిల్లాకు చెందినవారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె. భానుమూర్తి ఎన్నికయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో శనివారం ఈ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా వారి పేర్లను పి. పాండురంగ వరప్రసాద్‌బి. వెంకట రమణరాజులు ప్రతిపాదించగా మిగిలిన వారు మద్దతివ్వడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఉపాఽధ్యక్షులుగా ఎ. శ్యాంసుందర్‌రెడ్డి(కడప)కె. అశోక్‌కుమార్‌(అనంతపురం)తమరాన త్రినాథ్‌(విశాఖపట్నం)కె. నాగసోమేశ్వరవర్మ(కృష్ణా)ఎన్‌. సుబ్రహ్మణ్యం(నెల్లూరు)రాష్ట్ర కార్యదర్శులుగా బి. నరసింహులుడి. సరస్వతిబీఏ సాల్మన్‌రాజు, చాంద్‌బాషా, బి. రఘుబాబు, ఎన్‌. రవికుమార్‌లు ఎన్నికయ్యారు

*శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడాన్ని నిరసిస్తూ మండల పరిషత్‌ కార్యాలయానికి ఎంపీపీ వాన గోపి శనివారం తాళాలు వేశారు. ఉదయం 10.35 గంటలకు ఎంపీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికి ఒక్క సీనియర్‌ అసిస్టెంట్‌ తప్ప ఎవరూ హాజరుకాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ.. కార్యాలయానికి తాళం వేశారు. 11.18 గంటల సమయంలో ఈవోపీఆర్డీ శ్యామలాకుమారి రాగా, 11.30 తరువాత ఒక్కొక్కరుగా హాజరయ్యారు. సూపరింటెండెంట్‌ వచ్చారా అని ప్రశ్నించగా.. ఆయన సెలవులో ఉన్నారని ఎంపీడీవో వీవీ గోపాలకృష్ణ తెలిపారు. ఇష్టముంటే పనిచేయండి.. లేకపోతే వెళ్లిపోండి అంటూ ఎంపీపీ తీవ్రస్థాయిలో హెచ్చరించడం చర్చనీయాంశమైంది

*ఈస్టర్‌ పండుగను పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్‌ చర్చిలో ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటల నుంచి ఈస్టర్‌ వేడుకలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. గుడ్‌ ఫ్రైడే రోజు శిలువపై అసువులు బాసిన యేసు ప్రభువు మూడో రోజున సమాధి నుంచి భక్తులకు దర్శనమిస్తాడు. కాళ్లు, చేతులకు కొట్టిన మేకుల గాయాలను చూసి గుర్తెరిగి యేసయ్య లేచి వచ్చాడని ప్రజలు ఆనందోత్సాహాలతో ఉప్పొంగి పోతారు.