Business

భారత్‌లో 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు – TNI వాణిజ్య వార్తలు

భారత్‌లో 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు  – TNI వాణిజ్య వార్తలు

* వచ్చే మూడేళ్లలో భారత్‌లో 1 బిలియన్‌ డాలర్ల మేర (సుమారు రూ. 7,500 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు టెస్ల పవర్‌ యూఎస్‌ఏ వెల్లడించింది. పవర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ (పాస్‌) కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ నిధులు వినియోగించనున్నట్లు సంస్థ చైర్మన్‌ జాన్‌ హెచ్‌ రట్సినస్‌ తెలిపారు. భారత్‌లో విద్యుత్‌ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దేశీ వినియోగదారులకు బ్యాటరీలు, విద్యుత్‌ స్టోరేజీ సొల్యూషన్స్‌ అందించేందుకు ’పాస్‌’ విధానం ఉపయోగపడగలదని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ’మిషన్‌ 1,000’ కార్యాచరణ ప్రణాళికను కూడా కంపెనీ ఆవిష్కరించింది. దీని ప్రకారం 2022–23లో రూ. 1,000 కోట్ల టర్నోవరు, 1,000 క్లయింట్లు, అదే స్థాయిలో ఎక్స్‌క్లూజివ్‌ టెస్లా షాప్స్‌ (సేల్స్, సర్వీస్‌ సెంటర్లు) ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నట్లు టెస్లా పవర్‌ యూఎస్‌ఏ ఎండీ కవీందర్‌ ఖురానా తెలిపారు.
*
* ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిన్‌ తన ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్తను అందించనుంది. ఈ నెల నుంచి ఇన్ఫోసిస్‌ తన ఉద్యోగులకు భారీగా వేతనాలను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
*జీప్‌ ఇండియా మార్కెట్లోకి కంపాస్‌ నైట్‌ ఈగిల్‌ వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.21.95 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). 2 లీటర్‌ డీజిల్‌ ఇంజన్‌, సిక్స్‌ స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో పాటు 1.4 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌, 7 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో జీప్‌ కంపాస్‌ నైట్‌ ఈగిల్‌ వేరియంట్‌ అందుబాటులో ఉండనుంది.
*జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ.. ఎక్స్‌4 మోడల్‌లో సిల్వర్‌ షాడో ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ కారు ధరలు రూ.71.9 లక్షలు- రూ.73.9 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) ఉన్నాయి. 2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌, 3 లీటర్‌ డీజిల్‌ ఇంజన్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉండనున్న ఈ మోడల్‌ను చెన్నైలోని ప్లాంట్‌లో స్థానికంగా ఉత్పత్తి చేసినట్లు తెలిపింది.
*సాస్‌ ప్లాట్‌ఫామ్‌పై సేవలందిస్తున్న హెచ్‌ఆర్‌ టెక్‌ కంపెనీ ఎక్స్‌పెర్షియా ఏఐలో హైదరాబాద్‌కు చెందిన ఎర్లీ స్టేజ్‌ వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ ఎండియా పార్ట్‌నర్స్‌ పెట్టుబడులు పెట్టింది. చిరాటే వెంచర్స్‌తో కలిసి 12 లక్షల డాలర్ల (దాదాపు రూ.8.64 కోట్లు) పెట్టుబడులు పెట్టినట్లు ఎండియా వెల్లడించింది.
*క్రూడాయిల్‌, ఇతర కమోడిటీల ధరల పెరుగుదల ప్రభావంతో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) మార్చి నెలలో నాలుగు మాసాల గరిష్ఠ స్థాయి 14.55 శాతానికి దూసుకుపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇది 13.11 శాతం ఉండగా గత ఏడాది మార్చిలో 7.89 శాతం ఉంది. వరుసగా 12 నెలలుగా టోకు ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో ఉంటూ వస్తోంది. గత ఏడాది నవంబరులో టోకు ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయి 14.87 శాతాన్ని తాకింది. టోకు ద్రవ్యోల్బణం పెరుగుదలలో అధిక వాటా క్రూడాయిల్‌ ధరలదేనని వాణిజ్య శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి.
*ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) చార్జింగ్‌కు అవసరమైన చార్జర్లను, సాఫ్ట్‌వేర్‌ను తయారు చేస్తున్న ‘ర్యాపిడ్‌ఈవీచార్జిఈ’ తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఏడాదిన్నర కాలంలో దాదాపు 1,000 ఈవీ చార్జింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా విస్తరించే వ్యూహంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చానల్‌ పార్ట్‌నర్స్‌ ద్వారా 1,000 ఈవీ చార్జింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ర్యాపిడ్‌ఈవీ వ్యవస్థాపకుడు, సీఈఓ పీ శివసుబ్రమణియమ్‌ తెలిపారు. ఈవీ చార్జర్లకు అవసరమైన 98 శాతం విడిభాగాలను దేశీయంగా సమకూర్చుకుంటున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో చార్జింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయడంతో పాటు చార్జర్ల తయారీకి ఫ్రాంచైజీ ప్రాతిపదికన ఇక్కడి కంపెనీలతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
* అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ ఆక్యుజెన్‌.. మెక్సికో లో కూడా ‘కొవ్యాక్సిన్‌’ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో మొత్తం ఉత్తర అమెరికాలో కొవ్యాక్సిన్‌ను మార్కెట్‌ చేసే హక్కులు ఆక్యుజెన్‌కు లభించినట్లవుతుంది. అమెరికాలో కొవ్యాక్సిన్‌పై పరీక్షలు నిర్వహించి, వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావడానికి గతంలో ఆక్యుజెన్‌, భారత్‌ బయోటెక్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో సవరణలు చేసి మెక్సికో హక్కులను కూడా ఆక్యుజెన్‌కు అప్పగించారు. ఇప్పటికే పెద్దలు కొవ్యాక్సిన్‌ను తీసుకునేందుకు మెక్సికో ఆరోగ్య నియంత్రణ సంస్థ అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చింది. 2-18 ఏళ్ల వయసు ఉన్న వారు కూడా వినియోగించేందుకు వీలుగా అనుమతి కోరారు. మెక్సికోలో కూడా కొవ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి హక్కులు లభించడం సంతోషంగా ఉందని ఆక్యుజెన్‌ ఇంక్‌ సీఈఓ శంకర్‌ ముసునూరి తెలిపారు.
*మళ్లీ కరోనా విజృంభిస్తుండటంతో విమానసర్వీసులు నిలిచిపోతున్నాయి. హాంకాంగ్ దేశ అధికారులు విధించిన కొవిడ్ ఆంక్షల ఫలితంగా హాంకాంగ్‌కు భారతదేశం నుంచి విమాన సర్వీసుల రాకపోకలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ‘‘హాంకాంగ్ అధికారులు విధించిన కొవిడ్ ఆంక్షల వల్ల ఏప్రిల్ 19, 23 తేదీల్లో విమాన సర్వీసులను రద్దు చేశాం’’ అని ఎయిర్ ఇండియా ట్వీట్ చేసింది.
*ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్లకు బీమా కంపెనీలు చాలా సమయం తీసుకుంటున్నాయి. ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్‌ల పరిష్కారానికి బీమా కంపెనీలు ఎంత లేదన్నా, సగటున 20 నుంచి 46 రోజుల సమయం తీసుకుంటున్నాయి. ఇన్సూరెన్స్‌ బ్రోకరేజ్‌ సంస్థ ‘సెక్యూర్‌నౌ’ ఒక నివేదికలో వెల్లడించింది.
* దేశ ప్రజల్లో 80 శాతం వినియోగించే గృహోపయోగ వినియోగ వస్తువు (ఎఫ్‌ఎంసీజీ)ల్లో 30,000 బ్రాండ్లు (80%) సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) నుంచే వస్తున్నాయి. మిగతా 20 శాతం (3,000) మాత్రమే కార్పొరేట్‌ సంస్థల వాటా అని చిరు వ్యాపారులకు ప్రాతినిధ్యం వహించే సీఏఐటీ సర్వే వెల్లడించింది.
*కోల్ ఇండియా లిమిటెడ్ తన సొంత ఇ-వేలం ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించనుంది. మైనింగ్ మేజర్ కొత్త, ఇప్పటికే ఉన్న బిడ్డర్‌లను పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని తెలియజేసినట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం, ఇ-వేలం పోర్టల్‌ను mjunction, ప్రభుత్వ యాజమాన్యంలోని MSTC లిమిటెడ్ నిర్వహిస్తోంది. కోల్ ఇండియాకు ఏటా 120 మిలియన్ టన్నుల ఇ-వేలం విక్రయాలు జరుగుతాయి. ఇ-వేలం పోర్టల్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసింది. సీఐఎల్ అనుబంధ సంస్థ సెంట్రల్ మైన్ ప్లానింగ్డిజైన్ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్ సహకారంతో ఉంది.
*విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ… డోర్నియర్ 228 ఫ్లయింగ్ శిక్షణా సంస్థ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. ఇప్పటివరకు, ‘డోర్నియర్ 228’ విమానాలను ఇప్పటివరకు సాయుధ దళాలు మాత్రమే ఉపయోగిస్తున్నాయి. అలయన్స్ ఎయిర్ మేడ్-ఇన్-ఇండియా డోర్నియర్ 228 ఎయిర్‌క్రాఫ్ట్ మంగళవారం దిబ్రూగఢ్-పాసిఘాట్ రూట్‌లో తన మొదటి వాణిజ్య విమానానికి నియోగించనున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు 17 సీట్ల డోర్నియర్ 228 ఎయిర్‌క్రాఫ్ట్‌లను లీజుకు తీసుకునేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో కేంద్రం ఆధ్వర్యంలో నడిచే అలయన్స్ ఎయిర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిర్‌లైన్ తన మొదటి డోర్నియర్ 228 విమానాన్ని ఏప్రిల్ 7న అందుకుంది.
*ఐఎంఎఫ్(అంతర్జాతీయ ద్రవ్యనిధి) సంస్థ నుండి $4 బిలియన్ల బెయిలౌట్ ప్యాకేజీని కోరేందుకు శ్రీలంక ప్రతినిధి బృందం అమెరికా వెళ్లింది. కొత్తగా నియమితుడైన ఆర్థిక మంత్రి అలీ సబ్రీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఏప్రిల్ 19-24 మధ్య ఐఎంఎఫ్‌తో చర్చలు జరపనుంది. ప్రస్తుతం తీవ్రమైన ఫారెక్స్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నందున… నాలుగు బిలియన్ డాలర్ల ప్యాకేజీని పొందేందుకు ఐఎంఎఫ్‌తో పాలుపంచుకోవడానికి శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధి బృందం ఈ రోజు(ఆదివారం) అమెరికా పయనమైంది.
* క్యాప్టివ్‌ ఇన్సూరెన్స్‌, స్టాండ్‌ఎలోన్‌ మైక్రో ఇన్సూరెన్స్‌ వంటి కొత్త రకం బీమా వ్యాపారాల్లోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎ్‌ఫడీఐ)ను అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత బీమా అభివృద్ధి, నియంత్రణ మండలి (ఐఆర్‌డీఏఐ) చైర్మన్‌ దేవాశిష్‌ పాండా.. ఇన్సూరెన్స్‌ పరిశ్రమకు సంబంధించిన ఓ సదస్సులో ఈ దిశగా సంకేతాలిచ్చారు. దేశంలో బీమా రంగ పరిధిని మరింత విస్తరించేందుకు కొత్త రకం ఇన్సూరెన్స్‌ వ్యాపార సంస్థలకు ప్రవేశం కల్పించేందుకు ప్రత్యేక నియమావళిని ఏర్పాటు చేసే ఆలోచన ఉందని సదస్సులో ఆయన పేర్కొన్నారు.
*ఆంధ్రప్రదేశ్‌ కాకినాడలోని యూరియా ఉత్పత్తి ప్లాంట్‌-2లో నాగార్జునా ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ (ఎన్‌ఎ్‌ఫసీఎల్‌) ఉత్పత్తిని పునఃప్రారంభించింది. శుక్రవారం (ఏప్రిల్‌ 15) ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించామని.. 20 తేదీ నాటికి యూరియా ఉత్పత్తిలో స్థిరీకరణ జరుగుతుందని కంపెనీ వెల్లడించింది. గత ఏడాది డిసెంబరులో మొద టి ప్లాంట్‌లో ఉత్పత్తిని కంపెనీ చేపట్టింది. కాకినాడలో దాదాపు 1,130 ఎకరాల్లో ఎన్‌ఎ్‌ఫసీఎల్‌ యూరియా ఉత్పత్తి కాంప్లెక్స్‌ విస్తరించి ఉంది. సహజ వాయువు ఆధారంగా కంపెనీ ఇక్కడ యూరియాను తయారు చేస్తోంది.